"ఇవన్నీ నాకే ఎందుకు అవుతాయి?" అనుకున్నాను. సమాధానం తెలిసి గర్వంగా అనిపించింది!
మాధవ్ వాళ్ళూ వచ్చేశారు.
చిన్నక్క ఎంత చెప్పినా చీర మార్చుకోలేదు. రేగిన తలతో, నలిగిన చీరలో ఉంది.
మాధవ్ వాళ్ళ అమ్మ చాలా కలివిడిగా మాట్లాడింది. వాళ్ళ చెల్లెలు నా ఈడుదే. నాలాగే డిగ్రీ చేస్తోంది. పేరు వసంత. నల్లగా వున్నా మొహం కళగా వుంది. నాతో చనువుగా మాటలు కలిపేసింది.
మాధవ్ నాన్నతో చాలా వినయంగా మాట్లాడ్తున్నాడు. అతను కూర్చున్న తీరూ అదీ బోధిచెట్టు క్రింద కూర్చున్న బుద్ధుడ్ని తలపిస్తోంది. "బుద్దూ" అని ముద్దుగా నా మనసులో నామకరణం చేసేశాను.
నేను కాఫీ ఇవ్వడానికి వెళితే నన్ను పలకరించి "ఏమ్మా...ఏం చదువుతున్నావు?" అన్నాడు.
ఆ వయసు యువకుడు "అమ్మా" అనడం నాకు వింతగా తోచింది. నా చదువు వివరాలు చెప్పాను. కెమిస్ట్రీలో కొన్ని క్వచ్చిన్స్ వేశాడు. నేను జవాబులు చెపుతూనే చిరాకుపడ్డాను. 'హలో! నువ్వొచ్చింది మా అక్కని చూడ్డానికి, నన్ను కాదు!" అందామనిపించింది.
భోజనాలప్పుడు అమ్మ "వంట అంతా మా కాళిందే చేసింది వదినగారూ! ఎంత చదివినా ఆడపిల్లలకి పనీపాటా రావాలి కదా! అన్నీ నేర్చుకుంది అంది.
చిన్నక్క చిరాకుపడుతూ చూసింది.
మాధవ్ తల్లి "అమ్మాయిని చూస్తేనే తెలుస్తోంది పనివంతురాలనీ" అని మెచ్చుకుంది.
మాధవ్ పెరిగిన ఉల్లిపాయలు, ఉల్లిగడ్డల ధరల గురించి అనర్గళంగా నాన్నతో మాట్లాడ్తున్నాడు.
"అస్సలు రొమేంటిక్ సెన్స్ లేని ఇతనితో పెళ్ళయితే చిన్నక్క ఎలా వేగుతుందో!" అనిపించింది.
చిన్నక్క నెయ్యి వడ్డించబోతే "వద్దమ్మా!" అన్నాడు.
నేను కిసుక్కుమని నవ్వాను. అతను నావేపు తల తిప్పి చూశాడు. నేను తల వంచుకుని నవ్వు ఆపుకోవడానికి నానా తంటాలు పడ్డాను.
భోజనాలయ్యాక చిన్నక్కతో ఆమె జీతం వివరాలు మాట్లాడాడు. తన జీతం, ఎలవెన్సులూ, ఫారెన్ ఛాన్సెసూ గురించి వివరించాడు.
కొద్దిగా దూరంలో కూర్చుని వసంతతో మాట్లాడుతూనే నేను ఓ చెవివేసి వాళ్ళ సంభాషణ వింటున్నాను.
కాళింది తన బాధ్యతల గురించి చెపుతూంటే, అతను అడ్డుపడుతూ తన చెల్లెలి చదువూ, పెళ్ళిగురించి మాట్లాడుతున్నాడు. షష్టిపూర్తి దంపతులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది కానీ పెళ్ళికానీ అమ్మాయీ, అబ్బాయీ కబుర్లాడుకుంటున్నట్లుగా లేదు!
ఆ సమయంలో నాకు సిద్ధార్థ గుర్తుకొచ్చాడు. ఎంత రొమేంటిక్ గా మాట్లాడాడు.
'మగాడికి ఆడపిల్లల కన్నా నిషానిచ్చే వస్తువేలేదుట!" నవ్వొచ్చింది. ఐదింటికి రమ్మన్నాడు. వెళ్ళడమా మానడమా? వైజూకి తెలిస్తే ఏమంటుందో?
'మనసు ఒకేసారి స్పందిస్తుంది...ఒకే వ్యక్తిని ప్రేమిస్తాము' అంటూ ఏదేదో చెప్పింది. మరి నేను సందీప్ ని చూసి స్పందించానుగా! ప్రేమించాను కూడా!
మళ్ళీ ఇతడు గుర్తురావడం...చూడాలనిపించడం యిదంతా ఏమిటి? మళ్ళీ ప్రేమేనా? నాకంతా అయోమయంగా గజిబిజిగా ఉంది.
అయిదు కావొస్తుండగా మాధవ్ వాళ్ళు మమ్మల్నందర్నీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఆటోలో వెళ్ళిపోయారు.
నేను మొహం కడుక్కుని జడేసుకొచ్చాను. నాకు ఇష్టమైన స్నఫ్ కలర్ చుడీదార్ వేసుకున్నాను.
"ఎక్కడికే?" అడిగింది పెద్దక్క.
"చిత్రా వాళ్ళింటికి" తడుముకోకుండా చెప్పాను.
* * *
"గ్రీన్ పార్క్" హోటల్ లో నేనూ సిద్ధార్థ ఎదురెదురుగా కూర్చున్నాము.
సిద్దార్థ కళ్ళతోటే తాగేస్తున్నాడు.
నేను ఐస్ క్రీమ్ ని నెమ్మదిగా చప్పరిస్తూ అతని చూపులనుండి తప్పించుకో జూస్తున్నాను.
హఠాత్తుగా కాలిమీద ఏదో పాకినట్లయి ఉలిక్కిపడ్డాను. అతనికాలు నా పాదం మీద పడింది.
కాలి వేళ్ళతో నా పాదాన్ని నెమ్మదిగా రాస్తూ "లవ్ ఎట్ ఫస్ట్ సైట్! అంటే ఇదే ఆముక్త... ఐ లవ్ యూ!" విస్పరింగ్ గా అన్నాడు.
నేను ఎండిపోతున్న నా పెదాలను తడిచేసుకుంటూ, భయంగా చుట్టూ చూశాను. మమ్మల్నెవరూ గమనించడంలేదు! అందరూ తమతమ ధోరణుల్లో ఉన్నారు.
చిత్ర చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నాను.
'ఇద్దరూ మొదటే ఎక్స్ పెక్టేషన్స్ విషయంలో క్లియర్ గా ఉంటే మంచిది!" అంది.
"నీకు నేను నచ్చలేదా? చెప్పు..." అన్నాడు. నేను ఏం చెప్పాలో నిర్ణయించుకోలేకపోయాను. అతను నా చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. అతని ఫాస్ట్ నెస్ కి నాకు భయం వేసింది!
"ఏం మాట్లాడవేం? నీకు నేను నచ్చలేదా?" రెట్టించాడు అతను.
"ఇష్టమే...కానీ..." అంటూ సందిగ్ధంగా ఆగిపోయాను.
ఏం చెప్పడానికీ మా మధ్యన చనువూ, పరిచయం తక్కువ!
"కానీలూ, అర్ధణాలూ వద్దు... ఐ లవ్ యూ అను" అన్నాడతను.
