Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 31


    అతని దృష్టి డ్రాయింగ్ రూం గోడల మీద ఉంది. రాజేశ్వరి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగింది.

    ఏదో జరిగిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రాజారామ్. మళ్ళీ మరోసారి గోడలవేపు చూశాడు. నాలుగు గోడలనీ మార్చి మార్చి చూశాడు. ఆఁ ఇప్పుడు అతనికి గుర్తొచ్చింది. నాలుగు గోడల మీదా బంగారం రంగు ఫ్రేములో నాలుగు ఫోటోలు ఉండాలక్కడ అందులో రెండు ఫోటోలే ఉన్నాయిప్పుడు. మరో రెండు ఫోటోలు లేవు. ఎందుకు లేవు?

    ఉన్న ఫోటోలని నిశితంగా చూశాడు.

    విరించి చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఉంది. మహాలక్ష్మితో పెళ్ళినాటి ఫోటో ఉంది. మరి లేని రెండు ఫోటోలూ ఏమై ఉంటాయి. చెప్మా?

    "మహాలక్ష్మి గారూ ఇక్కడ రెండు ఫోటోలు ఉండాలి కదూ...?" అన్నాడు ఆమె వేపు చూసి.

    "అవును నిన్న రాత్రి వాటిని ఆయన తీసి తన బీరువాలో దాచేశారు." అందామె.

    'ఎందుకని?' అని అడుగుదామనుకొని మానేశాడు. దానికి బదులు రాజేశ్వరి వేపు చూసి "రాజేశ్వరీ నేను ఇంటికి వెళ్దామనుకుంటున్నాను. నువ్వు వస్తావా?" అన్నాడు.

    "అలాగే" అంటూ ఆమె లేచి నిలబడింది.

                                                                    0    0    0

   
    ఇద్దరూ విజయనగర్ కాలనీ చేరుకునే సరికి సాయంకాలం నాలుగు గంటలయింది.

    "మీరు ఉదయం నుంచీ ఏమీ తినలేదు. వంట ప్రారంభించేదా? అడిగింది రాజేశ్వరి.

    "ఉఁ హుఁ ఏమీ తినబుద్ధి కావడంలేదు. కొంచెం కాఫీ తాగుతాను పెట్టగలవా?" అన్నాడు రాజారామ్ సిగరెట్ పాకెట్ తీస్తూ.

    "అలాగే" అంటూ వంటింటి వేపు నడిచింది.

    సిగరెట్ వెలిగించి - మొత్తం జరిగినదంతా వరుస క్రమంలో ఊహించడం మొదలు పెట్టాడు.
   

                                   10


    మొట్ట మొదట ఇదంతా రమణి అన్న మాటలతోనే ప్రారంభమైంది. రమణి ఆవేళ రాత్రి ఏం అన్నదో గుర్తుకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు రాజారామ్.

    'డాడీ...డాడీ...నీతో ఒకావిడ ఏదో మాట్లాడాలిట...తెల్లగా పొడుగ్గా అందంగా ఉంది. మెడలోనేమో ముత్యాలహారం వేసుకుంది. ఎర్రని పట్టుచీర కట్టుకుంది డేడీ....!'

    ఆవిడ ఎవరో కాదు....సుమిత్ర.

    ఆరోజే వీరయ్య ఫాన్సీ కార్నర్ దగ్గర ఆమె కనిపించి తన సమస్య చెప్పింది.

    సుమిత్ర ఆదివారం నాదే ఇక్కడికి వచ్చింది. వస్తున్నట్టు ముందే టెలిగ్రాం ఇచ్చింది. స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని సుందరి ఆమెకి జవాబు కూడా ఇచ్చింది. కాని స్టేషన్ కి వెళ్ళలేదు.

    ఎందుకు వెళ్ళలేదు?

    అప్పటికే ఆమె హత్యకి గురై ఉంటుంది.

    సరే...

    ఆమె ఏదో ఊరికి వెళ్ళినట్టు అందర్నీ భ్రమింప చెయ్యడానికి - ఆమె ఇంట్లో ట్రావెలింగ్ బాగ, టూత్ బ్రష్ ళు వగైరా లేకుండా చేశారు. రెండు నెలల క్రితం వరకూ విజయవాడలో ఉందే సుందరి ఇప్పుడు హైదరాబాదు వచ్చింది హఠాత్తుగా ఆమె ఎకౌంట్లో పాతిక వేలు వచ్చాయి.

    ఎవరిచ్చి ఉంటారా డబ్బు?

    ఆ తర్వాత తనకి వస్తుందనుకున్న ప్రమోషన్ తనకి రాకపోవడం, విరించి చెంచా అయినా అప్పారావుకి రావడం జరిగింది.

    ఆ తర్వాత...

    సుందరి అంతర్ధానం వార్త రాసి, దాన్ని ఫస్ట్ పేజ్ బాక్స్ అయిటం చేద్దామనుకున్నాడు. కాని అప్పారావు అడ్డుపడ్డాడు. ఎందుకు?

    అతనికి సుందరి అంతకు ముందే తెలుసు. బాగా తెలుసు. చాలా బాగా తెలుసు.

    ఆ అయిటం వెయ్యవద్దని దాదాపు మీద పడి కొట్టినంత పని చేశాడు. అంటే సుందరి అంతర్ధానం లేదా హత్యతో అతనికి గట్టి ప్రమేయం ఉంది ఉండాలి.

    ఇకపోతే...

    సుమిత్రని అప్పారావు చంపాడా?

    అక్కడ ఆ గదిలో రమణి చూసినది అప్పారావుని కాదు. చూసి ఉంటే ఆ సంగతి ఖచ్చితంగా చెప్పేది. అంటే ఈ గొడవలో మరో వ్యక్తి ఉన్నాడు. అతనే అసలు హంతకుడు.

    తనని హైదరాబాద్ నుంచి మరెక్కడికైనా పంపాలన్న ప్రయత్నం 'ఆంధ్రా టైమ్స్' ఆఫీసులో జరిగింది. "రమణిని తీసుకొని ఊరు వదిలిపొమ్మని' ఆకాశరామన్న ఉత్తరం కూడా వచ్చింది.

    అంటే హంతకుడు ఇక్కడివాడు. ఈ ఊళ్ళో శాశ్వతంగా ఉండాల్సినవాడు. తనిక్కడ ఉన్నంత కాలమూ రమణి తన దగ్గరే ఉంటుంది. అలా ఉండడం హంతకుడికి ఇష్టం లేదు. ఏదో ఒక రోజున రమణి హంతకుడిని పోల్చేస్తుంది. అందుకే తనని ఇక్కడినుంచి ఎక్కడికైనా తరిమెయ్యాలని రకరకాలుగా ఒత్తిడి తెచ్చారు.

    ఎవరు?

    వారెవరో కాని....తనకి మాత్రం బాగా తెలిసిన వారే అయి ఉంటారు....!

    అన్నట్టు...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS