"అయితే కృష్ణారావు చచ్చేప్పుడు అతడికి చేసిన వాగ్దానం సంగతి ఏమిటి?"
"పారిజాత అతడి కాళ్ళమీదపడి తీసుకువచ్చి ఆమాట చెప్పించింది అతడితో."
"పోమ్మా! స్నేహితురాలివైపు వకాల్తా తీసుకొంటే ఇక్కడ నమ్మేదెవరు? అతడు కలవాళ్ళ అబ్బాయి. ఈమె అందమైన అమ్మాయి. ఇద్దరూ ఒక కాంపౌండ్ లో ఉన్నారు. ఇద్దరూ ఆకర్షణలో పడకపోతే ఆశ్చర్యంకాని పడితే ఆశ్చర్యం ఏం లేదు."
పారిజాత చెడిపోయినదానిలా ప్రచారం కావడం చూసి ఖిన్నురాలైంది లలిత. రంగనాధం లాంటి పెద్దమనిషి కేవలం ఈర్ష్య చేత అలా అనడు. బయట ఎవరో అనుకోగా వినే అని ఉంటాడు.
రంగనాధంతో ఇక ఏంవాదించడానికీ మనస్కరించక మౌనంగా వచ్చేసింది లలిత. కామమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి స్నేహితురాలిని తీసుకురమ్మని భర్తను కోరితే, అతడు ఆఫీస్ లో ఆడిట్ అవుతున్నదనీ ఒక పూటకూడా సెలవు తీసుకోడానికి వీలుకాదని చెప్పేశాడు. స్నేహం ఎంత అమూల్యమైన దైతేనేం? తనేమీ సహాయం చేయలేకపోతున్నందుకు కుమిలిపోయింది లలిత.
12
పారిజాత పెళ్ళికూతురు అయ్యింది. కామమ్మ రెక్కపట్టి లాక్కుపోసాగింది. పీటలమీదికి.
"ఈ పెళ్లి నేను చేసుకోను. నాకీ పెళ్ళి వద్దు" అరుస్తూ, ఏడుస్తూ, గింజుకోసాగింది పారిజాత.
"చేసుకోదట! చేసుకోక ఏం చేస్తుందో? ఆ మూడు ముళ్ళూ పడితే కుక్కినపేనులా పడివుండదూ?" కామమ్మ పారిజాతను లాక్కుపోయి పీటలమీద దభిల్లున కూలేసింది.
"మంగళసూత్రం తీసికోండి.... బాజాలు మ్రోగించమనండి" బ్రాహ్మడు వడివడిగా మంత్రాలు చదవసాగాడు.
గున్న ఏనుగు లేచినట్టుగా లేచాడు హనుమంతు. మంగళసూత్రం తీసుకొన్నాడు.
"ఆగండి"
గర్జనలా వినిపించింది ఒక కంఠం.
ఆశ్చర్యంతో, భయంతో అందరి కన్నులు అటు తిరిగాయి.
బలిష్టంగా, పొడుగ్గా ఉన్న యువకుడొకడు నిలబడి ఉన్నాడు. నడుముకు చేతులు పెట్టుకొని గంభీరంగా, తీక్షణంగా చూస్తున్నాడు. మృగరాజును చూసిన అడవి జంతువుల్లా అందరూ గజగజ వణికి పోసాగారు.
ముందుగా కామమ్మ తేరుకొని, "ఎవరు, నాయనా? నువ్వు" అని అడిగింది.
"పారిజాతను ప్రేమించినవాణ్ని. పారిజాతను పెళ్ళి చేసుకోబోతున్న వాడిని." మనోహర్ గంభీరంగా పలికాడు. "లే, పారూ" పారిజాతకు చెయ్యి అందించాడు.
అతడి చెయ్యి అందుకుని ముగ్ధలా నడవ సాగింది పారిజాత
పెళ్ళివాళ్ళంతా నోళ్ళు తెరుచుకు చూడసాగారు.
స్వర్గంలో తేలిపోతున్నట్టుగా ఉంది పారిజాతకు.
పారిజాత వీపుమీద దభీమని వ్రేటుపడింది. పారిజాత అందంగా చిత్రించుకొంటున్న కలచెదిరి పోయింది.
"ఏమిటే ఆ మైమరపు? గంటసేపటినుండి చేతిలో ఆగిన్నె అలా పట్టుకొని ఏ లోకంలోకి చూస్తూన్నావు? ఏం కలలు కంటున్నావు?" కామమ్మ కాళిలా ఎదుటనిలబడింది.
"అయిపోయిందత్తా!" పారిజాత గబగబా గిన్నె రుద్దసాగింది.
"తొందరగా తెములు. వంట పన్నెండు గంటలకల్లా అయిపోవాలి. మీ మామకు పన్నెండుగంటలకల్లా కారియర్ పంపించెయ్యాలి?"
ఆజ్ఞ జారీచేసి అవతల వ్యవహారానికి వెళ్ళింది కామమ్మ.
ప్రొద్దుటినుండి తనకు పరిచితమైన పదధ్వనులకోసం చెవులు రిక్కించుకొని వింటూన్నది పారిజాత. మనూకి నిన్న ఉత్తరం అంది ఉంటుంది. ఆ రోజు తప్పకరావాలి! అతడి రాకకోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నది పారిజాత.
రెండురోజుల నిరీక్షణ నిస్పృహగా మారిపోయింది. కళ్ళలో విషాదం లాంటి భావం చోటు చేసుకొంది. మనూ! నువ్వెంత మారిపోయావు? మన మధ్యఉన్న అనుబంధం మిధ్య అయినా కనీసం ఒక పరిచయస్తుడిగా , మనసున్న ఒక మనిషిగానైనా నన్ను ఆదుకోడానికి రాలేక పోయావా? కనీసం ఒక మనిషిగానైనా! సహాయం చేయడానికి మీ అమ్మకూ, లోకానికీ జడిశావా?
