Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 31


    అవంతి తిరగడం మానేసి రొప్పుతూ కాట్ పైన కూర్చుంది.


    నుదుట చిరుచెమటని పవిట చెరగుతో అద్దుకుంటూ.....


    "ప్లీజ్ మంచినీళ్ళు" అంది.


    "ఎవరు గెంతమన్నారు. నిన్నగాక మొన్న అంత హడావుడి జరిగింది" అంది కూడా దగ్గరగా వెళుతూ రమణి.


    "ఏమోనే అలా జరగడం చేతనేమో ఇప్పుడు నా జీవితం నేననుకొన్న నిర్ణీత గమ్యాన్ని చేరబోతోంది." అంది రమణి.


    రమణి నొసలు చిట్లించి చూసింది.


    "ఏమిటే ఆ వాగుడు?" అంది నీళ్ళగ్లాసుని అవంతికి అందిస్తూ


    అవంతి గ్లాసు ఎత్తి నీళ్ళను తాగుతుంటే ఆమె కంఠంకేసి చూస్తూ నిలబడిపోయింది రమణి.


    అవంతి ఫెయిర్ కాంప్లెక్షన్ కాకపోయినా చూడ్డానికెంతముచ్చటగా వుంటుందో అనుకొంది రమణి ఆ క్షణంలో. గొంతులోంచి నీరు జారుతోంటే ఆమె కంఠం కదలికని చూసి అన్నది రమణి.


    "నిన్ను చూస్తే ఏ చిత్రకారుడికైనా బోలెడంత పని పడుతుంది."

    
    "అదేం?"


    "అదంతే! నీలోని ప్రతి కదలికా నాకు ఓ శిల్పాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతోందే" అంది రమణి.


    అవంతి చిలిపిగా నవ్వింది.


    "థాంక్యూ" అంది.


    "అసలు విషయం చెప్పు మరి?"


    "ఇంత కాలంగానూ మా నాన్న కోరికని తీర్చగలనా లేదా అనుకొనే దాన్ని. నా భవిష్యత్తు ఏమవుతుందోనన్న కలవరం నన్ను పిచ్చిదాన్ని చేసేది. కాని నాకిప్పుడా భయం లేదే! నన్నో వ్యక్తిగా తీర్చి దిద్దుతానని మనోహర్ మాటిచ్చాడు" అంది అవంతి.


    రమణి అవంతి  కేసి చిత్రంగా చూసింది.


    "పెళ్లి చేసుకొంటానన్నాడా?"


    ఆమె మాటలకి అవంతి కోపంగా చూసింది.


    "పాడుపిల్లా! ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీకు తెలీదా పెళ్ళి నాకు బద్ద శత్రువని. నీకు తెలీదా తాళిబొట్టుకి వ్యతిరేకినని. ఇంకెప్పుడూ 'పెళ్ళి' అనే మాటెత్తి జోక్ చేయకు రమణి. నేను తిరుగుబాటు ధోరణిలో నడిచే ఆడదాన్ని. నేను నడవబోయే దారిలో నాకెన్నో ముళ్ళకంపలు ఎదురవుతాయని తెలుసు. అందుకు భయపడను. అవి గుచ్చుకుంటాయని బాధపడను. నా దారిలో అడ్డంగా నిలిచే ఆ కంపల్ని ఏరి అవతల పడేసి నా దారిని బాగు చేసుకోవాలనే తపన నాలో జీర్ణించుకుని పోయింది. మనం 'ఒకటి' అనుకున్నాం కనుక సాహసించే గుణం మీలో ఉంటే నాకు సహకరించండి" అంది అవంతి.


    "సారీ, ఏదో తమాషాకి అన్నాను"


    "తప్పే. వెల్లువలా సమాజంపైనా మగజాతిపైనా దూకాలనుకొనే మన ఆశయాన్ని ఇలాంటి తమాషా మాటలతో కించపరచుకోవడం మంచిది కాదు. మనం తీసుకొంటున్న ఈ నిర్ణయం వల్ల ఒక్కసారిగా ప్రపంచం మారిపోతోందని నేననడం లేదు.


    నన్ను చూసి మరొక్క ఆడది, ఆ ఆడదాన్ని చూసి మరో ఆడది ఇలా క్రమంగా మారితే..... అప్పుడే ఇదో ఉద్యమంగా కొనసాగుతుంది. ముందులా మనని చిన్న చూపు చూడొచ్చు. ఆ చిన్న చూపుకి సిగ్గుపడకూడదు." మన ఆశయాల పట్టు సడలకూడదు.


    "యు ఆర్ కరెక్ట్." అంది రమణి.


    "తీగ అల్లుకోడానికో అసరా కావాలి. ముందు మనకాళ్ళపైన నిలబడ్డానికి మార్గం చూసుకోవాలి. ఒకరి మీద ఆధారపడాలని అంతర్లీనంగా వుండే గుబులు మనలో వుండకూడదు. పూర్వం రాజులు యుద్ధం చేసేవాళ్ళు రాజ్యాలకోసం. యుద్ధంలో ఏనుగులు, కత్తులు, సిపాయిలు వుండేవారు. తర్వాత ఫిరంగులు, తుపాకులు, వచ్చినాయి. ఇప్పుడు కేవలం ఈ తుపాకులు, కత్తులకంటే కూడా శక్తివంతమైంది బాలెట్. ఆ బాలెట్ శక్తి ఎలాంటిదో మనం కళ్ళతో చూశాం ఢిల్లీ ప్రభుత్వాన్ని దించేసి పాత ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. మనిషి తల్చుకొంటే సాధించలేనిది లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?


    అందుకే నేనంటాను.


    కులనిర్మూలన జరగాలి.


    ఆడా మగా వ్యత్యాసం పోవాలి.


    వరకట్న పిశాచం అంతరించాలి.


    ఆడదానికో ప్రత్యేకత రావాలి. నేను చివరిసారిగా ఊపిరి వదిలే వరకూ దానికోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఆడదానికి "మొగుడు కావాలా?" అని ఛాలెంజ్ చేస్తాను. అందుకోసమే నేను బతుకుతాను"


    "నువ్వు అనుకొన్నది సాధించాలనే నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అవంతీ, ఆడదానికి జరుగుతోన్న అన్యాయాలకి వారధి కట్టడానికి శక్తి విజృంభిస్తోన్న నీకు ప్రతి ఆడదీ తన ఆయుష్షులోంచి  కొంత నీకుపోస్తుంది నూరేళ్ళూ వర్థిల్లు!" అంది రమణి.


    అవంతి తృప్తిగా చూసింది.


    "ఇప్పుడు చెప్పు, నీ జీవితం నువ్వనుకున్న నిర్ణీత గమ్యాన్ని చేరుకోబోతోందన్నావు. సంగతి చెప్పు."


    "నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ పెట్టుకోడానికి కావలసిన ఏర్పాట్లు మనోహర్ చేస్తానన్నాడు. అతను చెబితే కానీ నా బుర్రకి తట్టలేదు అందుకోసం బోలెడు డబ్బు కావాలి"


    "ఈజిట్" అంది ఆశ్చర్యంగా రమణి.


    "అవునే. అనుకొంటారే కానీ మనోహర్ మరీ అంత దుర్మార్గుడు కాడు. కలవారి బిడ్డ కావడంచేత విలాసాల మోజుల్లో తేలిపోతున్నాడు తప్ప అతనికి కొన్ని సెంటిమెంట్లున్నాయి. మంచి మనసుంది. అతను నాకా సాయం చేస్తే చాలు నా తడాఖా చూపిస్తాను" అంది అవంతి.


    "ఐ విష్ యు ఆల్ సక్సెస్"


    "థాంక్యూ సోమచ్ డియర్" అంటూ అవంతి రమణి బుగ్గపైన ముద్దు పెట్టుకుంది.


    "మన వాళ్ళింకా రాలేదే?" అంది రమణి.


    "ఎవరు? కుసుమ, శ్యామల గురించేనా?"


    "అవును."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS