రాబందులు
రెవెన్యూ స్టాంపు మీద సంతకం చేస్తున్న జానకి చేతివేళ్ళు వణికాయి. ఇదే ఆమె ఆఫీసులు తీసుకొనే ఆఖరి జీతం.
పరధ్యానంగా డబ్బందుకొని, యాంత్రికంగా పర్సులో పెట్టుకొని, బరువుగా బయిటకి నడుస్తున్న జానకిని ఆఫీసులో కొందరు జాలిగా చూశారు.
మరి కొందరు జాలి పడుతున్నట్టు ముఖాలు చూశారు.
జానకి తలవంచుకుని, కాళ్ళీడ్చుకుంటూ పేవ్ మెంటు మీద నడక సాగించింది.
ఆమెకు భవిష్యత్తు అంధకారమయంగా కన్పిస్తోంది. కళ్ళు పొడుచుకొని చూసినా వెలుగురేఖ కన్పించింది లేదు.
రోడ్డు మీద కార్లూ, సైకిలు రిక్షాలూ వరసలుగా పోతున్నాయి. రోడ్డుకు ఇరుపక్కలా పేవ్ మెంటు మీద జనం నడుస్తున్నారు.
జానకికి ఇదేమీ కన్పించడం లేదు. తను హఠాత్తుగా ఏదో నిర్జీవ ప్రదేశంలోకి విసిరేయబడినట్టు అనిపించసాగింది.
వీధి దీపాలు వెలిగాయి.
జానకి కలలో నడుస్తున్న దానిలా వచ్చి, లకడీకపూల్ బస్ స్టాండులో నిలబడింది అలవాటు ప్రకారం.
ఆమె ఆలోచనలన్నీ తన పర్సులోవున్న ఆ రెండు వందల ఏభైరూపాయల చుట్టూనే తిరుగుతున్నాయ్.
ఈ డబ్బుతో ఎన్ని వారాలు బతకాలి! ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మ ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఏకరువు పెడుతుంది. అవన్నీ వెంటనే తీర్చవలసిన అప్పులు. లేకపోతే పాలవాడు పాలు పొయ్యడు. కిరాణా షాపువాడు సరుకులు ఇవ్వడు.
జానకికి తల్లిమీద విసుగు కలిగింది. అంతలోనే జాలి ముంచుకొచ్చింది.
పాపం! ఆమె మాత్రం ఏం చేస్తుంది. అన్నీ ఇంటి అవసరాలకు తప్పనిసరైన ఖర్చులే!
అసలే జబ్బు మనిషి!
తనకు ఉద్యోగం పోయిందని తెలిస్తే...?
దీనికంతా కారణం ఆ సర్వీస్ కమిషన్ కాండిడేట్! ఇంతకాలంగా ఎక్కడెక్కడో కాలక్షేపం చేసిన వాడు, తన ఆఫీసులోనే తన సీట్లోకే వచ్చి వాలాలా! ఇంతకూ ఆ సావిత్రి అదృష్టవంతురాలు. ఒకరోజు తనకంటే సీనియర్, అపాయింట్ మెంటు ఇద్దరికీ ఒకరోజే వచ్చింది. అమ్మకు ఆ రోజే రోగం ఎక్కువ కావాలా! అందుకే తను ఆరోజు ఆర్డర్సు అందుకోగానే ఆఫీసుకు వెళ్ళలేక పోయింది.
ఒక్కరోజయినా సీనియర్ సీనియరే! నిముషాలూ క్షణాలే వ్యక్తుల జీవితాన్ని తారుమారు చేస్తున్న ఈ యుగంలో ఇరవైనాలుగు గంటలు ... సీనియర్ (ఇరవై నాలుగు గంటలే) పని సరిగా చేయకపోయినా తీసెయ్యడానికి (జూనియర్ వుండగా) రూల్సు ఒప్పుకోవట.
ప్రపంచంలో సుఖసంతోషాలన్నీ అదృష్టవంతులకే భుక్తమైనట్టు, ఈ రూల్సు కూడా వారికే ఊడిగం చేస్తాయి. కాకపోతే ఆ సావిత్రికి ఉద్యోగం వుండటం ఏమిటి? తనకు పోవడం ఏమిటి!
అసలా సావిత్రికి ఉద్యోగం ఎందుకు? అలనాటి సత్యభామకు ఏడు వారాల నగలుంటే ఈ సావిత్రికి ఏడు మాసాల నగలైనా వుంటాయి. ఎప్పుడూ నగలు మార్చుతూనే వుంటుంది. ఇక చీరల సంగతి చెప్పనే అక్కరలేదు.
ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్నాననీ, పెళ్ళికాగానే మానేస్తాననీ, అడిగిన వాళ్ళకూ, అడగని వాళ్ళకూ కూడా చెప్తూ వుంటుంది.
ఒళ్ళు వంచి పని చెయ్యదు. పని చెయ్యమని గట్టిగా మందలించే దమ్ములు ఎవరికీ లేవు. ఆఫీసరుగారి స్నేహితుడి కూతురట!
రంగురంగుల చీరల్లో, చిరునవ్వుల్ని ఒలకపోస్తూ వయ్యారాలు పోయే సావిత్రిని చూడటాని అందరూ ముచ్చట పడ్తారు.
తన పరిస్థితికి ఆఫీసులో అందరూ మొసలి కన్నీళ్ళు కార్చిన వాళ్ళే!
