Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 31

మళ్ళీ అందరూ ఒక్కసారిగా లేవబోయారు.
"అలా కాదు, ఒక్కొక్కళ్ళూ. ముందు మోఅతి సీటు దగ్గర నుండీ మొదలు పెట్టండి."మొదటి సీటులో వున్న ముగ్గురూ నెమ్మదిగా ఒకరి వెనుక ఒకరు బస్సుదిగారు.
ఆ తరువాత ఒక్కొక్కరుగా, మొత్తం బస్సులో అందరూ దిగారు.
పండరీకాక్షయ్య భయపడుతూనే చంకలో గొడుగు ఇరికించుకుని, పచ్చబ్యాగ్ చేతితో పుచ్చుకుని బస్సు దిగాడు.
క్రిందవున్న నలుగురూ, అక్కడ అందరినీ ఉద్దేశించి చెప్పారు. "ఈ రోడ్డు కడ్డంగా మీరందరూ పడుకోండి! మేము ఈ బస్సుని త్రిప్పుకుని వెళ్ళిపోతాము. ఈ బస్సు ఆ కొండ మలుపు తిరిగేదాకా, ఎవరూ రోడ్డు మీంచి పైకి లేవకూడదు. లేచినట్లు కనపడిందో మళ్ళీ మేము వెనక్కి వచ్చి. ఈ డ్రైవర్ గాడి పుచ్చె ఎగరకొట్టినట్లు, మీ పుచ్చెకూడా ఎగరకొడతాం!" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
అప్పుడు పడ్డాయి అందరికళ్ళూ తలపగిలి బస్సు ప్రక్కగా ఇంకా రక్తం వోడుతూ క్రింద పడివున్న డ్రైవర్ దేహం మీద.
ముందుగా తెలివి తెచ్చుకున్న కొందరు, గబగబా వెళ్ళి రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు. మరికొందరు తాపీగా నడుస్తూంటే.
"ప్రాణంమీద ఆశలేదా? తీరుబడిగా పిల్లి నడకలు నడుస్తున్నారు" అని దుండగులు అరవటంతో, అందరూ గబగబా వెళ్ళి రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు.
పుండరీకాక్షయ్య, బ్యాగ్ మీద ఒకే చెయ్యివేసి వుంచి, గొడుగుని తలక్రింద పెట్టుకుని, ఉసూరుమంటూ రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు.
అందరూ రోడ్డుమీద పడుకోంగానే.
దుండగులు అంతా ఇప్పుడు వీళ్ళు వచ్చిన బస్సులో ఎక్కారు.
బస్సుని వెనక్కి త్రిప్పుకుని, వెళ్ళబోతూ వీళ్ళందరికీ వాళ్ళొక హెచ్చరిక చేసి బయలుదేరారు.
"మీలో ఎవరైనా మా రూపాలని, మా కంఠ స్వరాలని బాగా గుర్తుంచుకోవచ్చు. కానీ ఈ విషయం మర్చిపోండి. పోలీసులు మా ఆనవాళ్ళు అడిగితే మీకు తోచినది ఏదో చెప్పండి. అంతేకాని అసలు రూపం పొరపాటున కూడా చెప్పకూడదు. మీరు మా గురించి నిజం చెప్పిన మరుక్షణం; మాకది ఎలాగో అలాగ తెలిసిపోతుంది. ఆ తరువాత, మిమ్మల్ని తరిమీ తరిమీ నరకయాతనలు పెట్టి మరీ చంపుతాం, ఈ విషయం బాగా గుర్తుంచుకోండి!"
ఇలాంటి హెచ్చరికలు చేసిన తరువాత, బస్సులో ప్రయాణించి ఇక్కడదాకా వచ్చిన ఆ నలుగురూ, ఇక్కడ ఈ బస్సుకోసం ఎదురుచూస్తూ క్రిందనుంచున్న ఆ నలుగురూ, మొత్తం ఎనిమిది మందీ, బస్సు ఎక్కి శరవేగంతో తిరుగుతూ ప్రయాణమయ్యి వెళ్ళిపోయారు.
ఐదు నిమిషాల తరువాత,
"ఇంక లేవచ్చేమో" క్రింద పడుకున్న వాళ్ళలో ఒకడు అన్నాడు.
"బస్సు కొండ మలుపు తిరిగిపోయి చాలాసేపయింది. లేవచ్చు అనే అనుకుంటాను" అన్నాడు మరొకతను.
ఒకడు ధైర్యం చేసి ముందుగా లేచి నుంచున్నాడు.
ఏమీ జరగలేదు.
దానితో అందరికి ధైర్యం వచ్చింది.
రోడ్డుకి అడ్డంగా పడుకున్న అందరూ పొలోమంటూ లేచి నిలబడ్డారు.
చుట్టూ ఒకసారి చూశారు. చుట్టు ప్రక్కల ఏమీలేవు. రోడ్డుకి అడ్డంగా వున్న బస్సు, తల పగలుకొట్టబడి చనిపోయిన డ్రైవరు.
అంతే.
ఎవరికి వారికే ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
"వాళ్ళు ఆ బస్సులోవచ్చి వుంటారు. ఆ బస్సు చెడిపోయి వుంటుంది. మనల్ని బెదిరించి మనందరినీ బస్సుదించేసి, వాళ్ళు ఈ బస్సు ఎక్కి పారిపోయివుంటారు" అన్నాడు ఒకడు.
"బస్సు చెడిపోతే రోడ్డుకి అడ్డంగా ఎలా పెట్టబడివుంది? వెంటనే అన్నాడు మరొకడు.
"మనతోపాటు ప్రయాణించి మన బస్సులో నలుగురు వచ్చారు కదా!" ఒక ఆయన ఆలోచిస్తూ ఈ మాట పైకే అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS