రాయలు లేదని గంభీరంగా తల ఊగించారు.
ఆ రోజు ప్రొద్దుకుంకు వేళకు కంచు ఢక్కను భగ్నం చేయించాలని ముహూర్తం నిర్ణయమైంది. ఈసారి సభలో రాయలకు ఒక ప్రక్క శ్రీనాథయ్య ఉన్నారు. ఆయనకు అగ్రాసన మివ్వబడింది. ఒక వరుసలో ముమ్మకవి. అరుణ గిరినాధగౌడ. రాజానాధుడు ఇంకా ఇతరులూ కూర్చున్నారు.
ఒక వరుసలో ఉన్నత రాజోద్యోగులంతా కూర్చున్నారు. దుగ్గన్న బంగారు గొడ్డలి భుజాన పెట్టుకుని పరశురాముడల్లే అటూ ఇటూ చూస్తూ శ్రీనాధయ్య సరసన నిలిచాడు. రాయలు సభలో కలయ చూచాడు. ఇంకా చౌండపనాయకుడు సభకు విచ్చేయలేదు. కారణమేమై వుంటుందని ఊహిస్తున్నాడాయన. చౌండపనాయకునికి విజయనగర రాజకార్యాల్లో చాలా ప్రాధాన్యత వున్నది. ఎందుకంటే విజయనగర రాజ్యము ఉనికిపైన బహమనీ సుల్తానులు కన్ను పడింది. బహమనీలు బలవంతులు. వారు గోదావరీ తుంగభద్రల మధ్య ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు. ప్రక్కనే పొంచి వున్నారు. ఇట్లాగే ఒకప్పుడు తురక ప్రభువులు ఢిల్లీని పాలించటం ప్రారంభించిన క్రొత్తలో మంగోలియనులు వాయువ్యాస విడిది చేయటం ప్రారంభించారు. వారి సంఖ్యాబలం తక్కువగా ఉన్నదని ఢిల్లీవారు లెక్కచేయలేదు. అది చాలా గొప్ప ప్రమాదానికి దారితీసింది.
ఒక సుప్రభాతాన మంగోలియన్, సింహం సృష్టిలో రెండవ సూర్యుని అంగీకరించని ఏకైక రవి. చెంగిస్ ఖాన్ ఢిల్లీ తలుపు తట్టాడు. అప్పుడే ఆవులించిలేచిన యావత్తు భారతం గడగడలాడింది. విధి వక్రించి అతడు పక్కదారి త్రొక్కాడు కనుక సరిపోయింది. ఎలాగో గండం గడిచిపోయింది.
అలాగే విజయనగర రాజ్యానికి బహమనులు అపరమంగోలియన్లు అయ్యారు. వీరిలో ఎప్పుడు ఏ చెంగిస్ ఖాస్ పుట్టుకొచ్చి విజయనగర తలుపులు తట్టుతాడో తెలియదు. కనుక చౌండప్ప నాయకుల వంటి యుద్ధ విశారదుల మనసు నొప్పించకుండా వారిని గౌరవించటం రాయలకు తప్పనిసరి. అందువల్లనే చౌండప్ప నాయకుని విషయంలో ప్రౌఢరాయలకింత ఆసక్తి!
రాయలీ ఆలోచనలతో సతమతమౌతున్నాడు.
అంతలో చౌండప్ప నాయకుడు పెద్ద పెద్ద అంగలతో సభా ప్రవేశం చేసి రాయలకు అభివాదం చేశాడు. శ్రీనాధయ్యను బాగా పరికించి చూచి తన ఆసనంపై సుఖాసీనుడయ్యాడు.
చౌండవ నాయకుని ప్రక్కనే చంద్రుడు భూమిపై పరచి వెళ్ళిన వెన్నెల కిరణంలా నిలచివున్నాడొక వీర యువకుడు. అతడు కార్తవీర్యార్జనుడి చెరసాల నుండి అప్పుడే విడుదల పొందిన కుర్ర రావణునివలె ఉన్నాడు. రాయలు పరికించి చూచాడు. అతడిని చూడటం రాయలకిదే తొలిసారి. సభ నిశ్శబ్దమైంది.
"చౌండవ నాయకా! మీరీ వీర కిశోరాన్ని బంధ విముక్తి చేసి సభలో ప్రవేశపెట్టటం మీ ఔదార్యానికి నిదర్శనం. అతడిని ఆశీనుణ్ని చేయండి" అన్నాడు రాయలు.
"వీరులను గౌరవించటం రాయల రాజోద్యోగులకు తెలియవని సమస్త భరతఖండంలో భావించే వారులేరు అంటూ సోమదేవుడిని ఉచితాసీనుణ్ని చేశాడు చౌండవ నాయకుడు. "వీరకిశోరమా విజయనగర వీరుల చేతిలో బందీగా చిక్కిన సమయాన నీవేమని భావించావు" అంటూ ప్రశ్నించాడు రాయలు.
"రాజా! కొండవీటి ప్రతినిధిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. నేను బందీగా చిక్కినప్పుడు చౌండవ నాయకుడు రచించిన క్రొత్త వ్యూహాన్ని నేర్చుకున్నాను. అది భవిష్యత్తులో కొండవీటి రాజ్యరక్షణను ఉపయోగించగలదని సంతోషించాను. సోమదేవుని సమాధానం విని రాయల మనసు సంతోషంతో నిండిపోయింది. శ్రీనాధయ్య చిరునవ్వు విసిరాడు.
"అయితే నీవు తిరిగి కొండవీడు పోగలవని ఎలా తలపోశావు?" రాయలప్రశ్న సోమదేవునిపై ఆయనకు కలిగిన అభిమానానికి ఇదొక చక్కని ఉదాహరణ కూడా.
"బందీలుగా చిక్కిన వీరులను విరాయుధులను చేసి చంపటం వీరమర్యాద కాదు. ఆ పని చౌండవ నాయకులు చేయగలరని నాకనిపించలేదు. అందువల్ల." సోమదేవుని సమాధానం, ఈ సమాధానం విని సభ యావత్తూ హర్ష ధ్వానాలతో మారుమ్రోగింది. రాయలూ శ్రీనాధయ్యా ఒకరి ముఖాలొకరు చూచుకుని చిరునవ్వులు విసురుకున్నారు.
"శ్రీనాధయ్యా! కోమటివేమునికి వన్నె దేవచోడుని వలె, రాచవేమునికి సోమదేవుడు లభించాడు. కొండవీటికిది శ్రీరామరక్ష" అంటూ ప్రశంసించాడు రాయలు. శ్రీనాధయ్య చిరునవ్వుతో తన అంగీకారాన్ని రాయలకు తెలియజేశాడు.
కొందరు సైనికులు డిండిమభట్టుగారి కంచుఢక్కను అక్కడికి మోసుకొచ్చారు. అది సభామధ్యంలో ఉంచబడింది.
అరుణ గిరినాధగౌడ (డిండిమ) భట్టుగారి ఈ కంచు ఢక్క ఇన్నాళ్ళుగా ఆయన పాండిత్య ప్రకర్షకు ఉదాహరణమై ఉన్నది, ఇప్పుడిది శ్రీనాధయ్యగారి అతిలోక మేధా సంపత్తికి తలక్రిందులైంది. శాస్త్ర పాండిత్యంలో శ్రీనాధయ్య జయించారు. ప్రతిజ్ఞ ప్రకారం ఈ కంచుఢక్కను బ్రద్దలు చేయటానికి గౌడభట్టుగారు అంగీకరిస్తారనుకుంటాను. రాయల ప్రశ్న విని మౌనమే అంగీకారంగా లేచి నిలిచారు భట్టు. ఆయన ముఖం అవసతమయింది.
