"మీరెందుకు నాతో అబద్ధం ఆడారు?" అంటూ ఒక ఘీకారం లాంటిది చేశాడు ఇన్ స్పెక్టరు వర్ధనరావు.
ఏదో అయింది, అంత వరకూ గ్రహించాను. ఇలాంటపుడే జాగ్రత్తగా వుండాలి.
పిచ్చివాళ్ళతో మాట్లాడేటపుడు అమావాస్య, పౌర్ణమి చూసుకోవటం ఎంత మంచిదో, కనీసం ఈయనగారు ఈ దుస్తుల్లో వున్న కాసేపయినా, నాలాంటి వాడు వినమ్రంగా వుండటం మంచిది. అలా అనుకుని "మేమా సార్! అబద్ధం ఆడటమా! అందుట్లో దేవుడిలాంటి మీతోనా! రామ! రామ! అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు సార్! అందుకని నేను అబద్ధాలు ఆడను."
నా మాట సాంతం పూర్తికాక ముందే ఆయన ముఖంలో వెంట వెంటనే రంగులు మారాయి.
"అంటే ఏమిటి నీ ఉద్దేశం! మా అమ్మ వుత్త అబద్ధాల కోరనా నీ వుద్దేశ్యం?" గద్దిస్తూ అడిగాడు.
నా మాటలకీ, వాళ్ళ అమ్మ అబద్ధాలు ఆడటానికి సంబంధం ఏమిటో ఆ క్షణాన నాకు అర్థం కాలేదు.
"మీలాంటి వుత్తముల్ని కన్న మీ అమ్మగారు అబద్ధాలాడటం ఏమిటి సార్? ఛ! ఛ!" బోలెడు విచారంగా ముఖం పెట్టి అన్నాను.
"ఇంతకు ముందు నువ్వే అన్నావు కదా! అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని."
"అన్నాను సార్! అందులో అబద్ధం ఏముంది?"
"అదిగో మళ్ళీ అదే కూత ఇలాంటి కూతలంటేనే నాకు వళ్ళు మంట. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారన్నావు కదా! అసలు ఎన్ని అబద్ధాలు ఆడితే ఒక ఆడపిల్ల పుడుతుందీ?"
నేను కాస్త ఆలోచించినట్లు నటించి, "వెయ్యినూటపదహారు అబద్దాలు ఆడితే ఒక ఆడపిల్ల పుడుతుంది సార్! అలా ఒక తల్లికి ఎందరు ఆడపిల్లలు పుడితే అన్ని వెయ్యినూటపదహారు అబద్ధాలు ఆడినట్లు సార్!"
"ఔనా?"
"ఔనుసార్!" చాలా నిజాయితీగా అన్నాను.
నామాట వినంగానే కాసేపు తీవ్రాలోచనలో పడిపోయాడు. వేళ్ళు ముడుస్తూ, తెరుస్తూ రెక్కలు వేస్తూ ఉండిపోయాడు కాసేపు. తరువాత తలకాయ అడ్డంగానూ, నిలువుగానూ కొద్దిసేపు ఆడించాడు. బదు నిమిషాలసేపు నానా అవస్తాపడి, అహోబిలం వేపు తిరిగి, ఒకసారి ముక్కు ఎగబీల్చి వదిలి "అహోబిలం!" అన్నాడు గాంభీర్యంగా ముఖంమార్చి.
"ఎస్ సార్! ఏమిటి సార్! చెప్పండి సార్!" అన్నాడు అహోబిలం కంగారుగా.
"నాకు లెక్కలు తెలియకకాదు. నీకు లెక్కలు వచ్చో రావో తెలుసుకోవటానికి చిన్న పరీక్ష, ఎనిమిది వెయ్యి నూట పదహార్లు అంటే ఎంతోయ్!" అధికార దర్పం ఉట్టిపరుస్తూ అడిగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
విషయమేమిటో చూచాయిగా నాకు అర్థమైపోయింది.
"ఎందుకు సార్?" ఏడుపు ముఖం వేసుకొని అడిగాడు అహోబిలం.
"చెప్పాలా? నువ్వడగంగానే నేను చెప్పాలా? నేనేమిటి? నా పోష్టేమిటి? నా కుర్చీ విలువేమిటి? ఆన్సర్ టుది పాయింటు! ఊ...ఇంక చెప్పు! లెక్క సరిగా వుండాలి సుమా! సున్నాకూడా గుండ్రంగా వుందా అనేది నా సిద్ధాంతం. ఒక్క అంకె తేడా వచ్చినా సహించను. వూ... క్విక్! చెప్పేసెయ్" ఆర్డర్ జారీచేశాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
ఆహోబిలానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. నావేపు కోపంగా చూశాడు. ఆ తరువాత తనతో తనే గొణుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత నెత్తిమీద టోపీ తీసి కాసేపు తల గోక్కున్నాడు. తల బలంగా విదిలించాడు. నానాపాట్లు పడ్డ తరువాత "ఇలాంటి సమయంలో కాలిక్యులేటర్ వుండాలి సార్! కనీసం ఎక్కాల పుస్తకం అన్నా...న్నా...న్నా"
"ఆపేయ్! రికార్డాపేయ్! న్నన్నన్నా అంటూ నాన్చకపోతే, లెక్కలు రావని ఒక్కమాట చెప్పొచ్చుకదా! ఏ గోలా వుండదు"
"నాకు సరీగా లెక్కలు రావు సార్" తేలిగ్గా ఊపిరి పీల్చి వదులుతూ టకీమని చెప్పేశాడు అహోబిలం.
ఆ మాట వినంగానే ఇన్ స్పెక్టర్ గారి ముఖం పాతకాలపు పైసా అంత అయింది.
కొద్దిసేపు ఆలోచించాడు. ఏమాలోచించాడో ఏమోమరి ఆయన గారి కళ్ళు తళుక్కుమన్నాయి. "నీకు లెక్కలు వచ్చా?" నన్నడిగాడు.
"వచ్చుసార్! ఒకటో ఎక్కం చెప్పనా? లేక వందో ఎక్కం చెప్పనా?"
"ఇప్పుడు ఎక్కాలు వద్దులే! నా లెక్కకి జవాబు చెప్పు చాలు, ఎనిమిది వెయ్యి నూట పదహార్లు కలిపితే ఎంత అంకె వస్తుంది?"
"ఎందుకు సార్?" ఆత్రుతగా అడిగాను.
"ఎదురుప్రశ్న వద్దు! సమాధానం చెప్పు!"
ఒక్కసారి కళ్ళు మూసుకుని తరిచి, "ఎనిమిది వెయ్యినూటపదహార్లు కలిపితే వచ్చే మొత్తం ఎనిమిదివేల తొమ్మిదివందల ఇరవై ఎనిమిది సార్" అని చెప్పాను.
"నువ్వు కరెక్టుగానే చెప్పావు కదూ!"
