Previous Page Next Page 
ప్రతీకారం పేజి 31


    "ప్రతీకారం...తప్పదు...కోరలు చాచి మండుతున్న ఈ అగ్ని చల్లారడానికి సప్త సముద్రాల నీరు చాలదు. రక్తం కావాలి...రక్తానికి రక్తం... అప్పుడే ఈ అగ్ని చల్లారుతుంది" అంటూ పిచ్చిదానిలా గొణుగుతూ గోడకు చేరబడిపోయింది రాధాదేవి.

                                                                          25

    "అమ్మా ఆకలేస్తోందే!"
    "అమ్మా పరికిణీ చిరిగిపోయింది"
    "అమ్మా నాకు ఓణీలు కావాలి స్కూలుకు వెళ్ళను"
    "నాన్నా! నా స్కూలు ఫీజు!"
    "నాన్నా! నా నిక్కరు చిరిగిపోయింది."
    పిల్లలు కుటుంబయ్య చుట్టూ, అతని భార్య చుట్టూ మూగి అరవడం ప్రారంభించారు. కుటుంబయ్య భార్య రామ సుబ్బమ్మ భర్త ముఖంలోకి అసహాయంగా చూసింది.
    "పొండి వెధవల్లారా! నల్లుల్లా పీక్కుతింటున్నారు" అందర్నీ కసిరి కొట్టాడు.
    కుటుంబయ్యకు తొమ్మిది మంది సంతానం. "నారు పోసిన వాడే నీళ్ళూ పోస్తాడు" అనే సిద్దాంతంలో నమ్మకం గలవాడు. కుటుంబ నియంత్రణ మీదా, దాని ప్రచారకుల మీదా బొత్తిగా గౌరవం లేనివాడు. ఉన్నరోజు తిని లేని రోజు మూడంకె వేసి పడుకోగలవాడు. మిన్ను విరిగి మీద పడ్డా తొణకనివాడు. ఆ రోజు చాలా చిరాకు పడిపోతున్నాడు.
    కుటుంబయ్య భార్య పదహారణాల భారత నారి. భర్త మాటకు ఎదురాడితే రౌరవాది నరకాలు తప్పవని నమ్మే ఇల్లాలు. జన్మ జన్మలకూ ఆ భర్తే లభించాలని మంగళ సూత్రాలను కళ్ళకద్దుకునే ఆడది. తెలుగు సినిమాలోని పతివ్రతలకు మించిన మహా పతివ్రత. ఆ కళ్ళు జీవం చచ్చిపోయి గాజు గోళీల్లా వుంటాయి. శరీరంలో కండలూ, ఎముకల్లో మూలుగు కరిగిపోయినా, ఆమె ఉదరంలో మరో ప్రాణి జీవం పోసుకుంటూ వుంది. పిల్లలు చుట్టూ చేరి వేదిస్తూ వుంటే ఏమీ అనక నీరు ఇంకిపోయిన కళ్ళను పైట కొంగుతో ఒత్తుకుంది.
    కుటుంబయ్య తలా ఒకటి వడ్డించి కసురుకున్నాడు. పిల్లలంతా "గీబా" అంటూ తారాస్థాయిని అందుకున్నారు.
    అదే సమయంలో అంజిబాబు, రమాదేవి పళ్ళబుట్టలతో ప్రవేశించారు. బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకుని రావడం మర్చిపోలేదు. వాళ్ళ చేతుల్లోని పళ్ళనూ, పొట్లాలనూ చూసి పిల్లలు ఏడుపు మాని వానర సైన్యంలా ముట్టడించారు. బుట్టెడు అరటిపళ్ళూ, నాలుగు బిస్కెట్ ప్యాకెట్లూ క్షణంలో ఎగిరిపోతుంటే అంజి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ నిల్చున్నాడు. రమాదేవి ఆవురావురంటూ తింటున్న పసివాళ్ళను జాలిగా చూస్తూ నిల్చుండి పోయింది.
    కుటుంబయ్యా, రామసుబ్బమ్మా అగంతుకుల్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు.
    "నేను మామయ్యా అంజిని! ఊరుబోయిన వెంకయ్య కొడుకుని."
    "ఓరి నువ్వంటరా? ఎంత పెద్దవాడివయ్యావురా? ఇంతుండేవాడివి లాగూ, చొక్కా లేకుండా!" అంటూ చేత్తో ఎంతుండే వాడో చూపించాడు.
    అంజీ సిగ్గుపడిపోయాడు. రమాదేవి నవ్వుతూ అంజికేసి చూసింది.
    "నీకు తెలవదులే. నాకు వేలువిడిచిన మేనమామకు మనవడి వరస అవుతాడు" అన్నాడు కుటుంబయ్య భార్యతో.
    "మహా నీకు తెలిసి ఏడ్చినట్టు!" అంజి మనస్సులోనే అనుకున్నాడు.
    "నిలబెట్టే మాట్లాడుతున్నారేవండి! రామ్మా! కూర్చో! రామసుబ్బమ్మ చింకిచాప పరిచింది.
    అందరూ చాపమీద కూర్చున్నారు. పిల్లలు కింద రాలిపోయిన బిస్కెట్లు ఏరుకుంటూ గోలగా పోట్లాడుకుంటున్నారు.
    "ఏమిటి బాబూ! ఇలా దారితప్పి వచ్చావు?" కుటుంబయ్య ప్రశ్నించాడు.
    "దారితప్పి రాలేదు. దారి వెతుక్కుంటూ వచ్చాం" అంజి నవ్వుతూ అన్నాడు.
    "మాతో ఏం పని బాబూ వెతుక్కుంటూ రావడానికి?"
    "మీతో పని వుండే వచ్చాం!"
    నమ్మలేనట్టు చూశాడు కుటుంబయ్య.
    "ఏం నమ్మకం కలగటం లేదా?" నవ్వుతూ అన్నాడు అంజి.
    "నాతో మీకు పనేమిటా అని..."
    "సందేహంగా వుంది అంతేగా! మాకు పిల్లలు లేరు. ఇక పుట్టరని డాక్టరు చెప్పాడు. నా భార్య ఎవర్నయినా అనాధని తెచ్చి పెంచుకుందామని గోల పెడుతుంది. అనాధ ఎందుకు? మా కుటుంబయ్య మామయ్యకు చాలామంది పిల్లలున్నారు. ఒక పిల్లను తెచ్చి పెంచుకుందాం అన్నాను. ఆమె ఒప్పుకుంది అందుకే వచ్చాం" అన్నాడు అంజి.
    కుటుంబయ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ భార్య ముఖంలోకి చూశాడు. ఎముకలు కన్పిస్తున్న ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు.
    "మొద్దు మొహం" అనుకున్నాడు కుటుంబయ్య.
    "ఎంతమంది పిల్లలు కావాలి బాబూ!" అన్నాడు కుటుంబయ్య.
    పిల్లల్ని కూరగాయల్లా అమ్మాలని చూస్తున్నట్టున్నాడు. అంత పెంచలేనివాడు అంతమందిని ఎందుకు కనాలో? మనసులోనే తిట్టుకుంది రమ.
    రామసుబ్బమ్మ మనసులోనే తిట్టుకుంది.
    "తల్లికి పిల్ల భారమా...తరువుకు కాయ భారమా?" అన్న పాట గుర్తొచ్చింది రమకు.
    "భారం ఎందుకు కాదు? పిచ్చి సెంటుమెంటు మొయ్యలేని బరువు ఏదైనా భారమే! ఎవరికయినా బరువే. ఆ బరువు దించుతామని ఎవరైనా చెయ్యి చాపితే బరువు మోసేవాడు తిరస్కరించగలడా?" అనుకుంది రమ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS