Previous Page Next Page 
ఆలింగనం పేజి 31


    ఓసారి ప్రేమలో పడి ఫెయిలయితే లోతూ, జ్ఞానం అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి.

 

    గొప్పవాళ్ళ ఫంక్షన్. అదో సందడి. ఎక్కడ చూసినా ఫారెన్ పరిమళాలూ, ఇండియన్ గౌరవ మర్యాదలూ! కేటరర్స్ అందరూ చాలా బిజీగా సర్వ్ చేస్తున్నారు. పెళ్ళి అంత హడావుడి జరుగుతోంది.

 

    చిత్ర బ్యూటిషియన్ తన పనితనం అంతా చూపించి వదిలిపెట్టింది. చిత్ర విద్యుల్లతలా మెరిసిపోతోంది.

 

    "డబ్బుంటే ఆనందం అదే వచ్చేస్తుందనుకుంట!" అన్నాను.

 

    "రాదు! మనసుకి నచ్చిన తోడు ఉండాలి" అంది వైజయంతి.

 

    "ఏ తోడూ లేనినాడు నీ నీడే నీకు తోడు!" అని నవ్వాను.

 

    రఫీ, వెంకట్ పెద్ద పెద్ద పూలదండలు మోసుకుంటూ వచ్చారు. చిత్ర గొడవచేసి మా అందరితో కలిసి ఫోటో తీయించుకుంది.

 

    "నీ చీర చాలా బావుంది!" అంది వైజయంతి.

 

    "చిన్నక్క తెచ్చింది" అన్నాను.

 

    క్రీమ్ కలర్ ప్లైన్ సిల్క్ మీద మిర్రర్ వర్క్, కెంపురంగు అద్దాల జాకెట్టూ. అందరి కళ్ళూ నా అందాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.

 

    "నీకేం బావుంటాయో నీ కంటే మీ చిన్నక్కకే తెలుసనుకుంటాను" అంది.

 

    "నాకే కాదు, మా ఇంట్లో అందరికీ ఏం కావాలో దానికే తెలుసు!" గర్వంగా అన్నాను.

 

    డిన్నర్ అయ్యేటప్పటికి చాలా పొద్దుపోయింది.

 

    వెంకట్, రఫీ ఇద్దరూ ఒకే బండిమీద వచ్చారుట. వెళ్ళిపోయారు.

 

    చిత్ర మాతో "మిమ్మల్ని డ్రాప్ చేసే డ్యూటీ సిద్దార్థకి చెప్పాను... ఎక్కడున్నాడూ? ఆ...మాటలో వచ్చేశాడు. సిద్దూ...ఇట్రా" అని పిలిచింది.

 

    తెల్లని లాల్చీ పైజామాలో బెంగాలీ బాబులా ఉన్న ఒకతను మా దగ్గరికి వచ్చాడు.

 

    "సిద్దూ...నువ్వు వీళ్ళిద్దర్ని వీళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేసి రావాలి. ఇది నా ఆర్డర్!" అంది.

 

    "జీ...మేమ్ సాబ్!" అంటూ ఒంగి నవ్వాడు సిద్దార్థ.

 

    "అన్నట్లు పరిచయాలు చెయ్యలేదుకదూ! వీడు మా పిన్ని కొడుకు. పెద్ద బిజినెస్ మేన్. వీళ్ళిద్దరూ నా ప్రాణ స్నేహితులు వైజయంతీ, ఆముక్త..." అంటూ పరిచయాలు చేసింది.

 

    మేము నమస్కారాలు పెట్టాం.

 

    సిద్దార్థ రెడ్ మారుతీ ఎస్టీమ్ లో బయలుదేరాము.

 

    అతను నిశ్శబ్దంగా డ్రైవ్ చెయ్యసాగాడు.

 

    ఆడపిల్లలు నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించలేరు. వయసులో ఉన్న యువకుడు తమ ఉనికిని పట్టించుకోకపోతే ఇంకా అస్సలు తట్టుకోలేరు!

 

    "మీరే బిజినెస్ చేస్తుంటారూ?" అడిగింది వైజయంతి.

 

    "మాకు వైన్ షాప్స్ ఉన్నాయి" అన్నాడు.

 

    వైన్ షాప్స్ అనగానే చటుక్కున ఉలిక్కిపడి చూశాను నేను.

 

    నా ఉలికిపాటు అతను గమనించినట్లుగా "నిషా ఇచ్చే విషయాలకి భయపడేవాళ్ళు ఆపోజిట్ సెక్స్ కి చాలా దూరంగా ఉండాలి! అసలు నా దృష్టిలో...సృష్టిలో ఆడపిల్లకన్నా మగవాడికి నిషా ఇచ్చే వస్తువు వేరొకటి ఉండదు!" అన్నాడు.

 

    వైజయంతి చిన్నగా నవ్వింది.

 

    నేను నవ్వలేదు. అతన్ని అంచనా వేస్తున్నాను.

 

    "నేను ఎప్పుడూ నిషా ఇచ్చే వాటికి దూరంగా ఉంటాను" అన్నాడు.

 

    "ఆహా!" అన్నాను.

 

    "మాంసం కొట్టువాడు ప్యూర్ వెజిటేరియన్ ని! అన్నట్లుగా ఉందా?" అన్నాడు.

 

    వైజయంతి మళ్ళీ నవ్వింది.

 

    నేను క్రీగంట అతని కుడి చెంపమీద నల్లని పుట్టుమచ్చనీ, స్టీరింగ్ పట్టుకున్న అతని బలమైన, అందమైన చేతుల్నీ చూస్తున్నాను.

 

    వైజయంతి చెప్పిన గుర్తుల ప్రకారం ఆమె ఇంటి దగ్గర దింపాడు.

 

    వైజూ దిగిపోయాకా మేము ఒంటరిగా మిగిలాము.

 

    "మీరు ఏదో పెద్ద విషాదంలో ఉన్నట్లున్నారూ?"

 

    "ఏం?" అన్నాను నేను.

 

    "నవ్వు రాకపోవడం బాధతో వున్నప్పుడే జరుగుతుంది" అన్నాడు.

 

    నాకు ఎందుకో ఒక్కసారిగా అతనితో సందీప్ తో నా ప్రేమా, నేను ఘోరంగా దెబ్బతినడం అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకుని ఏడవాలనిపించింది. ఫూలిష్ ఐడియా! ఒకచోట మోసపోగానే ప్రతి ఆడపిల్లా చేసే పని ఇదేననుకుంట!

 

    "బాధల్ని భాగించుకోవాలి! ఆనందాన్ని హెచ్చవేసుకోవాలి...అయినా ఈ వయసుతో ఇలాంటి బాధలు సహజమే!" అన్నాడు.

 

    "నా బాధ ఏవిటో మీకు తెలుసా?" అడిగాను.

 

    అతను కొద్దిగా నవ్వి "నేను మీ వయసులోంచే వచ్చాను! వేపపండులాంటి తీపి...టీనేజ్ ది! కొంచెం ఎక్కువ చప్పరిస్తే చేదుగా మారుతుంది" అన్నాడు యోగి వేమన టైప్ లో.

 

    "నన్ను ఇక్కడ దింపెయ్యండి... అదే మా ఇల్లు" అన్నాను.

 

    "అరె...అప్పుడే వచ్చేసిందా? ఇంకా దూరంగా ఉంటే బావుండేది" అన్నాడు.

 

    నేను నవ్వాను.

 

    "జన్మ తరించింది. చివరికి నవ్వించగలిగాను. కానీ కారణం మాత్రం బాధాకరమైనది! నాకు వీడ్కోలివ్వడం మీకింత ఆనందాన్నిస్తోందన్నమాట!" అన్నాడు.

 

    "అదేం కాదు...సీయూ...బై" అన్నాను.

 

    "థాంక్యూ" అన్నాడు.

 

    "నేను చెప్పాను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS