సీతాన్వేషణము
వాలికి అంత్యక్రియలను జరిపించిన పిమ్మట మంత్రులు సుగ్రీవుని వానర రాజ్యమునకు అభిషిక్తుని జేసినారు. సుగ్రీవుడు అంగదుని యువరాజుగా నియమించినాడు.
రామలక్ష్మణులు ఋష్యమూకమున గుహలో నివాసమేర్పరుచుకొన్నారు. 'పట్టాభిషేకమును తిలకించుటకు దయచేయుడ'ని సుగ్రీవుని నుండి రామ లక్ష్మణులకు ఆహ్వానము వచ్చినది. కాని రాముడు పోలేదు. అతడు అనుజునితో "లక్ష్మణా! వనవాసకాలము గడువు తీరు వరకునూ నేను ఉత్సవములలో పాల్గొనుటకు పురములకు గాని నగరములకు గాని పోరాదు. కిష్కింధకు నీవు పోయి రమ్ము" అన్నాడు.
లక్ష్మణుడు కిష్కింధ నుండి తిరిగి వచ్చుచూ సుగ్రీవునితో 'మిత్రమా మా అన్నగారి ధ్యాస(అంతయూ) సీతాదేవిపైననే యున్నది. 'జానకి ఎక్కడ ఉన్నదో ఎట్లున్నదో, ఉన్నదో లేదో!' అని యేల్లపుడాయన శోకించుచున్నాడు. సీతాన్వేషణమును శీఘ్రముగ ప్రారంభించవలెను" అన్నాడు. సుగ్రీవుడు 'లక్ష్మణస్వామీ వర్షఋతువు అన్వేషణమునకు అనువైన కాలము కాదు. వానలు ఆగుటతోనే రామ కార్యమును చక్కబెట్టెదను" అన్నాడు.
వానలు తగ్గినవి కాని సుగ్రీవుని జాడ లేదు. రాముడు "లక్ష్మణా సుగ్రీవుడు తన వాగ్దానమును విస్మరించినట్లున్నాడు" అన్నాడు. లక్ష్మణుడు ధనుర్దరుడై కిష్కింధకు పోయి ద్వార రక్షకునితో 'సుగ్రీవునకు నేను వచ్చినట్లు చెప్పుము' అన్నాడు. ద్వారా పాలకుడు 'లక్ష్మణస్వామీ మా ప్రభువు సుగ్రీవుడు ప్రస్తుతము మిమ్ము చూచు స్థితిలో లేడు. రాచకార్యములను మంత్రుల కప్పగించి మధువును సేవించుచూ అంతఃపుర నారీ జనము నడుమ భోగలాలసుడై యున్నాడు. వెంటనే పూనుకొనవలెను' అని హెచ్చరించినాడు. కాని మత్తులో ఉన్న ప్రభువునకా హెచ్చరిక చెవికెక్కలేదు. సుగ్రీవుడు పట్టాభిషిక్తుడు కాక పూర్వము ఋష్యమూక పర్వత గుహలో ప్రవాసియై ఎన్నియో ఇడుములు పడినాడు. ఆ కష్టపరంపరను మరచిపోవుటకే ఈ భోగ లాలసత్వమనియూ, ప్రభువు క్షంతవ్యుడనియూ కిష్కింధ ప్రజలు భావించుచున్నారు' అన్నాడు.
పరిస్థితిని అవగతము చేసికొన్న లక్ష్మణుడు వామహస్తమున ధనువును దృఢముగ పూని దక్షిణహస్తముతో వింటినారిని ఆకర్నాంతము లాగి వదలినాడు. ఆ ధనుష్టంకారము (వింటినారి యొక్క ధ్వని) వినబడుటతోనే సుగ్రీవుని మత్తు వదలినది. అతడు లక్ష్మణుని వద్దకు పరుగున వచ్చి అతని హస్తయుగ్మమును తన చేతులయందు చేర్చుకొని సవినయముగ 'రామానుజా, నన్ను మన్నించుము. సీతాదేవి అన్వేషణకు ఇప్పుడే ఏర్పాటు చేసెదను' అన్నాడు....పిమ్మట అతడు వినతుడు అను వానర యూథౌధిపతిని తూర్పుదిక్కు నకునూ తారాదేవి తండ్రియైన 'సుషేణు'ని పడమటి దిక్కునకును 'శతబలి' యను కపిశ్రేష్ఠుని ఉత్తరదిశకును ఒక్కొక్కనికినీ లక్ష వనచరులను సాయమిచ్చి సీతాన్వేషణకు పంపినాడు. "మీరందరునూ ఒక మాసములోగా తిరిగి వచ్చి మీ అన్వేషణ ఫలితముణు నాకు తెలుపవలెను. ఆ గడువులోగా తిరిగిరాని వారికి మరణశిక్ష విధించబడును" అని ఆదేశించినాడు.
లక్ష్మణుడు: వానరేశ్వరా సీతాదేవిని అపహరించినవాడు దక్షిణదిశగా పోయెనను కొనుటకు సాక్ష్యమున్నది కదా. ఆ దిశకెవ్వరిని పంపెదవు?
సుగ్రీవుడు: వయసును మించిన తెలివియూ చురుకుతనమునూ, సామర్ధ్యమునూ కల యువరాజు అంగదుని ఆధిపత్యమున ఒక బృందమును దక్షిణదిశకు పంపెదను. ఆ అన్వేషకులలో సర్వవిధముల సమర్ధుడగు హనుమంతుడునూ బుద్దిలో బృహస్పతి కన్న మిన్నయగు భల్లుకేశ్వరుడు జాంబవంతుడునూ ఉందురు. సీతా మహాసాధ్వి ఎచ్చటనున్నదో తెలిసికొని వచ్చి చెప్పుటకు ఆ బృందమునకు కూడ మాసము మాత్రమే గడువు నిచ్చుచున్నాను.
సీతా మాహాసాద్వి జాడ తెలియుటతోనే ఆమెను అపహరించిన వానిపైకి దండెత్తిపోయి సమరమున వానిని సంహరించి ఆమెను రక్షించవలెను. సంగ్రామమునకు కావలసిన సైన్యమును ముందుగనె సమకూర్చుకొనవలెనన్న సంకల్పముతో సుగ్రీవుడు తన సేనాధిపతియగు నీలునితో "హిమాలయములు మొదలు దక్షిణ సముద్రము వరకును గల అడవులలోనూ కొండల మీదా గుహల లోపలా వసించుచున్న వానరులందరూ పదిహేను దినముల గడువు దాటకుండ కిష్కింధకు వచ్చి మన సేనలో చేరునట్లు చూడుము" అన్నాడు. ఆ సుగ్రీవాజ్ఞ ప్రకటింపబడుటతోనే కోట్లాది వానర బృందములు నలుదెసల నుండియు బయలుదేరి గడువు లోపల వనచర రాజధానిని చేరుకొన్నవి.
తూర్పుకును పడమరకును ఉత్తరదిశకును పోయిన అన్వేషకులందరు సకాలమున కిష్కింధకు తిరిగివచ్చి సుగ్రీవునితో "ప్రభూ సీతాదేవి యెచ్చతను కానరాలేదు" అని విన్నవించినారు.
సుగ్రీవుడు: దక్షిణదిశగా పోయిన అంగదుని అన్వేషక బృందము సీతా మహాసాధ్వి జాడను కనుగొని వచ్చెదరు.
గడువు ముగింపు దినము దగ్గర అగుచున్నది కాని అంగదుని బృందము తిరిగి రాలేదు. కిష్కింధ మొదలు దక్షిణ మహాసముద్రము వరకును గల భూ భాగమునంతనూ గాలించినారు. జానకి జాడను కనుగొనుటకు వారు ఆరోహించని గిరి లేదు. చొరబడని గృహము లేదు; ప్రవేశించని అరణ్యము లేదు...."కిష్కింధకు తిరిగిపోయి సుగ్రీవునకు 'వైదేహి జాడ తెలియలేదు' అని చెప్పినచో ఆతడు మనకు మరణశిక్ష విధించును. మరణించుటకు కిష్కింధ వరకును పోవుట ఎందులకు? ఈ సముద్ర తీరముననె ప్రాయోపవేశము (ఆహారాదులను వర్ణించి మరణమునకై కూర్చుండి యుండుట) చేయుదము".
సమీపముననె మహేంద్రా పర్వతముపై నున్న పక్షీంద్రుడు 'సంపాతి' ఆ వానర బృందమును చూచినాడు. అతడు జటాయువునకు అగ్రజుడు. మున్ను ఆ సోదరులు ప్రాయములో ఉన్నప్పుడొక పందెమును వేచుకొన్నారు.
"మనమిరువురము సూర్యమండలము వరకును ఎగిరిపోయి ముందుగా ఎవరు తిరిగి రాగలమో తెలిసికొందము" అని బయలుదేరినారు. సంపాతి ముందుగా తిరిగివచ్చుచుండగా పందెములో వెనుకబడిన జటాయువు ఎదురైనాడు. సూర్యుడావేళకు మధ్య దిన మార్తాండుడై నిప్పులు కురియుట ప్రారంభించినాడు.జటాయువు ఆ ఉష్ణోగ్రతను ఓర్చుకొనలేక సొమ్మసిల్లినాడు. సంపాతి సోదరుని రక్షించుతాకు తన రెక్కలను గొడుగుగా విప్పి ప్రచండ భానుకిరణముల కడ్డుగా నిలిచి జటాయువును 'ధరణిని చేరుకొమ్మ'ని హెచ్చరించినాడు. స్వయం రక్షణార్ధము తానునూ కిందికి పోవుటకు ప్రయత్నించి విఫలుడై తన రెక్కలు దహింపబడిన వన్న భయంకర పరిస్థితిని తెలిసికొన్నాడు. మరుక్షణముననే ఆ పక్షహీనుడు మహేంద్ర పర్వతముపై పడిపోయినాడు. రెక్కలు పోయి ఆహారార్జనను చేసికొనలేని దుస్థితిలో ఉన్న అతనికి కుమారుడు సుపార్శ్వుడు తాను వేటాడి తెచ్చుకున్న దాని నుండి కొంత పెట్టెడివాడు.
ఆనాడు పర్వతము పక్కన ప్రాయోపవేశమున నున్న వానరులను చూచినా సంపాతి బ్రహ్మానంద భరితుడైనాడు. "నేడు నన్ను భగవానుడు కరుణించి నిండు భోజనమును అనుగ్రహించినాడు! నేనా మర్కట సందోహము వద్దకు మెల్లగా నడిచిపోయి కావలసినన్నిటిని పట్టుకొని కడుపారా భక్షించెదను" అనుకొనుచూ మహేంద్రగిరిని దిగివచ్చినాడు....అంగద బృందమును చేరుకోనక ముందే సంపాతి కోక పాషాణముపై కూరుచుండి మాటలాడుకొనుచున్న భల్లుకేస్వరుడు జాంబవంతుడునూ, హనుమంతుడునూ తారసపడినారు.
