Previous Page Next Page 
ఆలింగనం పేజి 32


    "సీ యూ అన్నందుకు నేను చెప్తున్నాను"

 

    నేను ఈసారి మనస్ఫూర్తిగా నవ్వాను.

 

    "బై!" చెయ్యి ఊపి అతను రివర్స్ చేసుకుని వెళ్ళిపోయేదాకా ఆగి లోపలికి వచ్చాను.

 

    ఎందుకో ఆనందంగా అనిపించింది.

 

    అంత గొప్పవాడు నన్ను మళ్ళీ చూడాలనుకోవడం ఇచ్చిన థ్రిల్ వల్లనేమో!

 

    సందీప్ నాకు దూరం అయ్యాకా, ఆ రోజు మొదటిసారిగా విషాదంగా కాక ఆనందంగా గడిపాను.


                                                          *  *  *


    చాలా రోజులకి అద్దంలో పరీక్షగా చూసుకున్నాను. మునుపటి కంటే చిక్కినా అందంగానే ఉన్నాను.

 

    "ఆదివారం అయినా నాన్న త్వరగానే లేచారే" అనుకుని వెంటనే ఇంక రోజూ ఆదివారమేగా అని గుర్తు చేసుకున్నాను. చిన్నక్క చెప్పినట్లు బుద్ధిగా పడక కుర్చీలో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నారు.

 

    అమ్మ హడావుడిగా వంటింట్లో ఏదో చెప్తోంది.

 

    "ఎందుకమ్మా ఈ రోజు ఈ స్పెషల్స్?" చిన్నక్క విసుక్కుంటోంది.

 

    "ఆ మాధవ్ వాళ్ళమ్మగారినీ, చెల్లెల్నీ తీసుకుని వస్తానన్నాడుగా!" అంది.


    
    చిన్నక్క ఏం మాట్లాడకుండా అమ్మకి వంటలో సహాయం చెయ్యసాగింది.

 

    పెద్దక్క పిల్లలు అల్లరి చేస్తుంటే తిడ్తోంది.

 

    "తిట్టకమ్మా చిన్నప్పుడు అందరూ అల్లరిచేస్తారు" అన్నారు నాన్న.

 

    "విసిగించేస్తున్నారు నాన్నా! ఎన్ని కొన్నా మళ్ళీ ఇంకా ఏదో కావాలని పేచీలు. పక్కవాళ్ళ పిల్లలు ఆడుకునేలాంటి 'బిజినెస్ గేమ్' కావాలిట. ఏది చూస్తే అది కావాలంటారు. మాయదారి పిల్లలు అంది.

 

    "నువ్వు ఇప్పటికి అలాంటి పేచీలే పెడుతున్నావుగా?" మనసులో అనుకున్నాను.

 

    చిన్నక్క వంటింట్లోంచే "నేను కొనిపెడ్తానర్రా... ఏడవకండి!" అని అరిచింది.

 

    "ఇదొక్కత్తి పాతాళ భైరవిలా!" అనుకున్నాను.

 

    "అలా చూస్తూ కూర్చోకపోతే వచ్చి సహాయం చెయ్యొచ్చుగా" అంది నన్ను చిన్నక్క.

 

    నేను వెళ్ళి గారెలు వేయించే పని అందుకున్నాను.

 

    తలంటు పోసుకున్న జుట్టు చివర్ల ముడివేసి, నల్లని బెంగాలీ కాటన్ శారీలో చిన్నక్క చాలా ముచ్చటగా ఉంది.

 

    గేటు చప్పుడైంది.

 

    "ముక్తా... ఎవరో వచ్చినట్లున్నారు చూడు!" అంది కూరతరుగుతూ అమ్మ.

 

    నేను అట్లకాడ పట్టుకుని బైటికి వెళ్ళాను.

 

    ఒక్క క్షణం నా గుండె లయ తప్పింది!

 

    "సిద్దార్థ!"

 

    "మీరా?" ప్రశ్నార్థకంగా చూసాను.

 

    "కొంపదీసి వాత పెట్టడానికి సిద్ధంగా లేరు కదా!" అతను సమ్మోహనమైన నవ్వు నవ్వాడు.

 

    "అదికాదు...రండి...రండి" అన్నానే కానీ ఎంతో ఉక్కిరిబిక్కిరిగా ఫీలయ్యాను.

 

    "అంత కంగారుపడకండి...రాత్రి మీరు మీ పర్సు నాకార్లో మర్చిపోయారు. ఇవ్వడానికి వచ్చాను. అంతే" అన్నాడు నల్లని పర్సు అందిస్తూ.

 

    నా గుండె కాస్త కుదుటపడింది.

 

    అది అందుకుంటూ "అరె...ఇప్పటిదాకా చూసుకొనేలేదు" అన్నాను.

 

    "అలా అన్నీ పారేసుకుంటే ఎలా? నాలా బుద్ధిగా ఎవరు తెచ్చి ఇస్తారూ?" కొంటెగా అన్నాడు.

 

    "ముక్తా...ముక్తా" చిన్నక్క పిలుపు వినిపించింది.

 

    "లోపలికి రండి" అన్నాను.

 

    "వచ్చినపని అయిపోయింది. ఇంకా ఎందుకు?"

 

    నేను ఆ కళ్ళల్లో తీక్షణత భరించలేక మౌనంగా తల వంచుకొన్నాను.

 

    "నిన్నటి అలంకరణలో కంటే ఈ రోజు ఎక్కువ అందంగా ఉన్నారు" అన్నాడు.

 

    నేను కలవరంగా చూసాను.

 

    "యూ ఆర్ బ్యూటిఫుల్!" అన్నాడు.

 

    ఇంతలో పెద్దక్క "ఎవరే వచ్చిందీ?" అంటూ పానకంలో పుడకలా వచ్చేసింది.

 

    "నే వస్తా" అతను కదిలాడు.

 

    "ఒక్క నిమిషం..." అన్నాను.

 

    అతను ఆగి చెప్పమన్నట్లుగా చూసాడు.

 

    "థాంక్స్!" అన్నాను.

 

    అతను నవ్వి "చిత్ర సాయంత్రం వీడియో కేసెట్ చూడడానికి తీసుకురమ్మంది. వస్తానంటే అయిదు గంటలకి వచ్చి పికప్ చేసుకుంటాను" అన్నాడు.

 

    నాకు ఆ సంకేతం అర్థం అయ్యాక కూడా అవనట్లుగా ఉండే నటన నాకు రాదు!

 

    "కుదరదు" అన్నాను.

 

    "ప్రయత్నించండి. ఆ కనిపించే బస్ స్టాప్ లో ఉంటాను. బై!" నెమ్మదిగా అని వెళ్ళిపోయాడు.

 

    "ఏవంటాడే? ఎవరసలూ?"

 

    ఆరాగా అడుగుతూ వచ్చింది పెద్దక్క.

 

    "చిత్ర అన్నయ్య" అని లోపలికి నడిచాను.నా మనసంతా అలజడిగా, బాణలిలో గారె వెయ్యగానే పొంగుతున్న నూనెలా కల్లోలంగా ఉంది! 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS