Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 31


    మౌనిక అతనికోసమే కంగారుగా చూస్తోంది.

 

    "వచ్చారా?"

 

    "ఎందుకు రాననుకున్నావ్?"

 

    "ఆ దుర్మార్గులు మిమ్మల్ని గుర్తుపట్టారేమోనని."

 

    "వాళ్ళ ముఖం" అన్నాడు తరుణ్.

 

    అతను ఆమె పడుకున్న మంచం మీదనే ఓ పక్కగా కూర్చున్నాడు. పక్కన కూర్చున్నా అతని స్పర్శ తెలుస్తున్నట్టే ఫీలయింది ఆమె.

 

    "నేను ముట్టుకున్నానని ఒళ్ళంతా కాల్చుకోరుగదా" నవ్వుతూ అని అంతలోనే గుర్తొచ్చినట్లు, "మళ్ళీ ఆత్మప్రక్షాళనా కార్యక్రమం ఇకలేదుగా" అన్నాడు.

 

    ఆమె నవ్వి వూరుకుంది.

 

    అతను ఆమె కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుని వెన్న రాయడం మొదలుపెట్టాడు.

 

    జాతర్లో తప్పిపోయిన చిన్నపిల్ల తిరిగి తన అమ్మా వాళ్ళను కలుసుకున్నట్లు ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు వూరాయి. చాలాకాలం తరువాత తను బతికున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. ప్రేమంటే ఇదేనా అని ఓ క్షణంసేపు అనిపించింది.

 

    "ఎందుకనో మీరు నాకు కొత్తగా అనిపించడం లేదు. మీరు నాకు బాగా కావాల్సిన అమ్మాయిలా అనిపిస్తున్నారు" అన్నాడు వెన్న రాస్తూనే.

 

    నాకూ అలాగే వుంది అని అనాలనిపించింది ఆమెకి. కానీ అనలేకపోయింది.

 

    ఇంతకాలం ఆమె తనకు తానే వేసుకున్న సంకెళ్ళు ఆమెను ఫ్రీగా మాట్లాడించడం లేదు.

 

    "వెన్న రాశాను. చల్లగా వుంటుంది. ఇప్పుడు మీకు రెస్ట్ ముఖ్యం. హాయిగా పడుకోండి" అని దుప్పటి తీసి పూర్తిగా కప్పాడు తరుణ్.

 

    అతను మరికాసేపు అలా వెన్న రాస్తూ వుంటే బావుండేదనుకుంది మౌనిక.

 

    "మీరు ఇలా వెన్న రాస్తారని ఊహించివుంటే రెండో చేతిని కూడా కాల్చుకుని వుండేదాన్ని" అంది. ఆ మాటలన్నాక తనకెంత ధైర్యం వచ్చిందీ తలుచుకుని అబ్బురపడింది.

 

    ఆ మాటలు భరించలేనట్లు అతను వెంటనే ఆమె నోరు మూశాడు.

 

    "అలాంటి మాటలనకండి" అన్నాడు.

 

    ఊరికే సరదాగా అన్నట్లు నవ్వింది.

 

    "మీరెళ్ళి పడుకోండి."

 

    అతను లోపలికెళ్ళి పడుకున్నాడు.

 

    "మీరు పడుకున్న ఈ చాపమీద పడుకోవడం కూడా బావుంది. దీన్నేమంటారు?" అని అడిగాడు తరుణ్ కాసేపయ్యాక.

 

    "మీరే చెప్పండి"

 

    "ఇప్పుడు కాదులెండి. సరైన సమయంలో చెబుతాను" అన్నాడు తరుణ్.

 

    ఆమె రెట్టించి అడగలేదు. కళ్ళు మూసుకుంది. తనకు పాముకరిచినప్పటి నుండి ఒక్కో సంఘటననూ తలుచుకుంటోంది.

 

    అతను విషం పీల్చడానికి నోటితో తన పాదాలను స్పృశించిన అనుభూతి ఇప్పుడు మనసుకు తగులుతున్నట్లు ఆమె పెదవులమీద సిగ్గు నవ్వులయి పూస్తోంది. తన సిగ్గును చూసి తనే సిగ్గుపడుతున్నట్లు దుప్పటిని ముఖానికి అడ్డం వేసుకుంది.

 

    మరుసటి రోజు ఉదయం ఆమె లేచేటప్పటికి తరుణ్ తయారై వున్నాడు. ఆమె ముఖం కడుక్కున్న తరువాత మాత్రలిచ్చాడు.

 

    "అప్పుడే తయారైపోయారు ఎక్కడికి?" అని అడిగింది. అతను బయటికి వెళ్లడం సుతరామూ యిష్టంలేదు.

 

    "మీ ట్రీట్ మెంట్ కోసం అందరం అప్పు చేశాం కదా. దాన్ని తీర్చాలి - పూసలు కట్టడం ఈరోజు నుంచీ ప్రారంభించబోతున్నాం"

 

    "నావల్ల మీ అందరికీ కష్టాలు" ఆమె నొచ్చుకుంది.

 

    "ఇష్టమైన వాళ్ళకోసం ఏం చేస్తున్నా కష్టం అనిపించదు" అన్నాడు తరుణ్.

 

    ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా ఆమెకిదంతా నిజమా లేక కలా అనిపిస్తోంది. అలాంటప్పుడు తనకు తానే గిల్లుకుని పరీక్షించుకోవాలనిపించేది. ఈ ధ్యాసలో పడిపోవడం వల్ల ఇవన్నీ మహిళాసదన్ నియమాలకు విరుద్ధమన్న విషయం మరిచిపోతోంది.    

 

    "మీ యిష్టం. కానీ జాగ్రత్త" అంది.

 

    "జాగ్రత్తగానే వుంటాను. ఇంతకుముందు నాకోసమే జాగ్రత్తగా వుండేవాడ్ని. ఇప్పుడు ఇంకొకరికోసం జాగ్రత్తగా వుండాలనిపిస్తోంది."

 

    ఎవరికోసం అని ఆమె అడగలేదు.

 

    అతను చూస్తున్న చూపుల్లోనే తెలుస్తోంది.

 

    మరి దేనికోసం అడగడం?

 

    అమ్మాయిలంతా సభామందిరం నుంచి తిరిగి వస్తుండగా తరుణ్ ఎదురెళ్లాడు.

 

    వాళ్ళు అతన్ని చూసి ఏమీ కంగారుపడలేదు. అతను అక్కడ వుండడం వారికి అలవాటైపోయింది.

 

    "పూసల కోసం వెళుతున్నారు - మాట నిలుపుకోవాలి మనం. అప్పు తీర్చడానికి మీరు ఓకే కదా?" అని అడిగాడు అందరివంకా చూస్తూ.

 

    "మేం రెడీ" కొందరు తలలు మాత్రమే ఆడించి వూరుకుంటే మిగిలినవాళ్ళు మాత్రం పైకే చెప్పారు.

 

    "నేనిప్పుడు వెళుతున్నది అక్కడికే" అని ముందుకు నడవబోయాడు.

 

    "ఇలా వెళుతున్నారా? వద్దు -డేంజర్" అంది శృతి అతని ఎదురుగా వెళ్ళి నిలబడి.

 

    అతను తనవంక తనే చూసుకున్నాడు.

 

    "ఇలా వెళ్ళకండి - ఒకవేళ వాళ్ళు ఎదురుపడ్డా గుర్తు పట్టకుండా వెళ్ళాలి" అన్నది.

 

    అతను ఏం ఫరవాలేదని అన్నా వాళ్ళు వినలేదు. ఇక తప్పదనుకుని వెళ్ళాడు.

 

    "ఏమిటి మళ్ళీ వచ్చారు? వెళ్ళలేదా?" అని అడిగింది మౌనిక ఆశ్చర్యంగా.

 

    "మారువేషంలో వెళ్ళమంటున్నారు మన మిత్రురాళ్ళు అన్నాడు తరుణ్.

 

    "ఏ వేషంలో వెళతారేమిటి?"

 

    జైనమతస్తుడిలాగా."

 

    అదేం వేషమో తెలియనట్టు ఆమె వుండిపోయింది.

 

    "మీ దగ్గర తెల్లటి వస్త్రాలేమైనా వున్నాయా?

 

    బలవంతంగా మంచం మీద నుంచి లేవబోయింది. అతను వారించాడు. "ఎక్కడున్నాయో చెబితే నేను తీసుకుంటాను అన్నాడు.

 

    "లోపల నా సూట్ కేస్ లో."

 

    అతను లోపలికెళ్ళి పదినిముషాల్లో తిరిగి బయటకు వచ్చాడు. అతన్ని ఆ వేషంలో చూసి ఆమే గుర్తుపట్టలేక పోయింది. మొలకు మాత్రం తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. మరో వస్త్రాన్ని ఛాతీ నిండుగా కప్పుకున్నాడు. నోటికి ముక్కు నుంచి జారినట్టు తెల్లటి గుడ్డ కట్టుకున్నాడు.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS