Previous Page Next Page 
ది సెల్ పేజి 31


    రాయుడి అమానుషాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాని ఇంకా రాయుడికి భయపడి ఎవరూ ధైర్యం చేసి రిపోర్టు ఇవ్వటానికి, సాక్ష్యం చెప్పటానికి ముందుకు రావటం లేదు.

                                         *    *    *

    రాయుడి పరిస్థితికి ఆ వూరి ప్రజలే కాదు, అతనివెంట వున్న వంధిమాగధులు కూడా జాలిపడుతున్నారు.
    విజయ్ రాకముందు ; ఊరికి పులిలా వుండేవాడు. అందరి ఆఫీసర్లను ఇబ్బందిపెట్టి పారిపోయేట్లు చేసినట్లుగా విజయ్ ని కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెట్టాడు. అయినా రాయుడు ఆశించినట్లు జరగలేదు. రాయుడు తన వెనుక ధనబలమే కాదు ప్రజాబలం వుందన్నట్లు ఊరేగింపులు తీశాడు. అయినా విజయ్ లేశమైనా జంకలేదు. ఇప్పుడు చాలామంది ప్రజలు విజయ్ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా వున్నారు.
    విజయ్ ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోయి రాయుడిని అసూయపాలు జేసింది.
    రాయుడి నిజస్వరూపాన్ని ప్రజలకు చాలావరకు తెలియజేశాడు విజయ్. ప్రజలు రాయుడు మేకవన్నె పులి అని తెలుసుకున్నారు.
    అమాయక ప్రజలను భయభ్రాంతుల్ని చేసి అతని చుట్టూ త్రిప్పుకుని, అది అంతా అతనికి గల కేడరుగా పై రాజకీయ నాయకులముందు నాటకమాడి ఇన్నాళ్ళు అతనివెంట చాలామంది ఓటర్లు వున్నట్లు నమ్మిస్తూ వచ్చాడు. కాని ఈ రోజు అతని గుట్టు బయటపడింది. ఇక ఈ గ్రామంలోనే కాదు చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా అతని పరపతి క్షీణించింది. ప్రజలు రాయుడిని చూసి భయపడే రోజులు పోయి ప్రజలను చూసి రాయుడు పారిపోయే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు.     
    రాయుడు పరిస్థితి నిప్పుత్రొక్కిన కోతిలా వుంది. విజయ్ అతని పాలిటి యముడిలా తయారయ్యాడు.
    విజయ్ ని ఏ విధంగా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నాడు రాయుడు. పథకాలు వేస్తున్నాడు.

                                          *    *    *    

    ఆ ఘోరం క్షణాలలో రాయుడిపురంలోనే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో దావానలంలా వ్యాపించింది.
    విజయ్ రాయుడిపురంలో లేడు. ఆఫీసు పనిమీద హెడ్ క్వార్టర్సుకు వెళ్ళాడు.
    రాయుడు ఇదే అదను అనుకుని తన మనుషులను ఆ గ్రామంలోను, చుట్టుప్రక్కల గ్రామాలలోకి పంపించి ఇన్ స్పెక్టర్ విజయ్ ను అప్రదిష్టపాలు చేయటానికి వ్యూహాన్ని పన్నాడు.
    పని అమ్మాయి మంగ శవం ఇన్ స్పెక్టర్ విజయ్ వంటింట్లో వ్రేళ్ళాడుతుంది. పని అమ్మాయికి విజయ్ కి అక్రమ సంబంధం వున్నట్లు, తనని పెండ్లి చేసుకోమని వత్తిడి తేవటంతో దాని పీడ విరగడ చేసుకోవటానికి చాకచక్యంగా చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించటానికి ప్లాను వేశాడని వదంతి లేవదీశాడు.
    సహజంగా పోలీసు ఆఫీసర్ నేరం చేశాడు అంటే వచ్చే పబ్లిసిటీ అంతా యింతా కాదు. అదే విధంగా గుసగుసలు మొదలయ్యాయి. ప్రెస్ వారు వచ్చారు.
    రాయుడు ప్రెస్ మీట్ పెట్టి తన మద్దతుదార్లు అందరిచేత ముక్తకంఠంతో విజయ్ పనిపిల్లని రేప్ చేసి చంపాడని చెప్పించాడు.
    ఈ కేసులో ముద్దాయిని ఇక్కడనుండి ట్రాన్స్ ఫర్ చేయాలి లేకపోతే ఈ కేసులో న్యాయం జరగదని అభియోగం లేవనెత్తాడు.
    ఈ తతంగం అంతా హెడ్ క్వార్టర్సులో వున్న విజయ్ పై అధికార్లకు తెలిసింది. హుటాహుటిన వాళ్లంతా రాయుడిపాలెం వచ్చారు.
    ఉదయం ఉన్నతాధికారి రమ్మని ఫోను చేయటంతో టింకూను కాన్వెంటులో దించి తను వెళ్ళాడు. సాయంత్రానికల్లా మంగ శవం వంటింట్లో వ్రేలాడుతోందని కబురు అందింది.
    విజయ్ ను అరెస్ట్ చేయాలని పోలీసుస్టేషన్ ముందు తనవాళ్ల చేత నినాదాలు చేయించాడు రాయుడు. అది అంతా హాట్ న్యూస్ క్రింద ఫ్లాష్ చేశారు ప్రెస్ వాళ్ళు.
    "కాకీ కౌగిలి నుండి మృత్యుగర్భంలోకి" అన్న శీర్షికన రాయవలసిందంతా రాశారు.
    ఉన్నతాధికారులు దర్యాప్తు క్షుణ్ణంగా చేశారు. శవ పరీక్ష చేసిన లేడి డాక్టర్ లత మంగను రేప్ చేసి గొంతు నులిమి చంపినట్లుగా నిర్ధారించింది. అంటే చంపిన తరువాత శవాన్ని ఉరి వేసుకున్నట్లుగా వ్రేలాడదీశారన్నమాట.
    విజయ్ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయటానికి ఎవరో చేసిన నేరాన్ని అతనిమీద మోపటానికి చేసిన విశ్వప్రయత్నాలు విఫలమయ్యాయి.
    ఆ రోజు విజయ్ ని ఉన్నతాధికారి పిలవకుండా వుంటే ఒకవేళ విజయ్ ఆ సమయంలో రాయుడిపాలెంలో గనక వుంటే అతనికి ఎలిబి వుండేది కాదు.
    విజయ్ మీద అతని క్యారెక్టర్ మీద ఉన్నతాధికార్లకు నమ్మకం వున్నా, పోలీస్ ఆఫీసర్ మీద ప్రజలనుండి ఎలిగేషన్ వచ్చినప్పుడు నిజానిజాలు తేల్చి చెప్పటం అంత తేలికైన విషయం కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS