Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 32

    చైర్మన్ రాజభూషణరావు గారింటి డ్రాయింగ్ రూంలో నిన్నటిదాకా ఉన్న, నాలుగు ఫోటోల్లో ఇవాళ రెండే ఉన్నాయి?

    చేతిలో అంతవరకూ ఉన్న సిగరెట్ ని కోపంగా కసితీరా దూరంగా విసిరేశాడు. అతనెప్పుడూ ఇలా చెయ్యలేదు. అప్పుడే కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన రాజేశ్వరి విస్తుపోయింది. అయినా తన ఆశ్చర్యాన్ని బయట పెట్టకుండా కాఫీకప్పు రాజారామ్ ఎదురుగా పెట్టింది.

    "రాజేశ్వరీ ఒక పని చేస్తావా? ముందు మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి విరించి ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో. లేదా ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడో కనుక్కో..."

    రాజేశ్వరి రిసీవర్ ఎత్తి డయల్ చేసింది.

    "హలో నేనూ రాజేశ్వరిని....విరించిగారు అక్కడున్నారా?"

    "లేదే...మధ్యాహ్నం అనగా ఆయన ఆఫీసుకు వెళ్ళారు. ఇప్పటి వరకూ తిరిగిరాలేదు."

    "ఓకే" అంటూ ఫోన్ పెట్టేశాడు రాజారామ్.

    చైర్మన్ గారింటికి మళ్ళీ ఫోన్ చేసి ఇన్ స్పెక్టర్ దుర్గారావు కావాలని అడిగాడు. దుర్గారావు లైన్ లోకి రాగానే...

    "హలో ఇన్ స్పెక్టర్ నేను రాజారామ్ ని. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. సుందరిని చంపింది ఎవరో నేను కరెక్టుగా ఊహించలేకపోతున్నా కానీ, ఆ అమ్మాయి కజిన్ సిస్టర్ని అదే సుమిత్రని హత్యచేసింది ఎవరో కాదు...విరించి ఆ రోజు అతన్నే రమణి అక్కడా చూసింది. ఆ తర్వాత 'బేబీస్ యూనివర్స్'లో కూడా అతన్ని రమణి చూసింది. ఇవాళ రమణిని కిడ్నాప్ చేసి తీసుకుపోయింది కూడా అతనే వివరంగా చెప్పే వోపిక నాకు లేదు కాని, వెంటనే మీ వాళ్ళని ఎలర్ట్ చెయ్యండి. విరించి డ్రయివ్ చేస్తున్న మెటడార్ వాన్ నెంబర్ కనుక్కోండి. ఆ వాన్ ని ట్రేస్ చెయ్యడానికి ట్రయ్ చెయ్యండి ప్లీజ్ హర్రీ అప్?"

    "కాని.....రాజారామ్ గారూ..."

    "కానీలూ, గీనీలూ తీసి పారెయ్యండి. ఒక మిస్టేక్ చేసి ఇంతవరకూ తెచ్చారు. మరో మిస్టేక్ చేసి మా అమ్మాయి ప్రాణం తియ్యకండి."

    "కాని కేవలం అనుమానంతో..."

    అనుమానం కాదు....అయ్ కెన్ ప్రూవ్ ఇట్. ప్లీజ్ ఏక్ట్ ఎట్ వన్స్?"

    "సరే!"

    రాజారామ్ రిసీవర్ని క్రేడిల్ మీద ఉంచి రాజేశ్వరి వేపు చూశాడు.

    "విరించి గారేనని ఎలా చెప్పగలుగుతున్నారు?" అందామె.

    "సుమిత్ర ఇంట్లో విరించిని చూసింది రమణికి రమణిని విరించికూడా చూశాడు. రమణి ఎవరో విరించి తెలుసు. కాని రమణికి విరించి ఎవరో తెలీదు. ఈరోజు మనం వస్తున్నట్టు విరించికి మహాలక్ష్మి చెప్పి ఉంటుంది. అందుకే డ్రాయింగ్ రూంలో తన ఫోటోని చూసి రమణి గుర్తుపట్టి చెప్పేస్తుందన్న భయంతో ఆ రెండింటినీ తీసి విరించి దాచేశాడు..." అంటూ రాజారామ్ సిగరెట్ తీసి వెలిగించాడు.

    "పద చైర్మన్ గారింటికి వెళ్ళి ఆయనకీ సంగతి అంతా చెప్దాం." అంటూ లేచాడు.

    "ముందు కాఫీ తాగండి."

    "ఓకే..." అంటూ కాఫీ కప్పుని చేత్తో అందుకున్నాడు.

    "మీరు చెప్పింది నిజమా? పాపం ఈ సంగతి తెలిస్తే మహాలక్ష్మిగారి గుండె బద్దలై పోతుంది అంది రాజేశ్వరి.


                                0    0    0


    గదిలో చైర్మన్ రాజభూషణరావు, రాజారామ్ ఇద్దరే ఉన్నారు. రాజారామ్ చెప్పినదంతా విని ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. చాలాసేపటివరకూ ఏం మాట్లాడలేదు.

    "వాడేదో ఇలాంటి పిచ్చిపని చేస్తాడని నేను మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నాను. మొత్తానికి అనుకున్నంతా చేశాడన్నమాట. సరే ముందు మీ అమ్మాయి సంగతి చూడాలి. ఉండు పోలీస్ కమీషనర్ కి ఫోన్ చేస్తాను." అంటూ ఆయన రిసీవరెత్తి డయల్ చెయ్యడం ప్రారంభించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS