ఉ. ఏఱువభీమ! నీ పగతు ఱెక్కని కొండలు చంచలాత్ములై
దూఱని యట్టి ఘోరవనదుర్గములు వనితావి యోగులై
పాఱని త్రోవలుం దినని పండ్లును నాఁకటఁ గూర లుప్పగా
నేఱని కర్రలుం గలవే యీల వణాంబుధి వేష్టితావని ? 289
కళింగ గంగునాస్థానమునకు భీమకవి యరుగఁగా నాతఁడ'నాదరమున నిది సమయము కాదు పొమ్మనేనట! దానిపై భీమన కోపించి శాప మిట్లోసఁగెను.....
ఉ. వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ము పొ మ్మనే
మోమును జూడ దోస మీఁక ముప్పది రెండు దినంబులవల
జామున కర్ధమం దతని సంపద శత్రులపాలు గావుత 290
శాపము ఫలించేను. రాజకళింగుగంగు గర్భదరిద్రుఁడై వరుల కేఱుక పడకుండఁ బ్రచ్చన్నవేషము దాల్చి తిరిప మెత్తుచుఁ బొట్టగడపు కొనుచుండేను. భీమకవి యొకనాఁడు రాత్రి పల్లకి నెక్కి దివటిలతో నెక్కడతో పోవుచుండఁగా నాతఁడు త్రోవ నేఁగుచుఁ జీకటిలో నొకగోతఁ గూలి 'అయ్యో! కాలిదివటీయైన లేదయ్యెఁగదా' యనుకొని చింతిలెనట! అది భీమకవి విని నీ వెవ్వండవని యడుగ "బీమకవి గారిచే జోగిచేయఁబడిన వాఁడ' ననేనట! భీమకవి 'రాజకళింగ గంగవా' యనఁగా నాతఁ డు కేల్మోడ్చి రక్షింపు డనేనట! అంతట.
ఉ|| వేయుగజంబు లుండఁ బదివేలు తురంగములుండ నాజిలో
రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టముగట్టుకో వడి
రాయకళింగగంగు కవిరాజ భయంకరమూర్తిఁ జూడఁగాఁ
బోయెను మీనమాసమునఁ బున్న మవోయినషష్టినాఁటికీ. 291
అని యాశీర్వచించి తిరిగి లబ్ధరాజ్యునిఁ జేసేనట !
ఉ|| రామున మోఘబాణమును రాజశిఖామణి కంటి మంటయు
భీముగదావిజ్రుంభణ ముపెంద్రుని వజ్రము చక్రిచక్రము
దామర చూలి వ్రాఁతయును దారకవిద్విషు ఘోరశక్తి యు
(వే) లేములవాడ భీమకవి లేశము తిట్టిన రిత్తవోపునే 292
ఒక బ్రాహ్మణుని దొడ్డిలోని పేరాముదపాకులు భీమకవి తాలూకు నౌకరొకఁడు మందుకని కోసికోనఁబోగా నాయింటి బ్రాహ్మణుఁ డా నౌకరును బారతోఁ గొట్టేనఁట! ఆ బ్రాహ్మణుఁ డడఁ గారునట్లు భీమకవి శపించెను.
క|| కూరడుగము కాయడుగము
నారాయఁగా నుల్లి బచ్చ లల్ల మడుగ మా
పేరాముదపా కడిగినఁ
బారమ్మున నేసెనట్టే బాపఁడు ద్రెళ్ళు. 293
అనుగ్రహించి భీమకవి జన్న మాంబయను నామెకు గండమాలావ్యాధిని పద్యరచనచే గుదిర్చేను.
క|| ఘనరోగంబుల బలమా
కనుగొనఁగా జన్నమంబ కర్మపు ఫలమా
నినుఁ బ్రార్థించెద వినుమా
మునుకొని యోగండమాల! మునుగకు జనుమా! 294
కొన్నాళ్ళ కామె మీఁద మరలఁ గోపించి శపించి మరల నావ్యాది నామెకే వచ్చునట్లు చేసెనట. ఈతని పద్యములు పెక్కులు 'మైలమ భీమన' మీఁదివి. అక్కడ చూచునది.*
కవి సర్వభౌముఁడు శ్రీనాధుడు
క్రీ.శ. 1380 ప్రాంతమున జనియించి 1450 తర్వాత వఱకు జీవించి పూర్ణపురుషాయుషజీవియై యనేక సుకవిరాజసమ్మానములఁ గాంచి యాంధ్ర కవిమండలియం దనన్యసామాన్యమైన సుపత్రిష్టనంది మహాభోగముల ననుభవించయగాక తుదకుఁ గష్టములఁగూడఁ జవి సూచి బృహస్పతికి సయితము గుండియలు దిగ్గురనునట్లు స్వర్గమున కరిగిన యీ యుద్ధండ పండిత కవిని దెల్గు
-------------
* చాటుపద్యమణిమంజరి -ప్రభు- మంత్రి ప్రశంసాస్తబకమున ఈ విషయము చూడఁదగును. మఱియు భీమకవిని గూర్చిన మరికొన్ని వివరములకు వేటూరి వారి ప్రబంధరత్నావళి; మీగడ తఱకలు చూడఁదగును. దేశమున మాతృభాషాభిమానులలో నెఱుంగనివా రుండరు. ఈమహకవిచే శృంగారనైషదాదులగు ప్రబంధములే కాక యింక ననేక ములగు చాటు పద్యములును రచయింపఁ బడినవి. అందు రసోత్తరము లిందు దహరింపఁబడును.
శ్రీనాధుఁడు కర్ణాటాంద్ర రాజ్యాదీశ్వరుఁడగు సంబురాయని తెలుంగు రాయలయొద్ద కరిగి యాతని నాశీర్వదించినది....
శా. ధాటీ ఘోటకరత్న ఘట్టనమిళద్ద్రాఘిష్ట కళ్యాణఘం
టాటం కారవిలుంఠలుంఠి మహోన్మత్తాహిత క్షోణిబృ
త్కో టీరాం కితకుంబినీ ధర సముత్కూటాటవీఝూట క
ర్ణాటాంద్రాధిప! సాంపరాయని తెలుంగా! నీకు బ్రహ్మయువౌ. 295
అనృపాలుఁని గస్తూరి యాచించుచుఁ జెప్పిన పద్యము....
శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాదీశ! కస్తూరికా
బిక్షాదానము సేయురా సుకవిరాడ్భృందారక శ్రేణికి
దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్. 296
వెల్గోటిరాజును బండితకవియునగు సర్వజ్ఞ సింగభూపాలు నాస్థానము నకుఁ బోయి యానృపాలుని కొల్వుకూటమునకు ముందుఁ బూజింపఁబడుచుండేడు శారదావిగ్రహమును గాంచి యాతఁడు చెప్పిన పద్యము....
సీ. దీనారటంకాలఁ దీర్ధమాడించితి
దక్షిణాదీశుముత్యాలశాల
పలుకుఁదోడై తాంద్రభాషామహాకావ్య
నైషదగ్రంధసందర్భమునకు
వగులఁగొట్టించి తుద్భట వివాద ప్రౌడి
గౌడడిండి మభట్టుకంచుడక్క
చంద్రభూషక్రియాశక్తి రాయలయొద్దఁ
బాదుకోల్పితి సర్వబౌమ బిరుద
గీ. మెటులు మెప్పించేదో నన్ను నింకమీఁద
రావుసింగమహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సరససద్గుణ నికురుంబ! శారదాంబ! 297
క. సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావుసింగజనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్జుం డనుట కుక్క సామజ మనుటే 298
ఆయాస్థానమున నొక బుట్టుకవి యిచ్చిన సమస్య. "కుక్కవో నక్కవో ఫణివొ క్రోఁతివొ పిల్లివో బూతపిల్లివొ ". కవి సర్వభౌముని పూరాణము.
ఉ. తక్కిన రావుసింగవసుధావరుఁ డర్దుల కర్ధ మిచ్చునో
దిక్కుల లేని కర్ణుని దదీచిని ఖేచరు వేల్పు మ్రానుఁ బెం
పెక్కిన కామధేనువు శిబీంద్రుని నేన్నుదు భట్టు! దిట్టవై
కక్కువో! నక్కవో! ఫణివో! క్రోఁతివొ! పిల్లివొ'; బూతపిల్లివో! 299
శ్రీనాధుఁడు రెడ్ల యస్థానకవి. రెడ్లకు వెల్గోటివారికి దైవము. ఈతఁడు తిరిగి రెడ్ల యాస్థానమునకుఁ బోఁగాఁ దమ శత్రువగు సింగమనేని నట్లు పొగడి నందుకు వారు కుపితులై యిచ్చకాలమారివని చుల్కన చేసి వల్కిరట! నేనా పద్యమున నాతని గూడముగా వెక్కిరించితినే గాని పొగడలేదని శ్రీనాధుఁడిట్లా పద్యమున కన్వయము చెప్పెనట! "సర్వజనామధేయము శర్వునకే. రావు సింగజనపాలున కేయుర్వింజెల్లును ? (శివునిఁగాక) తక్కొరు సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.
వేఱొకప్పుడు వేల్గోటి మాదయ లింగమనేఁడు రెడ్లకఠారిని గై కొనఁగా నాకఠారిని దిరిగి రెడ్లకడకుఁ జేర్చుటకై శ్రీనాధుఁ డాతని కడ కరిగి పొగడిన పొగడ్త-
