Previous Page
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 33

 

    "కాదు సార్! సినిమాని పరిశ్రమగా చేశారుగదా! ఈ మాత్రం ఫ్యాక్టరీ గొట్టంవుంటేగానీ గంభీరంగా వుండదనీ...." అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్.
    ఇంకా లోపలకెళ్ళారు. ఓ షెడ్డంతా పెద్దపెద్ద మిషన్లున్నాయి. రోలింగ్ షట్టర్లు తిరుగుతున్నాయి. సిమెంటు ఫ్యాక్టరీలోలాగా వాటి మీద పెద్దలోడ్ క్యారియర్ లున్నాయి. ఓ క్యారియర్ లో ఫిలిం బాక్సులు వేస్తున్నారు. అవి అలా తిరిగి తిరిగి కొన్ని బాక్సులు లేబరేటరీకీ, కొన్ని బాక్సులు ఎడిటింగ్ రూమ్ లకీ వెడతాయట.
    విశ్వేశ్వరయ్య స్టూడియోలో ఎస్టిమేట్ తీసుకుని 'సీతానాయుడు' స్టూడియోకి బయల్దేరాడు.
    అక్కడ స్టూడియో దగ్గర కారాగింది. సిన్మాల్లో ప్రముఖంగా కనిపించే ఓ మాదిరి నటీనటులు, టెక్నీషియన్లూ, అంతా కార్మిక దుస్తుల్లో, క్యారేజీలు పట్టుకుని లోపలికెడుతున్నారు. విశ్వజిత్ ణు ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా గుర్తు పట్టి సెక్యూరిటీ వారు లోపలికి వదిలారు.
    లోపల ఎక్కడ చూసినా సినిమా జనాలు కార్మిక దుస్తుల్లోనే తిరుగుతున్నారు. ఒకచోట షూటింగ్ జరుగుతోంది. స్టార్ట్ కట్ అంటూ అరుస్తున్న ఒక దస్ర్హకుడు విశ్వజిత్ రాప్పాను చూసి చిన్నగా నవ్వాడు. కెమెరామేన్ కూడా అదే కార్మిక దుస్తుల్లో వున్నాడు.
    రప్పా కెమెరామెన్ దగ్గరకెళ్ళి "నీకోసం చాలా రోజుల్నుంచి వెతుకుతున్నాను. ఎడ్వాన్సుఇద్దామని" అని క్యాష్ బ్యాగ్ తెరిచి యాభైవేలు ఇవ్వబోతుంటే, కెమెరామేన్ భయంభయంగా అటూ ఇటూ చూశాడు.
    "సార్! మీకు తెలీదేమో! మీరు నాకు ఇంత మొత్తం ఇవ్వడం ఏసీబీ వాళ్ళు చూశారంటే, లంచం తీసుకుంటున్నావా అని కేసులు పెడతారు. ఇదుగోండి." అని అతని నెలసరి పేస్కేలూ, ఐడీ కార్డు చూపించాడు.
    "ఇదేంటయ్యా ఇలా అయితే సినిమా తీసేదెట్లా?" అన్నాడు రప్పా
    "లోపల ప్రభుత్వం ఓ ఆఫీసును తెరిచింది సార్! అక్కడ మా పీ.ఎఫ్ లూ, హెచ్.ఆర్.ఎలు కరువు భత్యాలూ అన్నీ చెప్తారు" అని వేరే లొకేషన్ వెళ్ళిపోయాడు.
    "అవును కానీ బావా! ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇంకెప్పుడూ కరువు పోదా? ప్రతీ జీతంలో కరువు భాత్యమని సెపరేటుగా ఇస్తారు?" అన్నాడు బావమరిది. వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఆఫీసు దగ్గరకెళ్ళేసరికి ఒంటిగంటైంది.
    ఫ్యాక్టరీ సైరన్ చెవులు చిల్లులు పడేలా మోగింది. వెంటనే కౌంటరు మూసేశారు. ఎక్కడి షూటింగులూ, పనులూ అక్కడే ఆగిపోయాయి. మరుక్షణమే, హీరోయిన్ను ఎత్తుకుని తిప్పుతూ డ్యూయెట్ పాడుతున్న హీరో సడన్ గా ఆపి ఆమెను కిందపడేసి, చెట్టు మొదట్లో పెట్టిన తన క్యారేజీ తీసుకుని, క్యాంటిన్ కెళ్ళిపోయాడు. ఆ హీరోయిన్ కుయ్యోమొర్రో అని మొత్తుకుంది.
    ఇంకో షూటింగులో కొండపైనుంచీ వంద అడుగులు కిందకి  దూకవలసిన స్టంట్ మాన్ 50 అడుగులే దూకి, పక్కనే బండరాయి పట్టుకుని ఆగిపోయి, జేబులో పెట్టుకున్న పులిహోర ప్యాకెట్టు విప్పి తినసాగాడు.
    కౌంటరు తెరిచేదాకా అక్కడే బెంచీ మీద కూర్చున్నారు విశ్వజిత్, బావమరిది.
    ఆ పక్కనే కొందరు మాట్లాడుకుంటున్నారు.
    ఒక వర్కర్ "ఏరా! మొన్న నువ్వేసిన సిన్మాబాగానే ఆడిందట! జీతం పెంచుతారంటా?" అంటే "ఆఁ.... ఇంకో మూడేళ్ళదాకా ఇదేస్కేలు. అయితే ఓ ఏడాది తర్వాత ట్రైచెయ్యొచ్చు. సమాచారశాఖలో మా పినమామ యు.డి.సి.లే..." అని జవాబు.
    ఇంకో కార్మికుడు "ఔన్రా! మన వీరరాఘవులికి 58 ఏళ్ళొచ్చాయని రిటైర్మెంటిచ్చారు గదా! మరి తండ్రి, తాత పాత్రలకెలాగరా?"
    సమాధానం- "ఏమోరా మరి. 40 ఏళ్ళవాడికే 80 ఏళ్ళ మేకప్ వేస్తారేమో! లేకపోతే రోడ్ల కాంట్రాక్టులిచ్చినట్లు 'తాతముత్తాతలు కావలెను' అని టెండర్లు పిలుస్తారేమో! ఆ టెండర్లను టాటాలూ ముట్టాటాలూ పాడుకుని ముసలాళ్ళను సప్లై చేస్తారేమో...."
    "పద బామ్మర్ది పోదాం" అంటూ లేచాడు రప్పా.
    "అదేంటి! పదినిమిషాల్లో కౌంటరు తెరుస్తారు. ఎస్టిమేషనూ అదీ" అన్నాడు బామ్మర్ది.
    "వద్దు ఇదివరకు నాలుగు కోట్లతో సినిమా తీసి, నష్టపోయినా ఇంకో పిక్చరు తీసి నష్టం పూడ్చుకోవచ్చులే అనే ఆశవుండేది. ఇప్పుడు గవర్నమెంటు బడ్జెట్ తో నలభై లక్షలకే సినిమా తీసినా, అందులో యాంత్రికం తప్ప కళాత్మకం ఏముంటుంది? హీరో డ్యూటీ ప్రకారం యుద్ధం చేస్తాడు. అందులో ఆవేశం, కోపం వుండవు. హీరోయిన్ డ్యూటీ ప్రకారం హీరోను ప్రేమిస్తుంది. అందులో ప్రేమా దోమా అనేవేవీ వుండవు. పద బామ్మర్ది... పరిస్థితులు అనుకూలించేదాకా పిక్చరూవద్దు, ఈ నిర్మాణప్పనులూవొద్దు" అని అన్నపూర్ణ స్టూడియోలో తీసుకున్న ఎస్టిమేటు చింపేసి కారెక్కి వెళ్ళి పోయాడు విశ్వేశ్వరయ్య ఉరఫ్ విశ్వజిత్ రప్పా.
    
                                           * * *
                                      ----సమాప్తం----


 Previous Page

WRITERS
PUBLICATIONS