Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 31


                                              

    ఇండియన్ సినిమా దేశీయంగా , అంతర్ జాతీయంగా లైమ్ లైట్ ,లోకి వస్తోంది. పైగా దానికి ఇరవై నాలుగు యూనియన్లు కూడా ఎప్పటి నుంచో ఏర్పడి వున్నాయి.
    మూవీ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు రైటర్లు, ఫైటర్లు, మ్యూజిషియన్లు కాస్త్యూమర్లు, డబ్బింగు , జూనియర్ ఆర్టిస్టులు - ఇత్యాదులు దీన్ని పరిశ్రమగా గుర్తించమని దశాబ్దకాలంగా సినీ పెద్దలు, యూనియన్ నాయకులు, పదేపదే విజ్ఞప్తులు చేయడంతో చివరకు గవర్నమెంటు ఒక కమిటిని వేసింది. ఆ కమిటీ పనులన్నీ మానుకుని, రోజుకి ఆరు సినిమాల చొప్పున అన్ని భాషలకు చెందినవి చూసి, నెల రోజుల తర్వాత ఎర్రబడ్డ కళ్ళతో మిడిగుడ్లు వేసుకుని, నవ్వుతూ ఓ గ్రూప్ ఫోటో తీయించుకుని, తాము చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది.
    వారు చేసిన ఆ తీర్మానం ప్రకారం -  
    ఒకటవ పాయింటు : ఈ 'సినిమా తీయుట' అనే ప్రక్రియని పరిశ్రమగా గుర్తిస్తే విదేశీ మారకద్రవ్యం లభించడం మాట దేముడేరుగు - కనీసం స్వదేశీ మాదకద్రవ్యం కంట్రోలులో వుండాలి. అనగా బ్రౌన్ షుగర్లు, ఎల్ఎస్డీలూ చట్టవిరుద్దంగా ఎగుమతి దిగుమతులు చేసే డాన్ ;అ ఫైనాన్స్ తో భారీ సినిమాలు తీసి, నష్టపోయినట్లయితే మళ్ళీ అవే మాదకద్రవ్యాల మత్తులో మునిగి పోకుండా కంట్రోలులో వుంచుకోవాలి.
    రెండవ పాయింటు: అతి చిన్న ప్రేమ కధలను తెర కెక్కించటంలో కోట్లకొద్దీ ధనము వెచ్చించటంతో, వృధా ఖర్చు కొన్ని వందలకోట్లు పెరిగిపోవడాన్ని నిరోధించాలి. ఉదాహరణకు దేవదాసు అనే తాజా సినిమాకు 50 కోట్ల రూపాయల దాకా వెచ్చించి\నట్లు సమాచారం.
    కేవలం మూడు, లేక నాలుగు ముఖ్యపాత్రలున్న ఈ చిన్న కధలో (నోట్: ఈ సినిమాలో మూల కధను కూడా చిత్తానుసారముగా మార్చినట్లు కొంతశాతము గుర్తించినాము. ఎలాగూ ఆ స్వాతంత్ర్యము నిర్మాతా దర్శకులూ తీసుకున్నారు కాబట్టి, ఇంకా మర్చి, కుదించినచో దాదాపు నలభై ఏడున్నర కోట్లు అదా అయ్యే అవకాశముందని కమిటీ గుర్తించినది ) దేవదాసు అనే తాగుబోతు హీరో సినిమా మొత్తం తాగిన (సినిమాలో చూపించిన ) బ్రాందీ, లేక విస్కీ బాటిల్సు కనీసం డజను కూడా లేవు. ఒక్కొక్క బాటిలూ వెయ్యి రూపాయలుగా వేసుకున్ననూ పన్నెండు వేలు మించి ఖర్చు కావు.
    మూడవ పాయింటు : ముఖ్య తారాగణము పారితోషకము (ఇన్ కమ్ టాక్స్ వారికి చూపిన లెక్కల ప్రకారం) కోటిన్నర . సినిమా రీళ్ళకి, టేక్నిషియన్స్ కీ, ఇత్యాదులకి మరో కోటి మించి వ్యయము కాదనేది సుస్పష్టము. ఎందుకనగా ఆ సినిమా వ్యయం ఈ క్రింది విధంగా మార్పు  చేసి , అదే కధకి అనయించిన అవగతము కాగలదు.
    అనగనగా ఒక కుర్రదేవదాసు. వాడు చిన్న పిల్లాడుగా వున్నప్పటి నుంచీ పెద్దవాడయే దాకా పాలు తాగుతూనే వుండేవాడు. వాడి తల్లిదండ్రులు జమీందారులు. వారు దేవదాసుకి పాలు సప్లై చేసే బాధ్యత పొరుగింటి పార్వతి తల్లికి ఇవ్వగా, ఆమె దేవదాసు పాలు తాగు బాధ్యతను తన కూతురు పార్వతికి అప్పగించినది.
    అప్పటి నుంచీ - "దేవదా పాలు తాగు ..... దేవదా పాలు తాగు ...." అంటూ పార్వతి విసిగించడంతో దేవదాసు పాలబుడ్డీని పార్వతి ముఖముపై విసరడంతో పార్వతి నుదుటికి గాయమౌతుంది. ఆ సంఘటనతో పశ్చాత్తాపం చెందిన దేవదాసు ఇక పాలు తాగనని ప్రతిన పూని , పాల బుడ్డిలో బ్రాందీ పోసుకుని తాగుతాడు.
    దేవదాసు ఫ్యామిలి యొక్క జమీందారీ అహమును భరించలేక, పార్వతిని పొరుగూరి ముసలి జమీందారుకిచ్చి పెళ్ళి చేస్తారు పార్వతి తల్లిదండ్రులు. దాంతో విరక్తి చెందిన దేవదాసు పట్నం వెళ్ళి, మిత్రుడి సలహా మేరకు పాలబుడ్డీ (అనగా బ్రాందీ బుడ్డీ) నుంచి విస్కీ బాటిల్సు కి ఎదిగి , మళ్ళీ అదే మిత్రుడి ప్రోద్బలంతో ఒక వేశ్య ఇంటికి వెళ్ళి, ఆమెతో పరిచయం పెరిగాక, ఆమెకు నీతులు చెప్పి - కాస్తో కూస్తో సంపాయించుకుంటూ రెండూ పూట్లా కడుపు నిండా తింటూ కాలక్షేపం చేస్తున్న ఆవిడని వృత్తి మానేసేలాగా, ఉన్న ఆస్తులు అమ్మేసుకుని కట్టుబట్టలతో బికారిలా బతికేలా తయారుచేస్తాడు.
    తాగితాగి, లివర్ పాడైన దేవదాసు పార్వతి అత్తవారి వూరిలో స్టేషన్ దగ్గర ఎడ్లబండిని మాట్లాడుకుని తన జేబులో వివరాలన్నీ పెట్టుకుని పార్వతి ఇంటి ముందు రచ్చబండ చెట్టు కింద పోతాడు.
    ఈ కధకి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సబబు కాదని ఇలాంటి లవ్ స్టోరీలకు భారీగా నిధులు ఖర్చు పెట్టడం ఇండియన్ ఎకానమీకి విరుద్దమని భావించి, ఇండియన్ సినిమాని ఇండస్ట్రీగా డిక్లేర్ చేసి, ఎకౌంట్లన్నీ ఆడిట్ చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాం.
    అంతేకాక భారతదేశంలో వున్న సినిమా స్టూడియోలన్నిటినీ పారిశ్రామికరించవలయునన్నీ, సినీ పరిశ్రమలోని వర్కర్లకు నెలసరి వేతానములు ఎవరి తాహతును బట్టి వారి స్కేల్సు నిర్ణయించవలెననీ , (ఉదా: ఒక సామాన్య క్యారక్టర్ అర్తిస్టుకి 5000- 75-5075-150-5225-500-5725) అలాగ తీర్మానించడమైనది. ఇలా సినిమాను పారిశ్రామికరించడం ద్వారా సినిమా తీయుటకు అవసరమైన లోన్లను జాతీయ బ్యాంకుల ద్వారా పొందవచ్చన్న శుభవార్తని ప్రకటించటమైనది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS