ఇలా శర పరం పరగా చెప్పుకు పోతున్నారు.
ఆ మాటలు వింటూ గ్రామీణులకు ఎండోమెంటు ఆలయ నిర్వహణ దారుల మీద ఎంత అసహ్యం కోపం ఉన్నాయో గ్రహించాడు వాల్మీకి.
వారి తిరస్కారం కోపం సరి అయిన కోణంలో పయనిస్తే ఆలయ నిర్వహణ ప్రతినిధులు కాదు. ఆ మొత్తం డిపార్టుమెంటునే క్షాళన చేయవచ్చు.
అదే ఈ సమస్యకి పరిష్కారం అని అర్ధమయింది.
"అవును మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు?" అని అడిగాడు.
"ఏం చేయాలండీ! ఏది అడిగినా దానికో రూలు చదువుతాడు. చట్టం, సెక్షన్ అంటాడు. దాన్ని కాదంటే మమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు.
దారుణం చేసింది వాళ్ళు! పోలిసుల లాఠీ దెబ్బలు మేము తినాలి.
దీనికి పరిష్కారం ఏముంటుంది? అన్నాడు ఓ నిరాశావాది.
"పరిష్కారం ఉంది" అన్నాడు వాల్మీకి దృఢంగా.
"అదేమిటో దారి చూపించండి బాబూ! గుడులు బాగుపడతాయి. వాటిని నమ్ముకున్న జనం బాగుపడతారు" అని అర్ధించాడు ఓ పెద్ద!
లంచాలు కట్టి పొలం పాటలు పాడుకున్న వ్యక్తులను కూడా తీసుకుని రేపు కన్పించండి! అప్పుడు చెప్తాను" అన్నాడు వాల్మీకి!
"రేపటిదాకా ఎందుకండి. సాయంత్రమే పిలుచుకు వస్తాం"
"సరే మీ యిష్టం" అన్నాడు వాల్మీకి.
వారు వెళ్ళిపోయారు.
"బాబూ! అనవసరంగా ప్రభుత్వం మనిషితో పెట్టుకుంటే మనం చిక్కుల్లో పడిపోయే అవకాశం ఉంటుందంటావా?"
"అలా అని అందరూ ఊరుకోబట్టే ఇలా జరుగుతోంది.
నిజం గుర్రాలు నిద్రపోతుంటేనే కొయ్య గుర్రాలకు కాళ్ళు వస్తాయి"
"బాబూ! నీవు పరిష్కారం చూపగలిగితే నా మనస్తాపం కూడా తీరుతుంది. ఈ ఉద్యోగి వల్ల ఆలయానికి లక్షలు కుమ్మరించే దాతలు దిగులుపడి కూర్చోవలసిన పరిస్థితి ఎదురు అవుతోంది" అందామె.
"అత్తాయమ్మగారూ! ఈ సమస్యని ఒక్క రోజులో పరిష్కరిస్తాను. ఇకనించి ఈ పీడ విరగడ చేస్తాను" అన్నాడు వాల్మీకి.
మగదిక్కు సాయం వచ్చినందుకు ఎంతగానో సంబరపడింది సుమిత్ర.
గాయత్రి భర్త వంక అభిమానంగా చూచింది.
సాయంత్రం అనుకున్న సమయానికి ముందుగానే రైతులు వచ్చారు.
"మీరు డబ్బు యిచ్చిన మాట నిజమేనా?"
"అవునండి మాకు చౌకగా పొలం కౌలుకు దొరకాలి! అతనికి లంచం కావాలి! ఇది వ్యాపారంగా జరిగిందేనండి!"
"సాటి రైతులకు అన్యాయం చేస్తున్నామని అనిపించలేదా?"
"వాళ్ళని కూడా లంచమిచ్చి తీసుకోమనండి. ఎవరు వద్దన్నారు"
"ఎండోమెంట్స్ అధికారి స్వామిని ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసగించడం మీకేమీ బాధలేదా?"
"ఎందుకు లేదండి చాలా ఉంది. కాని ఈ పని మేం చేయకపోతే మరొకరు చేస్తారు. మేమెందుకు వెనక పడాలి! ఈ పని తప్పనిసరిగా చేయగల అధికారంలో ఉన్నాడు. కాదనుకుంటే దేవాలయానికి లాభం ఉండదు. కాని మాకు నష్టం ఉంటుంది కదా" అన్నాడు ఒక విజ్ఞుడు.
"ఈ ఆలోచనలో మీ తప్పులేదు. మీకు ఖర్చు లేకుండా ఆలయానికి ఆదాయం పెరిగితే మీకు అభ్యంతరమా."
"అదేంటండీ! అది మాకూ పుణ్యమే కదా!"
"అయితే అతడు లంచం తీసుకున్నాడని వ్రాసి యివ్వండి!?"
"మా మీదవచ్చి పడతాడు కదండి?"
"పడినా ఆరేళ్ళ వరకూ మిమ్మల్ని ఏమీ చేయలేడు. పాట ఎవరి పేరుమీదున్న పొలాన్ని మీరూ మీరూ సమంగా పండించుకోండి!" అందుకు అందరూ ఒప్పుకున్నా సంతకాలు పెట్టించాడు.
మరునాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ నిర్వహణ ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్స్ తో పాటు ప్రజల్ని ప్రభుత్వాన్ని చీట్ చేయటం ఒక పవిత్ర సంస్థ తాలూకు ధనాన్ని దొంగిలించటం దుర్వినియోగం చేయటంలాంటి ఆరోపణలతో కేసు తయారయింది.
అయిదు లక్షల రూపాయలు చెల్లించిన తరువాత ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఉద్యోగం లేకుండా బయటపడాలి.
ఈలోగా కుష్టురోగం వచ్చిన కూతురు ఏమవుతుంది?
భార్య కంటికి అయినా కన్పిస్తుందా? ఇలాంటి అనేక సమస్యలు అతని కళ్ళ ఎదుట నిలిచాయి. నిన్నటి వరకూ ప్రజల ప్రభుత్వం దేవుడు అనే మహాశక్తుల్ని అవలీలగా మోసం చేయగలుగుతున్నానని విర్రవీగుతున్నవాడు హఠాత్తుగా భూమిలోకి కృంగిపోయాడు.
జాలిపడిన పై ఉద్యోగులు ఎవరో చెవిలో ఊదారు.
"ఇదంతా సుమిత్రాదేవిగారి భవనంలో జరిగింది" అని!
అతడు పరుగెత్తుకు వచ్చాడు.
సోఫాలో కూర్చుని దైవధ్యానం చేసుకుంటున్న రాణి సుమిత్రదేవి గారి కాళ్ళ ముందు పడిపోయినాడు. ఆమె కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది.
"బాబూ! నీ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. దయచేసి నా ముందునించి వెళ్ళిపో! మాటాడవలసినది ఏదయినా ఉంటే మా అల్లుడు గారితో మాటాడు! ప్లీజ్ గెటవుట్!" అందామె కఠినంగా.
అతడు సాగిలపడినవాడు కదలనయినా కదలలేదు.
"అమ్మగారూ! అయిదు లక్షలు డిఫర్ మేషన్ కట్టాలంటే నేను చప్పగా చల్లారిపోతాను. ఆరు సంవత్సరాలు జైల్లో వుంటే చచ్చిపోతాను."
"ఆ శిక్ష నీవు అనుభవించాల్సిందే! నీ పాపం సామాన్యమయినది కాదు. దైవ ధనాన్ని తినటం కాకుండా ప్రజలు ప్రభుత్వం దేవుడు గుడి అనే మూడు వ్యవస్థల్ని ఛీట్ చేశావు, ఈ శిక్ష చాలా చిన్నది నీకు.
దైవధనాన్ని దోచుకున్న పాపాత్ముడి ముఖం నేను చూడను. అవతలకు వెళ్ళు" అని అదలించిందామె కళ్ళు విప్పకుండానే.
ఇక లాభం లేదని అతడు తిరుగుముఖం అయ్యాడు.
"ఆ వైపున దేవుడి గది ఉంది. నీవు ఈ వైపునించి వెళ్ళు! దేవుని గదిముందుగా వెళ్ళకు. అపవిత్రం అవుతుంది" అన్నదామె.
ప్రాణాంతకమయిన అవసరంలో ఉన్నవాడు కావటం నించి అవమానమంతా భరించి పైకి వెళ్ళాడు. వాల్మీకి కాళ్ళమీద పడిపోయాడు.
"మిత్రమా! నువ్వు ప్రజల్ని దేవుణ్ణి ధార్మిక వ్యవస్థని వ్యాపారంగా తీసుకున్నావు. ఇప్పుడు నేను కూడ నీతో వ్యాపారం మాటాడతాను.
నీవు మూడు షరతులకు ఒప్పుకుంటే ఈ ఊబిలోంచి బయటపడతావు. లేకపోతే నీ జీవితం పైకి తేలదు. ప్రజలు కక్షకట్టి ఉంటారు. పాపం కొండలా పెరిగిపోయి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వాలు కన్ను తెరుస్తుంటాయి కాబట్టి పూర్తిగా మునిగిపోతావు.
తప్పులు పాపాలు చేసేటప్పుడు అవి చాలా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాని వాటి ఫలితాలను అనుభవించేటప్పుడు పశ్చాత్తాపంతో కన్నీరు తప్పదు."
"మీరు ఏ షరతులు విధించినా ఒప్పుకుంటాను" అన్నాడు కంగారుగా!
"మొదటిది నువ్వు మొత్తం మూడు లక్షలు దేవాలయానికి రెండు లక్షలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.
రెండు అందరి సమక్షంలో స్వార్ధం లేకుండా ఆక్షన్ జరపాలి.
మూడు దేవుని సమక్షంలో క్షమాపణలు చెప్పి మన్నింపు అడగాలి.
ఈ మూడు షరతులు నెరవేరితే ప్రజల కోపం తగ్గి సాక్ష్యాలు వెనక్కి తీసుకుంటారు. నీకు రెండు లాభాలుంటాయి.
జైలుశిక్ష తప్పటం ఒకటి. ఉద్యోగం నిలవటం మరొకటి!
ప్రజలు కళ్ళు మూసుకుని దుర్మార్గుల పాపాల్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అందరూ చేయగలుగుతారు.
వారు చేయి చేసుకుంటే ఏమవుతారు.
"ఇష్టమేనా?" అని అడిగాడు వాల్మీకి.
"బాబుగారూ! నేను ఈ దేవుడి సొమ్ముతిని అయిదు లక్షలు సంపాదించిన మాట వాస్తవమే! కాని కొంత ఖర్చయిపోయింది. కొంత వెంటనే డబ్బుగా వాడటానికి వీలుకాని రూపంలో ఉంది.
కొద్ది సమయం ఇస్తే మీ షరతులు పూర్తి చేయగలను" అన్నాడు.
"అలాగే ఎంత సమయం కావాలి!"
"నెలరోజులు కావాలి బాబూ!"
"ఈలోగా మోసం చేయవని నమ్మకం ఏమిటి?"
"నా దగ్గర కాష్ గా ఉన్న మూడు లక్షలు ఈరోజు ఇచ్చేస్తా!"
"దట్స్ గుడ్ వెళ్ళిరా అన్నాడు వాల్మీకి.
డబ్బు తెచ్చేందుకు పరుగు పరుగున వెళ్ళిపోయినాడు.
గాయత్రి అతని కంగారు చూచి ముసిముసిగా నవ్వుతోంది.
"భలే బాగా గుణపాఠం చెప్పారు" అంది వెళ్ళిపోయిన తరువాత!
"దేవునికి డబ్బు ఖర్చుపెట్టి వైభవాలు జరిపించే భక్తులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారీ ఉద్యోగులు. డబ్బు దానం చేయటం ఒక శాపం దేవాలయానికి వెళ్ళటం బుద్ధి తక్కువ అనిపించేలాగా చేస్తున్నారు!
నేను ఎంతో కాలంగా ఆలయానికి లక్షలు ఖర్చు పెడుతూ దాని గౌరవం ప్రజలభక్తి భావాన్ని కాపాడుతూ ఉన్నవారి వల్ల మనస్తాపానికి గురి అయినాను. నువ్వు క్షణంలో ఈ సమస్యని తేల్చి వేశావు.
మగ రెక్కలు తోడుగా ఉంటే ఈ వ్యవస్థ మారుతుందని నేను అనుకున్నా అది యదార్ధమే అని నువ్వు నిరూపించావు.
ఈ రోజు నాకు చాల ఆనందంగా ఉంది అంటూ ప్రశంసించింది సుమిత్ర.
"అత్తాయమ్మగారూ! ఈ ఆలయం కోసం ఈ ప్రజల కోసం మీరు ఎంత త్యాగం చేశారో అందరికి తెలుసు! ఆడవారు కాబట్టి మీరు చేయు కొన్ని పనులు ఆసరాగా తీసుకుని అ స్వార్ధపరుడు నాటకం ఆడాడు!
ఇకమీద ఇతడేకాదు. ఈ ప్రాంతాలకు ఎవరొచ్చినా జాగ్రత్తగా ఉంటారు. మీ ధర్మబలమే ప్రజాబలంగా మారి అతన్ని శిక్షించింది.
శరీరం ఎలాంటిదో సమాజం అలాంటిది.
డానికి వ్యాధుల్లాంటి మనుషులు ఆశించటం అనివార్యం!
కాని సమయం వచ్చినప్పుడు ఆ దోష లక్షణాన్ని మాన్పుకోగల శక్తి శరీరానికీ ఉంది. సమాజానికీ ఉంది!" అన్నాడు వాల్మీకి.
"ఈ వారసత్వం ఇలాగే మగ రెక్కలమీద సాగాలి! మీకు మగబిడ్డకలిగే సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా విశేషం ఉంది అని గాయత్రి నాతో చెప్పే ఈరోజు కోసం చూస్తున్నాను.
