11
నెమ్మదిగా కళ్ళుతెరచి చూసింది రమణి. చుట్టూ చీకటిగా ఉంది. చటుక్కున లేచి కూర్చుంది. ఒక్కసారి గట్టిగా కళ్ళు నులుముకుంది. నలువేపులా కలయజూసింది.
తను ఉన్నది ఒక గదిలో...
గదిలోవున్న మంచంమీద...
గదిలో ఉన్న తలుపులన్నీ వేసి ఉన్నాయి.
ఏం జరిగింది?
తను ఇక్కడ ఎందుకుంది?
ఇక్కడింత చీకటేమిటి?
డాడీ ఎక్కడ?
అన్నట్టు...
ఆంటీ...అవును...ఆంటీ ఏదీ?
అలా ఆలోచిస్తున్నకొద్దీ ఏం జరిగిందో కొద్దికొద్దిగా గుర్తు రాసాగింది రమణికి.
తనూ, డాడీ, రాజేశ్వరి ఆంటీ బంజారా హిల్స్ వెళ్ళారు. పిక్నిక్ కాన్సిల్ అయింది. డాడీని భవానీ ఆంటీ 'కస్టడీలోకి' తీసుకుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్ వెళ్ళారు. తనకి భోజనం చేసిన కొంతసేపటికి జ్వరం వచ్చింది. తను మహాలక్ష్మి ఆంటీ బెడ్ రూంలో పడుకొంది. కొంతసేపటికి మెలకువ వచ్చింది. అప్పుడు తను లేచి అలా పోర్టికోలోకి వెళ్ళింది. అక్కడున్న మెటడార్ వేన్ ఎక్కి డ్రయివింగ్ సీటులో సరదాగా కూర్చుంది.
సరిగ్గా అప్పుడే వచ్చాడు ఆయన?
తెల్లని పాంటు...
తెల్లని షర్టు...
అతని ఉంగరంమీద ఏవో అక్షరాలు...
అతని కళ్ళు చీకట్లో నల్లపులిలా మెరుస్తున్నాయి. అతన్నే తను ఆ వేళ సాయంత్రం సుమిత్రా ఆంటీ వాళ్ళింట్లో చూసింది. అతని కోసమే పోలీసులు వెతుకుతున్నారు.
అతన్ని, చూడగానే కెవ్వుమని అరవబోయింది. రమణి. అతను చటుక్కున రమణి నోరు మూసేశాడు. అంతే ఆ తర్వాత ఏమయిందో....తను ఇప్పుడిక్కడ వుంది....మంచం దిగింది రమణి... 'అయ్యో...నా జోడేదీ...ఒక్కటే ఉందేమిటి?' అనుకుంది.
సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుంది. గుమ్మంలో అతను' నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. సినిమాల్లో తను చూసిన తాగుబోతు వాళ్ళలా అదోలా ఊగుతున్నాడు. ఛండాలం వాసన వొస్తోంది అతని దగ్గర్నుంచి...
భయంతో గజగజా వణికి పోయింది.
అతను రమణిని చూసి..."ఏమ్భయం లేదు....నిన్నేం చెయ్యను. ఇలా రా" అన్నాడు.
రమణికి ఎక్కడలేని ధైర్యమూ వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో 'డాడీ' ఆమెకి చెప్పాడు. కాలికున్న జోడుని వదిలేసి జోళ్ళు లేని కాళ్ళతో అతని వెంట నడిచింది.
ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక పెద్ద హాల్లో ఉన్నారు. ఎన్నో కుర్చీలూ, రెండు సోఫాలూ ఉన్నాయక్కడ. అతనొక సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తూ 'కూర్చో' అనగానే రమణి కూర్చొంది.
అతను టేబిలు మీదున్న ఓ సీసాని అందుకున్నాడు. అందులో ఉన్న దాన్ని గడగడా తాగాడు. అది చూడలేక మొహం పక్కకి తిప్పుకుంది రమణి.
కాసేపటికి అతను తెలిఫోన్ ని దగ్గరకు లాక్కుని ఏదో నెంబర్ డయల్ చేశాడు.
"హలో పోలీస్ కమీషనర్ వీరప్పగారేనా? నేను విరించిని మాట్లాడుతున్నాను. అయ్ వాంట్ టు కన్సెఫ్ మై క్రయిం. నాట్ చేసుకోండి. సుందరి నన్ను బ్లాక్ బెయిల్ చెయ్యడం ప్రారంభించింది. ఒకప్పుడు షి వజ్ మై లవ్...! ఆమెని ఫినిష్ చెయ్యమని అప్పారావుకి చెప్పాను. అతనాపని చేశాడు. పరిస్థితి మామూలుగా ఉందనుకుంటే - సుమిత్ర వచ్చి పాడు చేసింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన నేను తప్పనిసరై ఆమెని సైలెన్స్ చేశాను. అప్పుడక్కడ నన్ను రమణి చూసింది. సుందరి డెడ్ తో నాకు బ్లాక్ మెయిలింగ్ బెడద తీరుతుందనుకుంటే, కొత్తగా అప్పారావు నెత్తిని ఎక్కడం ప్రారంభించాడు. అంచేత అతన్ని కూడా ఫినిష్ చేశాను. ఇవాళ మా ఇంట్లో రమణి నన్ను గుర్తుపట్టింది. ఇవాళ కాదు...ఎప్పుడు చూసినా నన్ను, గుర్తుపట్టగలదు. ఆ అమ్మాయినికూడా ఫినిష్ చెయ్యాలని ఇక్కడికి తెచ్చాను. కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. ఇదిగో ఎడ్రస్...నోట్ చేసుకొండి. రమణి కోసం వెంటనే రండి" అని ఫోన్ పెట్టేశాడు.
తర్వాత రమణి వంక చూసి "నువ్విక్కడే కూర్చో. ఎక్కడికీ వెళ్ళకు. నీ కోసం మీ నాన్నా వాళ్ళు వస్తారు. ఏం?" అన్నాడు.
"అలాగే"
అతను లేచి పక్క గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
మరో రెండు నిమిషాలకి ఆ గదిలోంచి "ఢాం" అన్న చప్పుడు విన్పించింది.
ఒక్కసారి తుళ్లిపడింది రమణి.
తుపాకీనా, దీపావళి బాంబా అనుకుంది.
0 0 0
తండ్రిని చూసి పరుగు పరుగున వెళ్ళింది రమణి. రాజారామ్ ని గట్టిగా కౌగలించుకుంది.
"హౌ ఆర్యూ రమణీ?"
"ఫైన్...థాంక్యూ ఆంటీ" అంది రాజేశ్వరి వేపు నవ్వుతూ చూసి.
తర్వాత...
"డాడీ...నీకో రహస్యం చెప్పాలి....ఇలారా" అంది రమణి.
రాజారామ్ తల వంచాడు.
"రాజేశ్వరి ఆంటీని పెళ్ళి చేసుకో డాడీ" అంది రమణి.
__ అయిపోయింది __
