"నీది వడ్డించిన విస్తరి. నాలా కాదు"
"అలా అనొద్దే. నీది స్వయంకృషి" తార అనునయించింది.
ఇలా స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుని గతస్మృతుల్లో తేలారు. ఒకళ్ళ ఇంటికి మరొకరు రాకపోకలు జరిగాయి. సుమకి తార తిరిగి పరిచయం కావటం చాలా బాగుంది. బాల్య స్నేహం అంటే అపురూపమైంది సుమకి... ఎవరికైనా కూడా...
హఠాత్తుగా ఓ రోజు తార ఫోన్. ఒకటే ఏడ్చింది. పెద్ద కూతురు శాంతికి జ్వరమొస్తే మెడికల్ రిపోర్టులు తీయించారట. బ్లడ్ కాన్సర్... తట్టుకోవటం తారావల్లేమౌతుంది!
సుమ ఆ సాయంత్రం తార దగ్గరికి వెళ్ళి ఓదార్చింది. కొంత వేదాంతం, కొంత కర్తవ్యం కలిపి హితబోధ చేసింది. శాంతిని చూస్తే జాలేసింది. మనసు కలత పడింది. సంబంధాలు చూసి పెళ్ళి చేద్దామనుకునేంతలో ఇలా... తార దుఃఖం ఆపటం కష్టంగానే ఉంది. శాంతి అందమైన పిల్ల. పెద్ద జడ. అంతా కుచ్చులు కుచ్చులు ఊడిపోతుంటే గుండు చేయించింది తార.
సుమకి ఆ రాత్రి నిద్రలేదు. శాంతి ఊరికే గుర్తొస్తోంది. మూడు నెలలు గడిచాయి. శాంతి క్షీణిస్తోందిట; తార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి.
ఆరోజు ఆదివారం. మధ్యాహ్నం ఎండలో తార, భర్త రెండో కూతురితో హడావుడిగా వచ్చింది.
"సుమా! ఈ పేపర్ మీద సంతకం చేయవే" కాయితాలు చేతికిచ్చింది.
అవి చిట్ ఫండ్ కంపెనీకి ష్యూరిటీ ఇస్తున్నట్లు బాండ్ పేపర్లు. ప్రశ్నార్ధకంగా చూసింది సుమ.
"మూడు లక్షల చిట్... శాంతి ట్రీట్ మెంటుకి డబ్బుకావాలి. ష్యూరిటీ గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలని చిట్ ఫండ్ వాళ్ళు అంటున్నారు."
"కానీ నేను..."
"ఏం మాట్లాడకే. గంపెడాశతో వచ్చా. పిల్ల చావు బతుకుల్లో ఉంది. ఈ డబ్బుతో దానికి ట్రీట్ మెంట్ చేయించాలి" చేతులు పట్టుకొని ఏడ్చేసింది తార.
"బిజినెస్ లో డిపాజిట్స్ ఫిక్స్ డ్ లో ఉన్నై. రెండు నెలల్లో అన్నీ క్లియర్ అవుతాయి. చేయండి ప్లీజ్" తార భర్త ప్రాధేయపడ్డాడు.
సుమ వణుకుతున్న హృదయంతో సంతకం చేసింది. ఆ కుటుంబం థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి శాంతి మరణించిందని తెల్సి తారని పరామర్శ చేయటానికి తారని కలిసింది సుమ. కొంతసేపు గడిచాక...
"చిట్ కడ్తున్నావా" అడిగింది సుమ మెల్లగా.
"రెండు నెలల డ్యూ ఉంది. కట్టేస్తాను" అంది ముభావంగా తార.
మరో ఆర్నెల్లకి ఈ నోటీస్. ఇప్పుడేం చేయాలి. తార ఇల్లు తెలీదు. ఫోన్ నెంబరు లేదు. ఈ రెండున్నర లక్షలు తనెక్కడ్నుంచి తేగలదు.
తెల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ సహాయంతో వాకబు చేసింది సుమ.
తార ఎందరినో ఇలా ముంచిందనీ, ఆమె భర్త పచ్చి మోసగాడనీ... రెండు నెలలకో ఇల్లు మారుతుంటారనీ... ఒక్కొక్కటీ ఒక్కొక్క పిడుగులా సుమ హృదయాన్ని అశాంతికి గురిచేశాయి. ఎంతో ప్రయాసతో తార అడ్రస్ సంపాదించింది సుమ.
ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళింది. బతిమాలి అయినా కట్టిద్దామని.
వాకిట్లోనే పనిపిల్ల లంఖిణిలా నిల్చుంది. "అమ్మగారు లేరు. రెండు నెలలు ఊరెళ్ళారు" చల్లగా చెప్పింది.
లోపల కిటికీ కర్టెన్ చాటునించి తొంగి చూస్తున్న కళ్ళు తారవి కావని సుమ ఎలా అనుకోగలదు. అలాగని తోసుకుని ఇంట్లోకి ఎలా వెళ్ళగలదు.
ఎందుకింత వంచన. తనేం పాపం చేసింది. స్నేహితురాలని కష్టంలో ఆదుకుంటే ఇంత మోసమా!
అసలు మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించింది ఇందుకేనా. సుమ దిండు కన్నీటితో తడిసిపోయింది. రెండున్నర లక్షలు తనలాంటి చిన్న ఉద్యోగికి ఎంత కష్టం. పిల్లలు ఏది అడిగినా డబ్బుల్లేవని, ఆఖరికి తన ఆరోగ్యం బాగా లేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చవుతాయని, ఆటో ఎక్కితే ఖర్చని బస్సుల్లో వేళ్ళాడుతూ, అమ్మా నాన్నలకి కొంచెం కూడా సాయం చేయలేక పోతున్నందుకు బాధపడుతూ... చివరికి ఇంత మొత్తం ఇలా ఇరుక్కుపోవటం హృదయాన్ని కోసేస్తోంది.
మోసం వల్ల డబ్బు నష్టం కలగటం సరే! స్నేహంలో మోసపోయాననే భావం సుమని నిలువెల్లా దహిస్తోంది. జీవితంలో ఇంక ఎవరిని నమ్మాలి. స్నేహం శాశ్వతం అంటారు... మధురమైంది అంటారు. అది నిజమైనదైతే! కానీ ఎలా తెలుస్తుంది. తార ఇందరిని మోసగించి డబ్బు సంపాదిస్తుంది కానీ... మళ్ళీ ఆ నిర్మలమైన స్నేహాన్ని పొందగలదా!
కాలింగ్ బెల్ మోగింది. శ్రీధర్ వచ్చాడు. 'ఏమయింది' సుమ మొహం చూసి అడిగాడు. కోర్టు నోటీసు చూపింది సుమ గిల్టీగా.
"సర్లే ఏం చేస్తాం. బాధపడకు. నాకెందుకో ఆవిడ పటాటోపం చూసి అప్పుడే అనుమానం వేసింది. నీ స్నేహితురాలు కదా! నీకు తెలీదా అనుకున్నా. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం.." అనునయించాడు శ్రీధర్. సుమ మనసు కుదుటపడినట్లు లేదు.
"ఏమిటిది సుమా! చిన్న పిల్లలా" శ్రీధర్ సుమను దగ్గరకు తీసుకున్నాడు.
"కాదండీ! నేను దాన్ని చిన్నప్పటినుంచీ ఎంతో ప్రేమించాను. అది అడిగితే చేతయినంత సాయం చేసేదాన్ని.... ఇలా."
"కొందరంతే సుమా! నీకు ఇంకా లోకం అర్ధం కాలేదు. వాళ్ళకి డబ్బే అన్నీ..." శ్రీధర్ ఓదార్చాడు. అయినా సుమ సమాధాన పడలేక పోయింది.
చిన్ననాటి నేస్తం గురించి మనసులో దాచుకున్న స్మృతి ఫలకం ముక్కలై పోయిందనే భావం ఆమెను నిలవనీయటం లేదు. స్నేహానికి ఖరీదు కట్టిన తార మాత్రం విలాసంగా విదేశీ కారులో ఎవరితోనో నవ్వుతూ ప్రయాణిస్తోంది. ఆ బుగ్గ మీది సొట్ట అందమైన తాచులా ఈసారి ఎవర్ని కాటు వేస్తుందో మరి!
* * *
