Previous Page Next Page 
పరిహారం పేజి 30


    ఈ సమయంలో తను పారిజాత కోసం వెళ్ళడం ఆమెను రక్షించి తీసుకు రావడం ఎంత అనుచితమో అతడు గ్రహించగలిగాడు. పారిజాతకూ తనకూ ఏమిటి సంబంధం తమ కాంపౌండులో చాలా రోజులు అద్దెకున్న ఒక మాస్టారి అమ్మాయి. ఆ పరిచయాన్ని బట్టి పారిజాతను ఈ సమయంలో రక్షించి తీసుకువస్తే ఆమె పూర్తి బాధ్యత తనే స్వీకరించవలసి వస్తుంది. తీసుకువచ్చి ఎక్కడదింపాలి? ఆమె బ్రతకడానికి ఏమి ఆధారం చూపాలి? నెలకు యాభయ్యో, అరవయ్యో వచ్చేలాగా తనకు తెలిసినవాళ్ళ ఇళ్లలో ఓ నాలుగయిదు ట్యూషన్లు మాట్లాడితే మాట్లాడొచ్చు కాని ఆ తర్వాత ఎన్ని కథలు ప్రచారమౌతాయో. వెనుకటికోసారి అయిన అనుభవం చెబుతుంది. అసలు ఆ పిల్ల విషయంలో తను జోక్యం పెట్టుకుంటే అమ్మ ఊరుకోదు. లేనిపోని కలతలకు కారణమవుతుంది.
    "ఈ పరిస్థితిలో పారిజాత విషయంలో తను మౌనం వహించడమే ఉత్తమ" మనుకొన్నాడు మనోహర్. గణపతి లాంటి వాళ్ళ బావతో వాళ్ళత్త వివాహం జరిపిస్తే తన కేమిటి? రెండురోజులు ఏడ్చి ఆ జీవితానికి అలవాటు పడుతుంది.
    "ఈ ప్రపంచంలో లక్షలాది ఆడపిల్లలు లేమికి బలి అవుతూనే ఉన్నారు. చూసి జాలి అయితే పడగలరు గాని వాళ్ళందరినీ ఆదుకొని గట్టుకు చేర్చగలరా?"
    ఇలాంటి ఊహలతో మనోహర్ పారిజాత వ్రాసిన ఉత్తరాన్ని, పారిజాతనూ మర్చిపోవడానికే నిశ్చయించుకొన్నాడు.
    మరునాడు లలిత వీలు చూచుకొని మనోహర్ ని అడిగింది. "మీరు పారును తీసుకురావడానికి వెళ్ళడం లేదా?"
    "పనులున్నాయి." మనోహర్ ముభావంగా అన్నాడు.
    "పారు మీ కోసం ఎంత ఆశతో చూస్తుందో?"
    మనోహర్ మాట్లాడలేదు.
    అతడిలో వ్యక్తమౌతున్న ఉదాశీనత చూచి లలిత ఒక నిట్టూర్పువిడిచింది. అతడిమధ్య ఒక అమ్మాయిని చూచి వచ్చిన సంగతీ, ఆమెతో  అతడి వివాహం ఖాయం కాబోతున్న సంగతీ లలితకు తెలుసు. కాని, తల్లి బలవంతంతో పెళ్ళిచూపులకు వెళ్లాడనీ, పారు అంటే అతడి అంత రంగంలో అనురాగం వుందనీ, ఈ ఉత్తరం చదువుకుని పారుకోసం అతడు తప్పకుండా వెడతాడనీ ఆశించింది లలిత! ఇప్పుడు అతడి ఉదాశీనం చూచి, ఆ సంబంధాన్ని అతడు ఇష్టపూర్తిగా అంగీకరించినట్టు గ్రహించింది.
    ఈసంగతి పారుకు ఎలా రాయాలి? ఆ చెరనుండి ఆ బలవంతపు పెళ్లినుండి పారును ఎలా కాపాడాలి? ఈ సంగతి రంగనాధం గారికి చెబితే? ఆయనేమైనా సహాయం చేస్తాడేమో!
    రంగనాధం ఇంటికి వచ్చి ఆయనకు పారిజాత వ్రాసిన ఉత్తరం చూపెట్టింది లలిత.
    "అతడు కాస్త కురూపి అయితే అయ్యాడు. ఏం పోయింది? వాళ్ళ మేనత్త బాగా డబ్బు దస్కం వున్న మనిషని విన్నాను. ఒక్కడే కొడుకు ఆస్తి ఉన్న ఇంటికి కోడలిగా పడుతుంది! ఆడదానికి కోరిననగా, కోరిన బట్టా కట్టడంకంటే అదృష్టం ఏముంది?"
    ఆయన మాటల్లో వ్యంగ్యానికి విస్తుపోయింది లలిత.
    "కోమలమ్మ కొడుకు మీది ఆశతో కాల్ళ దగ్గిరికి వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకొన్న తెలివి హీనురాలు కాదూ? మనోహర్ ముందు మా గిరిధర్ సూర్యుడి ముందు దివిటీలా కనిపించాడు ఆ పిల్ల కళ్ళకు! అందని చందమామ ఎంత అందంగా వుంటే ఏమిటన్న తెలివి లేకపోయింది. ఇప్పుడు మేనత్త రోగం కుదురుస్తోంది కాదూ?"
    "మీరలా కోపగించుకొంటే ఎలా? ఆ కురూపిని చేసుకోవడం ఇష్టంలేక ఏ బావిలో దూకి చస్తుందోనని నాకు భయంగా వుంది"
    "ప్రాణం తీసుకోవడం నువ్వనుకొన్నంత తేలిక కాదు."
    "ఈ ఒక్కసారి ఆ పిల్లను క్షమించి, ఆ కామమ్మ చేతులనుండి తప్పించి తీసుకురండి. ఎలాగైనా నచ్చజెప్పి గిరిధర్ ను పెళ్ళాడడానికి ఇష్టపడేలా చేస్తాను"
    "ఎందుకమ్మా అంత బలవంతం? నా కొడుక్కి పిల్ పుట్టదనా? స్నేహితుడి కూతురన్న అభిమానంతో నా కోడల్ని చేసుకోవడానికి ఆరాటపడ్డానే గాని, ఇప్పుడా అభిమానం చచ్చిపోయింది. మనోహర్ కి ఆపిల్లకీ వున్న సంబంధం ఎవరికి తెలియదని? ఏదీ లేకపోతే ఆ పిల్లను పెళ్ళి చేసుకొంటానని కృష్ణారావు చచ్చేప్పుడు వాగ్దానం చేస్తాడా? ఇప్పుడు బాగా శ్రీమంతుల సంబంధం వచ్చేసరికి పారిజాతని అన్యాయం చేయడానికి సిద్దపడ్డాడు కాదూ?"
    "మీరనుకొనే సంబంధమేదీ వాళ్ళమధ్య లేదండీ! పారిజాతను పెళ్ళి చేసుకొంటానని అతడెప్పుడూ చెప్పలేదు. ఇందులో అతడు మోసంచేసింది ఏమీలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS