Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 31


    దేవదాసి మరేదో అనే లోపుగానే తల్లి హడావుడిగా వచ్చింది. "వెళ్ళొస్తాను, అల్లుడూ!"

    "మంచిదత్తా."

    పద, దేవీ, బండి కట్టారు."

    తల్లిని అనుసరిస్తూన్న దేవదాసి ఒక్కక్షణం ఆగి వెనుదిరిగి చూసింది. చివరి చూపు అనుకొంటూ ఆవేదనా భరితాలైన బావ చూపులు ఎదుర్కొనలేక చూపులు త్రిప్పుకొని కదిలి వడివడిగా వెళ్ళి తల్లిని కలిసిన దేవదాసికి ఎక్కడో విన్నపాట గుర్తొచ్చింది - "వియోగవేళల విరిసేప్రేమల విలువను కనలేవా?"

    "భగవాన్, నన్ను పిచ్చిదాన్ని చేయకు" అనుకుంది!
   


                                   11


    గోపాలదేవులు భోజనాంతరం ఓ కునుకు తీసి అప్పుడే లేచారు. "దేవతా, ఈ వేళభాగవతం తీసుకో. రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదువు, తల్లీ!" అన్నారు మనుమరాలితో.

    "మొన్న అష్టమ స్కంధంలో వామన చరిత్ర దాకా చదివాను కదా, తాతయ్యా? అది వదిలేసి రుక్మిణీ కళ్యాణం చదువనా? ఎందుకు?"

    "రుక్మిణీ కళ్యాణమే చదువమ్మా, రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదివితే కన్నెపిల్లకు తొందరగా పెళ్ళవుతుందట" సన్నగా నవ్వారు గోపాలదేవులు.

    సిగ్గుపడింది దేవదాసి.

    "ఇటుచూడు, దేవతా! ఈచేతిమీద వాపు చూడడం మూడవసారి, ఏడుసార్లు ఈ వాపు ఎక్కి  దిగితే భగవంతుని పిలుపు అందినట్లే. నాకే కోరికలూ మిగిలిఉండలేదు. నీ పెళ్ళి చూడాలనిమాత్రం ఉంది. ఆ కాస్తాచూస్తే ఇకచూడవలసిందేమీ ఉండదు. భగవంతుడు ఎప్పుడు పిలిచినా తయారే!" గోపాలదేవుల ఆరోగ్యం ఈ మధ్య కొంత దెబ్బతిన్నది. వెన్నుపోటుతో, కీళ్ళనొప్పులతో బాధపడుతున్నారు. ఏనాడూ ముక్కు చీది పడిశం పట్టిందని అనని ఆయన!

    సిగ్గుపడుతూనే దశమస్కంధం విప్పింది దేవదాసి.

    శ్రావ్యకంఠంతో రుక్మిణీ కళ్యాణ ఘట్టం తాతగారి కన్నులముందు నిలుపుతున్నా, దేవదాసి మనసుమాత్రం పరిపరి విధాలుగా పోతున్నది. మేనత్త ఊరినుండి తిరిగి వచ్చినప్పటినుండి ఆమె జీవితంలో గ్రహణం పట్టినట్లుగా ఉంది. కన్నె సహజమైన ఉత్సాహానందాలు హరించుకుపోయి బరువుగా గంభీరంగా ఉంటున్నది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకొని వచ్చినట్లుగా మనసు దేనినో వెదుకులాడుకొంటూంటుంది!

    మనసును మరిపించే ప్రయత్నంలో తొలుతటికంటే ఎక్కువకాలం తాతగారి సేవలో గడుపుతూంది.

    ఆనాడు మధ్యాహ్నం సూర్యదేవుల భోజనం చేస్తూండగా శ్రీలక్ష్మి చెప్పింది. "ఈ రోజు మామగారు చాలా సుస్తీగా కనిపించారు. పూజకు బావినుండి నీళ్ళు తీసుకోబోయినప్పుడు బావిలో చేదవేసి తూలారట. దేవత చెప్పింది."

    సూర్యదేవులు చేయికడిగి లేస్తూనే, తాంబూలం కూడా వేసుకోకుండా తండ్రి గదిలోకి దారితీశారు.

    రుక్మిణీ కళ్యాణం అయిపోవచ్చింది. గోపాలదేవులు కన్నులు మూసుకొని పారవశ్యం అభినయిస్తున్నారు. మనుమరాలిగానానికి, లయగా తల ఆడిస్తూ.   

    సూర్యదేవులు వెళ్ళి నిశ్శబ్దంగా మంచంమీద కూర్చొన్నారు. చదువుతున్నది అయిపోయేవరకూ. అయిపోతూనే అన్నారు. ఇవాళ చాలా సుస్తీగా కనిపించారంటుంది మీ కోడలు ఎలా ఉంది, నాన్నా?"

    "ఆఁ ఇవాళ అంత బాగుండలేదు. ఒంట్లో."

    "పంతులు నీలయ్యకు కబురు చేయనా. సాయంత్రం వచ్చిచూడమని?"

    "ఎందుకు? అక్కర్లేదు మరణకాల రోగాలకు మందులేమిటి! దేవుడు పిలుస్తున్నాడని ఆనందంగా ఉంది నాయనా కాని దేవత పెళ్ళొకటి చూచిపోవాలని ఉంది?"

    తాంబూలం చిలకచుట్టి తెచ్చి, మామగారి ఎదుట తనిస్తే బాగుండదని కూతురిచేత ఇప్పించింది భర్తకు శ్రీలక్ష్మి "రేపు దశమిరోజు తిరుమలాపురం వాళ్ళు వస్తున్నామని కబురుచేశారు మామయ్యా. తొందరగా దేవతను ఒక అయ్యచేతిలో పెడితే నిశ్చింత అని మీ అబ్బాయితో పోరుతూనే ఉన్నాను. ఆయనేమో ఏవేవో వ్యవహారాలలో మునిగి కూతురిపెళ్ళి పట్టించుకోవడంలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS