Previous Page
అమ్మా... నన్ను క్షమించొద్దు పేజి 33


                              'సహ'గమనం

"కంగ్రాచ్యులేషన్స్" వనమాల శశాంక చేతిని గట్టిగా ఊపి అభినందనలు చెప్పింది.
వనమాల స్పర్శకు శశాంక ఉక్కిరి బిక్కిరయ్యాడు.
"ఈ అవార్డు మీకు ఇంత యంగ్ ఏజ్ లో రావటం నిజంగా అదృష్టం" ఆమె మళ్ళీ అభినందించింది.
చాలామంది శశాంక కేసి జెలసీగా చూశారు. ఆ లాబ్ లో పనిచేస్తున్న ఆడవాళ్ళందర్లోకీ గర్విష్టీ, అందగత్తె అని పేరుబడ్డ వనమాల ఇలా రెండుసార్లు షేక్ హాండ్ ఇవ్వటమంటే మాటలా!
ఆ రీసెర్చ్ లాబ్ లో ఎన్నేళ్ళుగానో మానవ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న వాళ్ళెంతమందో ఉన్నారు. చిన్న చిన్న విజయాలు సాధించినవాళ్ళూ ఉన్నారు. కానీ శశాంకలా ఇలా అనూహ్యమైన అద్భుత విజయాన్ని సాధించిన వాళ్ళు లేరు. 'యురేకా' అని అరవక పోయినా శశాంక కీర్తి దేశమంతా మారుమోగిపోతున్నది. శశాంక ఫైండింగ్స్ కి మానవ జన్యు శాస్త్రజ్ఞులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యవ్వనాన్ని కాపాడే జన్యువును గుర్తించటం అతనికే థ్రిల్లింగ్ గా ఉంది. అంతర్జాతీయంగా అందరినీ ఆకర్షించిన ఆ ఫైండింగే జాతీయస్థాయిలో అందరు శాస్త్రజ్ఞులు పోటీపడే ఆ అవార్డును శశాంకకు సాధించిపెట్టింది.
కారు పార్కు చేసి హుషారుగా ఈల వేస్తూ ఇంట్లోకి వస్తున్న శశాంక అడుగుల చప్పుడు వింటూనే టేబుల్ మీది కాయితాలన్నీ గబగబా ఫైల్ చేసి ఫైలును అల్మారాలో పడేసింది దివ్య. శశాంక మొహంలో ప్రపంచంలోని ఆనందాన్నంతా అనుభవిస్తున్న ఫీలింగ్ కన్పించింది.
గబగబా ఎదురెళ్ళి శశాంక బుగ్గపై గట్టిగా ఓ ముద్దుచ్చింది దివ్య. "కంగ్రాట్స్ డియర్" అంది.
ఎంతో సంతోషపడితే తప్ప దివ్య తనంత తానుగా ఈ గిఫ్ట్ ఇవ్వదని శశాంకకి తెల్సు.
"మీరు ఫోన్ లో చెప్పినప్పట్నుంచీ మీ కోసం ఎదురుచూస్తున్నాను" ఉత్సాహంగా చెప్పింది.
"పిల్లలు నిద్రపోయారు" డ్రెస్ మార్చుకుంటున్న అతని చూపుల అర్ధం తెల్సి చెప్పింది. దివ్యకి దగ్గరిగా వచ్చాడు శశాంక. ఆమె భుజం చుట్టూ చేయివేస్తూ "దివ్యా! ఇదంతా నీ ప్రోత్సాహమే కదా!" భర్త చేతిని సున్నితంగా తప్పించింది దివ్య.
"చాల్లే! రండి... వడ్డిస్తాను. నేనూ తిన్లేదు... అయినా నాదేముంది మీ కృషి... పట్టుదల" వంటింట్లోకి నడిచింది.
"నేనెంత కష్టపడ్డా... నువ్వు ఇంటినీ పిల్లల్నీ చూసుకుంటేనే కదా!" డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.
"పోన్లెండి! నాక్కావలసింది మీకు పేరు ప్రతిష్టలు రావటం" మురిపెంగా అతనికేసి చూసింది. "వచ్చే పదిహేనో తారీకే అవార్డు ఫంక్షన్... ఢిల్లీలో... నువ్వూ రావాలి".
"నేనా, పదిహేను అంటే పెద్దాడికి ఎగ్జామ్జ్".. కాలెండర్ చూసి పెరుగు వడ్డించింది.
"అయినా సరే! నువ్వు రాకపోతే నేనూ వెళ్ళను" చిన్న పిల్లాడిలా మారాం చేశాడు.
"సరే!" అంటున్న ఆమె మనసు నిండా సముద్రం అంతటి అనురాగం!
రాత్రి పొద్దు పోయేదాకా నిద్ర ముంచుకొస్తున్నా బలవంతంగా రిఫరెన్స్ బుక్ చదువుతూ ఇక నిద్ర ఆపుకోలేక లేచాడు శశాంక. బద్ధకంగా ఒళ్ళువిరిచి ఆవులించాడు. అప్రయత్నంగా అతని దృష్టి దివ్య ఫైల్ మీద పడింది.
"ఎప్పుడూ ఏదో రాస్తుంటుంది... ఏం రాస్తుంది" ఆలోచిస్తూ చేతిలోకి తీసుకున్నాడు. అక్షరాల వెంట కళ్ళు పరిగెత్తుతున్నాయి. ఇది కలా... నిజమా ఇంత అద్భుతమైన రచన... నిజంగా దివ్య రాసిందా. చక్కటి వాతావరణం... మలిచిన పాత్రల చిత్రీకరణ... ఆసక్తికరమైన సంఘటనలు... సజీవ జీవన చిత్రం... దివ్యలోని ఈ శక్తినీ... ప్రతిభనీ ఇన్నాళ్ళూ తనెందుకు గుర్తించలేదు... తన వర్క్ లో పడి ఆమెను నిర్లక్ష్యం చేశాడా! తన విజయాల కోసం నిరంతరాయంగా ఆమె మెట్లుగా మారిపోయిందా! ఆసాంతం చదివేసినా శశాంక మనసు నిండా దివ్య నవలే! అలిసి నిద్రిస్తున్న భార్య ముంగురులు సర్ది దుప్పటి కప్పాడు సాలోచనగా.
ఢిల్లీలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా శశాంకకి అవార్డు ప్రధానం ఘనంగా జరిగింది. అతడిని ప్రశంసిస్తున్న వారి కళ్ళల్లోని అసూయా రేఖలు చూసి దివ్య గర్వపడింది. తిరిగి వచ్చాక శశాంక కొలీగ్స్ అతనికి సత్కార సభ ఏర్పాటు చేశారు.
"శశాంక వంటి మేధావి మా ఇన్ స్టిట్యూట్ లో పనిచేయటం గర్వకారణం" శశాంక లాబ్ మేనేజర్ పొగడ్తలతో ముంచెత్తాడు.
"ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. ఈ సందర్భంలో ఆమె శ్రీమతి దివ్య! దివ్యగారిని వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను" అంటూ ఆమెను వేదికపైకి రప్పించి ఉచితాసనాన్ని చూపాడు మేనేజర్.
సభలోని వాళ్ళంతా దివ్య పట్ల ఆదరాన్ని చప్పట్లతో ప్రకటించారు. శశాంక మైక్ ముందు గొంతు సవరించుకుంటుంటే అంతా అతని కేసి ఆసక్తిగా చూస్తున్నారు. తను జీవితాన్ని ఎక్కడ ప్రారంభించిందీ, ఎవరెవరి సహకారంతో తనీ స్థాయికి ఎదిగాడో చెప్తున్న శశాంక స్వరం క్రమేపీ ఉద్వేగభరితమైంది.
"చివరిగా అతి ముఖ్యమైన ఒక్క మాట. స్త్రీ స్థానం పురుషుడి విజయం వెనుక కాదు. అతని విజయం ఆమె పక్కనే ఉంటుంది. నా శ్రీమతి దివ్య నాతో ఇన్నేళ్ళుగా సహగామినిగా ఉండబట్టే నేనీ ప్రోత్సాహం పొందాను. ఈ అవార్డు సాధించాను. అతని స్వరం ప్రశాంత గంభీర మందాకినిలా సాగింది.
"ఆమె గొప్ప రచయిత్రి అని నిన్ననే నాకు తెలిసింది. తన ప్రతిభను గోప్యంగా దాచి నా ఎదుగుదలకే ప్రాధాన్యత ఇచ్చిన నా భార్య శక్తి సామర్ధ్యాలను ఆలస్యంగానైనా తెలుసుకున్నందుకు ఆనందిస్తున్నాను" ఉద్వేగంగా చెప్తున్నాడు.
భర్తకి తన రహస్యం తెలిసింది. అతని ప్రశంసలకు దివ్య మనసు పులకరించింది. ఈ అనుభవం ఆమెకి కొత్తగా ఉంది.
శశాంక మాట్లాడుతున్నాడు.
"నా అవార్డుకు సహ భాగస్వామిని దివ్య కూడా! భార్యాభర్తల పరస్పర విజయ కారకులుగానీ, ఒకరి త్యాగంతో మరొకర్ని వెలిగించే దీపాలు కారు. శ్రీమతి దివ్య సృజనాత్మక ప్రతిభకు అద్దంపట్టిన ఈ నవల "సహ గమనాన్ని" ఈ ఆనంద సమయంలో మీ అందరి హృదయాల్లోకి ఆవిష్కరిస్తున్నాను".
అంటూ గులాబీలతో అలంకరించిన ట్రేలో అందమైన ముఖచిత్రంతో ముద్రించబడిన దివ్య తొలి నవల 'సహ గమనం' ప్రతిని ఆమెకి అందించాడు శశాంక. సంభ్రమాశ్చర్యాలతో అతనికేసి చూసిన ఆమె కళ్ళల్లో నిజమైన సంతృప్తి, ఆనందం కన్పించాయి శశాంకకు. ఆడిటోరియంలో అంతా లేచి నిలబడి ఈ అపూర్వ సందర్భానికి చప్పట్లతో ఆమోదపు జల్లు కురిపించారు.
                                                                                   (ఈటా ప్రత్యేక సంచిక, సెప్టెంబరు 2003)

                                                   * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS