Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 31

    
    ఆ రాత్రి మళ్లీ భర్తతో కూతురు గురించిన భయమే వెల్లడించింది, "దాని ఆలోచనలు చాలా వికృతంగా సాగుతున్నాయండీ. అది ముదిరిపోకముందే దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే బ్రతికిపోతాం. ఈ వేసవిలో దాని పెళ్లి చేసేద్దాం. ఇప్పటినుండి సంబంధాలు వెదికితే అప్పటికికుదురుతుంది!"

    "నీ ఆలోచన  చాలా దారుణమనిపిస్తోంది హేమా! పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని దాని ప్రగాఢమైన కోరిక! ఇంకొక్క రెండేళ్లు ఓపికపడితే దానిచదువు అయిపోతుంది. అప్పుడది అభ్యంతర పెట్టటానికేమీ వుండదు" అన్నాడు కృష్ణారావు.

    "ఈ రెండేళ్లలో తొండముదిరి ఊసరవెల్లి అవుతుంది మనం నెత్తీ, నోరు కొట్టుకుని ఏడవాలి."

    "ఏంకాదు..... అప్పుడు దాని ఆలోచనలకు ఒక పరిపక్వత వస్తుంది. ఇప్పుడున్న తెలిసీ తెలియని మాటలు అప్పుడుండవు.  నువ్వు అనవసరంగా కంగారుపడి  నన్ను కంగారుపెట్టకు." అన్నాడు కృష్ణారావు.

    "మన పెంపకంమీద నాకా నమ్మకం వుంది... హరిత తల్లి దండ్రులను అవమానించేట్టు ఎప్పుడూ ప్రవర్తించదు....."

    "ఇక మీ ఇష్టం. ఈ విషయంమీద యింకెప్పుడూ మాట్లాడను.' హేమలత మూతి ముడుచుకుంది.


 
                       *    *    *    *   



    హరితకు పరిచయమున్న డౌరీడెత్ కమిటీ మెంబరును కలిసి వస్తున్నారు హరితా, ప్రమిలా -

     "ప్రక్కింటమ్మాయితో కలిసి వెళ్లి గాజులు తెచ్చుకొంటాను అనిచెప్పి వచ్చాను ఇంట్లో. ఇక్కడెక్కడైనా గాజుల షాపుందా?" అనడిగింది ప్రమీల.

    "ఉంది"

    గాజులషాపులోంచి ఇద్దరూ బయటికి వస్తూంటే ప్రమీల భర్త లక్ష్మీ కాంతం వీళ్లవంకే అనుమానంగా చూస్తూ కనిపించాడు.

    ప్రమీల గుండెలో రాయిపడ్డట్టుగా అయింది.

    "ఇప్పుడెలా హరితా? ఇంతసేపూ ఎక్కడికెళ్లావని నిలదీస్తాడేమో!"

    "హరిత పనిమీద కోటివరకు వెళ్లివచ్చామని చెప్పలేవూ!"

    "చెప్పినా నమ్మడు! వట్టి అనుమానం మనిషి!"

    "ఇంకెంత? నాలుగురోజులు ఓపికపట్టు. డౌరీడెత్ కమిటి మెంబర్లంతా కలిసివచ్చి, అదరగొట్టి పోతారు! పులి లాంటి మనిశషి పిల్లిగాకపోతే చూడు.'

    "యిలాంటి బెదిరింపులతో నా సంసారం చక్కబడుతుందన్న నమ్మకం నాకెందుకో కలగడం లేదు"

    "ఈ నీరసమూ, నిస్పృహే మీలోంచి పోవాలండీ! నా ఖర్మ ఇది భరించక తప్పదు! అనుకొన్నంత కాలం మీ మీద పురుషుడి దౌష్ట్యం సాగుతూనే వుంటుంది. మూగగా ఇంకెంతకాలం కుమిలిపోతారు. .. .తిరగబడి చూడండి! ముందు చైతన్యం, తెగువ మీలో రావాలండి. అదేమీలో వస్తే ఈ కమిటీ మెంబర్లుగాని, ఇంకెవరయినా గానీ మీ కోసం ఏమీ చేయలేరు. మీ సహకారం లేకుండా వాళ్లు ఏమీ చేయలేరు?"

    కాని, మరునాడు హరిత ఊహించనిదే జరిగింది.

    హరిత కాలేజీనుండి రాగానే తల్లి చెప్పింది. ప్రమీల పుట్టింటికి వెళ్లిపోయిందని.
 
    "అరే... ఇంత హఠాత్తుగా వాళ్ల వాళ్లు ఎవరైనా వచ్చి తీసికెళ్లారా?" ఆశ్చర్యంగా అడిగింది హరిత.
 
    "నువ్వు చేసిన నిర్వాకఫలం! రాత్రి ఆ అమ్మాయిని అనుమానంతో చావగొట్టాడట అతను - గాజులు కొంటానని చెప్పింది వట్టి అబద్దం! నిజంగా ప్రక్కింటమ్మాయితో కలిసి ఎక్కడికెళ్లావో చెప్పు. అని ఒకటే తన్నులూ గుద్దులూ నట. ఎంత కిరాతకుడో పచ్చి పుండుచేశాడు ఆ అమ్మాయిని! ఈ కాపురం నా వల్ల కాదండీ! అని ఏడుస్తూ వెళ్లిపోయింది పాపం!"

    "వచ్చే ఆదివారం డౌరీడెత్ కమిటీవాల్లు వచ్చి మాట్లాడడానికి అన్ని  ఏర్పాట్లూ చేసివచ్చానే!  ఆ ఒక్క సారికి ఓర్చుకోకపోయిందా" హరిత నిరాశగా అంది.

    "అది అదిరింపులతో, బెదిరింపులతో చక్కబడే సంసారం కాదని ఎప్పుడో చెప్పాను!"

    "ఇలా తెగదెంపులు చేసుకోవడమో,  లేక వుండినిత్యం అతడిచేతిలో తన్నులుతినడమో తప్ప ప్రమిల లాంటివాళ్లు మరోవిధంగా బ్రతికే అవకాశం లేదంటావా మమ్మీ?"

    "ప్రమీలభర్తలాంటి పురుష దురహంకారుల చేతిలో పడ్డ స్త్రీల సంగతి దినదినం కన్నీటి మయం తప్ప ఇంకేముంటుంది జీవితం?"

    "ఆ పురుష దురహంకారమే కూల్చి ప్రమీలలాంటి స్త్రీలు మరోవిధంగా జీవించేలా చేయాలనేనమ్మా నేటి స్త్రీ సంస్కరణవాదుల తాపత్రయం! వాళ్లు ఏదో చేసే అవకాశాన్ని ప్రమీలలాంటివాళ్లు కల్పించాలనిగాని నా ఖర్మ అని పారిపోతే ఎలా?"
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS