Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 31


    "మిస్టర్ శశాంకా... నేనిక్కడకు వచ్చింది ఒక పోలీసాఫీసరుగా కాదు... మీ గురించి తెలిసిన ఓ స్నేహితుడిగా" అవినాశ్ ప్రసన్నంగా చూస్తూనే అన్నాడు. "నాకు తెలుసు ఎలాంటి మానసిక స్థితిలో మీరా స్టేట్ మెంటిచ్చిందీ. కాని ఒక్క విషయం "దేశమంటే మనుషులే కాదనను. కాని కొందరు మనుషులు మాత్రమే దేశం అంటేనే అంగీకరించను... ఆ కొందరి మీద ద్వేషంతో దేశాన్ని నిందించడం మీలాంటి వాళ్ళు చేయాల్సిన పని కాదు. ప్లీజ్ హేవ్ ఎ సెకండ్ థాట్."


    "సారీ మిస్టర్ అవినాశ్... ఇట్స్ టూ లేట్."


    "బెటర్ లెట్ దేన్ నెవ్వర్" మందహాసం చేశాడు.


    "అవును శశాంకా... మీవయసెంతని. ఇంకా మీరు చాలా సాధించాలి. మరింతగా ఎదగాలి..."


    "ఎదిగే వాడ్నేమో కాని మొదటి మెట్టుమీదనే మనసు తూట్లు పడిపోయింది."


    "దానికి శిక్షనుభవించాడు ధనుష్కోటి."


    "మీరు విధించారా?" శశాంక నొసలు చిట్లిస్తూ అన్నాడు.


    "కాకపోవచ్చు." అతడు చంపబడింది జయచంద్ర ముఠా చేతనే అని డిపార్ట్ మెంట్ ఓ నిర్ణయానికి వచ్చినా కేవలం పేరు రాసినంత మాత్రాన జరిగింది జయచంద్ర మూలంగా అని అవినాశ్ సైతం నమ్మలేకపోతున్నాడు.


    అలా అని జయచంద్రపై పెద్ద సదభిప్రాయం వుందని కాదు... బిజినెస్ టైకూన్స్ గా ప్రజలకి తెలిసిన వీళ్ళంతా అండర్ వరల్డ్ రాకెట్స్ నడిపే గాంగ్ లీడర్స్ గా అవినాశ్ కి బాగా తెలుసు.


    కాని అతడు అనుమానించేది గుజరాత్ గాంగ్ నే...


    ఆ రోజు తన ముఠాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని కడతేర్చి మొత్తం స్వాహా చేసిన ధనుష్కోటిని జాంనగర్ కి చెందిన 'ఫల్ఫ్ కింగ్' దావూద్ చంపించి వుంటాడన్నది అతడి నమ్మకం.


    "మేం కాకపోయినా శిక్ష విధించబడింది మరోలా అయినా..."


    "దానికి మీరు క్రెడిట్ తీసుకోలేరు మిస్టర్ అవినాశ్..." ఓ క్షణం సాలోచనగా చూసేడు. "ఒక వేళ సకాలంలో మీరు నాకు న్యాయమే చేసివుంటే నేను అలాంటి నిర్ణయానికి వచ్చేవాడ్ని కాదేమో..."


    "మీరు రణధీర్ ప్రవర్తనని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారనుకుంటాను... ప్రభుత్వం ఉప్పుతింటూ ధనుష్కోటికి ఇన్ ఫార్మేంట్ గా పనిచేస్తున్నందుకు అతడు సస్పెండ్ చేయబడ్డాడు నిన్న సాయంకాలమే."


    "ఇప్పుడది నాకెలాంటి సంతృప్తినీ ఇవ్వదు."


    "అయామ్ సారీ మిస్టర్ శశాంకా... ఒక్క ధనుష్కోటి, లేకపోతే ఒక్క రణధీర్ మీ జీవిత గతిని మార్చేశారూ అంటుంటే వినడానికి బాధగా వుంది."


    "బాధ దేనికి" నిర్లిప్తంగా నవ్వాడు.


    "యస్ అంతే... మీ టార్గెట్స్ వాళ్ళు కాకూడదు... ఈ దేశపు సరిహద్దుల్ని దాటి ప్రపంచం నలుమూలలదాకా ప్రాకాల్సిన మీ కీర్తిని కేవలం ఇద్దరు వ్యక్తులకోసం సమాధి చేసుకోవడం ఇట్సే సివికల్..." పైకి లేచిన అవినాశ్ ఆత్మీయంగా శశాంక భుజంపై చేయి వేశాడు. "మిస్టర్ శశాంక! జీవితం అనంతమైనది. దానికి ఏ ఒక్క వ్యక్తో ఆటంకం కాకూడదు... మీరు ప్రత్యేకించి నా డిపార్ట్ మెంట్ పై చాలా ద్వేషంతో మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నాను. అమరూ రణధీర్ లే లేరు కాబట్టి ఒక మనిషి మూలంగా మమ్ముల్నందర్నీ ద్వేషించకండి... ఆ ద్వేషంలో మీ భవిష్యత్తు పాడుచేసుకోకండి."


    "మీ అభిమానానికి థాంక్స్... కాని నా నిర్ణయం ఎప్పుడో మారిపోయింది."

    
    "అది మళ్ళీ మార్చాలనే వచ్చింది."


    "ఎందుకు మీరింతగా నచ్చచెప్పాలని చూస్తున్నారో నాకు అర్థంకావడం లేదు."


    "నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి...ఈ దేశం గర్వించదగ్గ ఏ ఒక్క వ్యక్తీ నిరాశావాదిగా మారడం ఇష్టపడను కాబట్టి."


    నవ్వేడు శశాంక. ఆ నవ్వులో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేని బాధా నిర్లిప్తత. "మీరు చాలా ఆశావాదిలా మాటాడుతున్నారు. ఒక్క విషయం... నేనూ మీ గురించి విన్నాను...ఆశావాదిగా మీరెంతవరకు సాధించారు."


    ఓ లిప్తపాటు భావరహితంగా చూశాడు. "నా సాధన ఈ సంఘానికి పట్టిన చీడ పురుగుల్ని ఏరిపారేయడమే అయితే అది ఒక్క రోజుతో ఆగిపోదు. ఎవరడ్డమొచ్చినా నా యాత్ర సాగిపోతూనే వుంటుంది."


    "ఎంతవరకూ..." ఆ రోజు ధనుష్కోటి కాల్పుల్లో గాయపడిన అవినాశ్ రూపం స్వల్పంగా మెదిలిందతడి కళ్ళలో. "ఈ సంఘాన్ని శాసించే మరో వర్గం చేతుల్లో ప్రాణాలుపోయేదాకానా"


    "మీ ప్రశ్నకి నేను బాధపడడంలేదు శశాంకా" మృదువుగా నవ్వాడు అవినాశ్. "ఇలాంటి ప్రశ్నకు జవాబు చెప్పడానికి గర్విస్తాను. ఎందరో గుండెలొడ్డి పోరాడి సంపాదించిన ఈ దేశ స్వాతంత్ర్యానికి నా జాతి మనుషులే గొడ్డలిపెట్టు అయినప్పుడు వారి వేటలోనే అవసరమైతే ప్రాణాలు విడుస్తాను... మీరు ద్వేషించే నా డిపార్ట్ మెంట్ కళంకాన్ని ఆ విధంగా తుడిచేసే ప్రయత్నం చేస్తాను."


    "ఎవరు గుర్తించారు మీ నిజాయితీని... ఈ తుచ్చ రాజకీయాలతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరమబడుతున్నారు. అంతేగా."


    "మిస్టర్ శశాంక... ఏ పసితనంలో మీరలా మాట్లాడుతున్నారో అర్థమైన నేను మరిన్ని వివరాలు సగర్వంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేనేం సాధించానూ అన్నది మీ ప్రశ్న అయితే, దానికి నా జవాబు ప్రపంచమంత పెద్దది. దావూద్ ఇబ్రహీం సోదరుల్ని తొలిసారి బాంబేలో ఎదిరించి, వాళ్లకి నిద్రలేకుండా చేశాను. సైకిళ్ళపై ఇంపోర్టెడ్ బట్టలమ్ముకుంటూ తిరగే డోలకియా బ్రదర్స్ గీర్ గాంలో స్మగ్లర్స్ గా ఎదిగి దారుణమైన హత్యాకాండకి సిద్ధపడితే వెంటాడి వేటాడి కటకటాల వెనక్కి పంపాను. దావూద్ తమ్ముడ్ని చంపిన కామాటిపురా అలంజేట్ భయంతో గుజరాత్ పారిపోయేట్టు చేసి, కరీంలాలా వంటి మాఫియా కింగ్స్ గుండెల్లో నిద్రపోయి ఏ రాజకీయ నాయకుల పలుకుబడికో ఇలా వూరూరు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను" నిట్టూర్చుతూ ఆగేడు. "ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు నీకు చెప్పబోయేది మరో ఎత్తు... ఇటు చూడండి" షర్టు బటన్స్ విప్పాడు. "నేను నా గురించి ఏదో ఘనకార్యం సాధించానని గొప్ప చెప్పుకోవాలని కాదు... మీకో వాస్తవం తెలియపరచాలన్నదే నా ప్రయత్నం..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS