పేపర్లలో పైవిధంగా కమిటీ తీర్మానము, జీవో రెండూ చదివిన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ 'విశ్వజిత్ రప్పా' ఆనందించాడు. అయన అసలు పేరు విశ్వేశ్వరయ్య. రెండు మూడు అసంపూర్ణ సినిమాలు తీసిన అనుభవం వుంది. సత్యజిత్ రాయ్ అంత దర్శకుడవ్వాలని అయన ఆశ. అందుకని సత్యజిత్ ఇంటి పేరు 'రాయి' కాబట్టి తన పేరు విశ్వజిత్ రప్పా' గా మార్చుకున్నాడు.
ఆ మర్నాటి నుంచే పేపర్లలో ప్రకటనలు.
'మీకు సినిమా తీయాలని వుందా? మా బ్యాంకుకి రండి ', 'మీరు తీయబోయే సినిమాకు జేబులో రూపాయి కూడా లేదా? మీకెందుకు చింత? బహుచక్కని మార్గముంది మాచెంత. మా బ్యాంకు మేనేజరు గారబ్బాయీ, హిందీ హీరోయిన్ గనీషా పోయిరావాలా హీరో హీరోయిన్లు గా సినిమా తీయాలని ఉబలాటపడుతున్నారా? వెంటనే మా బ్యాంకుకి దయచేయండి' ఇలాంటి ప్రకటనలు కనబడుతున్నై. ఇంకో బ్యాంకైతే ' అన్ని బ్యాంకులూ ఒక్కలాగే వుండవు' అంది ముక్తసరిగా.
ఇదివరకు పదివేల లోను కోసం వెడితే వంద గ్యారంటీ లడిగి వెయ్యి సంతకాలు చేయించుకుని, ఎందుకప్పడిగాంరా బాబూ అని వాపోయే పరిష్టితి తెచ్చి పెట్టిన నాన్ - కో ఆపరేటివ్ బ్యాంకులు ఒక్కసారిగా సహాయ సహకార బ్యాంకులుగా మారటం విశ్వజిత్ రప్పాకు అనందం కలిగించింది.
బావమరిదిని తీసుకుని ఓ బ్యాంకుకు వెళ్ళి, తనని తాను ప్రొడ్యూసర్ గా పరిచయం చేసుకున్నాడు. అక్కడి స్టాఫ్ ఎలర్ట్ అయి, ఉద్యోగులు చాటుగా క్రాఫ్ సవరించుకుని, ఉద్యోగినులు అటు తిరిగి పెదాలకు లిప్ స్టిక్ పూసుకునీ , వీళ్ళని బ్యాంకు మేనేజర్ క్యాబిన్ లోకి తీసుకెళ్ళారు.
సినిమాలకి లోన్లివ్వటం నిజమేననీ, అయితే ఖర్చు ఎంతవుతుందో బడ్జెట్ దాఖలు చెయ్యాలని చెప్పాడు మేనేజర్. ఏ స్టూడియోల్లో ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారో, ఏ యాక్టర్ల కు ఎంత జీతాలివ్వాలో, ఎన్ని పాటలుంటాయో ఏ పాటకేన్ని స్టెప్పులుంటాయో అన్ని వివరాలతో సహా సబ్ మిట్ చెయ్యమని చెప్పాడు మేనేజర్. విశ్వేశ్వరయ్య సరేనని షేక్ హ్యాండిచ్చి , బయటకొచ్చాడు. భోజనానికి ఇంటికేడితే , మామగారికి సీరియస్ గా వుందని తెలిసి ఇద్దరూ వూరెళ్ళారు. నెల తర్వాత వచ్చి, ఓ మంచి రోజు చూసుకుని ముందుగా అక్కపూర్ణా స్టూడియోకెళ్ళారు.
విశ్వజిత్ రప్పాను చూసిన వాచ్ మేన్ నమస్తే సార్ అంటూ వచ్చాడు. "ఏమిటోయ్ బాగున్నావా? లోపల ఏం షూటింగులు జరుగుతున్నై?" అడిగాడు.
"ఓ వారం దాకా షూటింగులన్నీ కాన్ సిల్ చేశారు సార్" అన్నాడతను. అదేమని అడిగాడు రప్పా.
"తెలీదు సార్! కానీ వారం రోజుల్నించీ రాత్రి పగలూ ఏవేవో మిషన్లు లారీల్లోంచీ అన్ లోడ్ అవుతున్నై."
ప్రొడక్షన్ మేనేజరోచ్చి "వణక్కం సార్" అన్నాడు.
"ఇంకా వణక్కం ఏమిటోయ్ ! తొందరగా తెలుగు నేర్చుకో. ఏమిటీ లోపల హడావుడి ?" అడిగాడు రప్పా.
"ఉళ్ళవాంగో సార్.... లోపలంతా రెనోవేషన్ జరుగుతోంది" అని లోపలకు తీసుకుపోయాడు.
స్టూడియో మధ్యలో ఓ పెద్ద ఫ్యాక్టరీ గొట్టం నిలబెట్టి నలుగురు కుర్రాళ్ళు గొట్టం కింద మంట పెట్టి, కట్టేలూ బొగ్గులూ వేస్తున్నారు. 'అదేంటోయ్ ! ఎంత చలి కచుకోవాలన్నా ఇంత పెద్ద మంటలేయ్యాలా! ఆ పొగ పోవడానికి ఇంత పెద్ద గొట్టం కావాలా!" అడిగాడు రప్పా.
