"అల్లరి పిల్లా!" అంటూ ఆమెను మళ్ళీ దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
"అమ్మో! అబ్బాయి గారికి జోరెక్కువయింది. నా జాగ్రత్తలో నేనుండొద్దూ?" అంటూ దూరంగా పారిపోవడానికి ప్రయత్నించింది.
"ఆగు సాహితీ! ప్లీజ్ ఆగు!" తన ప్రవర్తనకు నొచ్చుకున్నట్టు అన్నాడు.
ముందర కాళ్ళకు బంధం వేసినట్టు సాహితి ఠక్కున ఆగిపోయింది.
"సాహితీ! ఐ లవ్ యూ! మనం పెళ్ళి చేసుకుందాం."
"మన పెళ్ళికి మీ పెద్దలు ఒప్పుకుంటారా? నాకైతే మా ఆంటీ ప్రాణం పోయినా మన పెళ్ళికి ఒప్పుకోదనిపిస్తుంది. మన పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇక మీ దారి మీది, నా దారి నాది" అంది ఉడికిస్తూ.
"సాహితీ! నేను సీరియస్ గా అడుగుతుంటే నువ్వు తేలిగ్గా కొట్టి పారేస్తున్నావు. ఇది భావ్యమా?" సమ్రాట్ బాధపడుతూ అన్నాడు.
"సారీ సమ్రాట్! నేనూ సీరియస్ గా ఆలోచించే చెబుతున్నాను. నేను మా ఆంటీని ఒప్పించలేను. అలా అని ఆమె మనసు కష్టపడే పని చేయలేను. ఇక మన పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పండి!" ఆమె గొంతు వణికింది.
"సాహితీ! అలా అని మనం నిరాశ పడటమేనా?"
"ఏమో! నాకేం తెలుస్తుంది. మీరే సలహా ఇవ్వండి!" అంది అమాయకంగా.
"నా సలహాను నిజంగా పాటిస్తావా?" ఆత్రుతగా అడిగాడు.
"నచ్చితే తప్పక పాటిస్తాను."
"మనం ఎవరికీ తెలియకుండా...."
"ఊఁ, తెలియకుండా?"
"వెళ్ళిపోదాం. అంటే లోకం భాషలో లేచిపోదాం!" కొంటెగా చూశాడు.
"ఇంకోసారి ఆ మాట అన్నారంటే మీ మొహం చూడను! అయినా, అంత బరితెగించి మీకోసం కాచుక్కూర్చున్నాననుకున్నారా?" సాహితికి ఎక్కడలేని కోపం వచ్చి ముఖం ఎర్రబడింది.
"క్షమించు. ఏదో జోక్ గా అన్నాను. మనం ఎవరికీ తెలియకుండా ఏదైనా గుడికి వెళ్ళి రహస్యంగా పెళ్ళి చేసుకుందాం!" మళ్ళీ అనునయంగా అన్నాడు.
"అమ్మో! గుళ్లో పెళ్ళా?"
"అవును. ఎంతమంది గుళ్ళలో పెళ్ళిచేసుకుని కాపురాలు చేయడం లేదు?"
"నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. అయినా అంత హడావుడిగా మనం పెళ్ళెందుకు చేసుకోవాలి? అమ్మో! చీకటి పడింది, ఇక నేను వెళతాను. గుడ్ నైట్!" అంటూనే అతని సమాధానం కోసం ఆగకుండా సాహితి చరచరా వెళ్ళిపోయింది.
సాహితిని పెళ్ళికి ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడ్డాడు సమ్రాట్.
మెరుపులా తళుక్కున మెరిసిందొక ఆలోచన!
* * * *
సాహిత్యం కేవలం రాసాస్వాదనకే ఉపయోగపడుతుందనుకోవటం పొరపాటు.
అలా అని మంచిని పెంచాలంటూ కొలమానాలు పెట్టుకుని రచనలు చేస్తే అవి వెలుగులోకి వస్తాయా?
రేయింబవళ్ళు శ్రమించి, హృదయ సాగర మథనం చేసి రక్తాక్షరాలు పొందుపరిచే రచయిత కేవలం ఈ రచన నాది అని చెప్పుకోడానికేనా లేక మరేమైనా ఆశిస్తాడా?"
ఇటీవలి కాలంలో పుంఖాను పుంఖాలుగా వస్తున్న రచనల వెనుక రచయిత కష్టం లేకుండా ఉంటుందా? కేవలం ఆత్మ సంతృప్తి కోపం అయితే ఒకటి, రెండు అత్యుత్తమ రచనలు చేసి తృప్తి పడవచ్చు. కాని వందల సంఖ్యలో రాయాలని రచయిత ఉవ్విళ్ళూరడంలోని ఆంతర్యం ఏమిటి?
దేశంలో వందల సంఖ్యలో పత్రికలు పుడుతుంటే, అంతకు రెట్టింపు సంఖ్యలో రచనలు వస్తుంటే, లక్షల కొలది పాఠకులు ఉన్నప్పుడు ఇక అభిమానులకు, అభిమాన సంఘాలకు కొదవేమిటి?
సమ్రాట్ ప్రతి రచనా అటు పత్రికలనూ, ఇటు ప్రచురణ కర్తలనూ విశేషంగా ఆకట్టుకుంటున్నది. దానికి కారణం అతని రచనలు చదివే పాఠకుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరగడమే!
అంత పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న సమ్రాట్ క్షణికానందాల కోసం వెంపర్లాడుతూ తన పతనాన్ని తనే కోరుకుంటాడా?
ప్రయాణం చేస్తూ ఉలుకూ, పలుకూ లేకుండా దీర్ఘాలోచనలో ఉన్న బిందుమాధవి కారు హఠాత్తుగా ఆగడంతో ఉలిక్కిపడింది.
"ఆంటీ! మెయిన్ రోడ్డు జంక్షన్ కు వచ్చాం. కారును ఎటు పోనివ్వమంటావు?"
బిందుమాధవి కారును పోలీస్ క్వార్టర్ల వైపు పోనివ్వమంది.
సాహితి ఆలోచనలో పడింది.
"ఇన్ స్పెక్టర్ వీరేష్ టీకి పిలిచాడు. వెళ్దాం పోనివ్వు!" ఆమె సంశయం అర్థంచేసుకున్నట్టు అంది బిందుమాధవి.
టౌనులోకి వెళ్దామంటే తనూ బయలుదేరింది. ఇది ముందుగా తెలిస్తే తను తప్పించుకునేది.
సాహితి అన్యమనస్కంగానే కారును ముందుకు పోనిచ్చి పోలీసు క్వార్టర్సులో ఇన్ స్పెక్టర్ వీరేష్ ఇంటిముందు ఆపింది.
వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్న వీరేష్ సాదరంగా వాళ్ళను లోనికి ఆహ్వానించాడు.
అప్పటికే వీరేష్ ఇంట్లో అనూష కూర్చుని పేపర్ చదువుతోంది.
"మీ శ్రీమతి గారిని పరిచయం చేయనేలేదు!" అంది బిందుమాధవి.
వీరేష్ ముఖంలో విషాదం చోటుచేసుకుంది.
టీ, బిస్కెట్లు టీపాయ్ మీద సర్దుతున్న ఒక ఇరవై ఏళ్ల యువతీ మీద నిలిచాయి అందరి చూపులూను.
"ఈమె....?" అనుమానంగా అడిగింది బిందుమాధవి.
"నో, నో! మీరు అనుమానిస్తున్నట్టు ఈమె నాకేమీ కాదు. నా భార్య పోయింది." వీరేష్ కను కొలకులలో నీళ్ళు నిలిచాయి.
"క్షమించండి! ఇంత చిన్న వయసులోనే మీరు కష్టాల పాలయ్యారా?" జాలి కురిపిస్తున్నట్టుగా అంది బిందుమాధవి.
"మరి ఈమె యెవరు అంకుల్?" సాహితిలో తెలుసుకోవాలనే జిజ్ఞాస గోచరిస్తున్నది.
