"ఏమయ్యా. బొత్తిగా మందిలో కనిపించవు? ఇంకా ఏకాంత ప్రియత్వం వదలనట్లుంది!" నవ్వుతూ భార్గవరామ్ గదిలో అడుగుపెట్టింది శ్రీలక్ష్మి.
"రా, అత్తా!" కొంచెం యిబ్బందిగానే ఆహ్వానించాడు అతడు. చిన్నప్పుడు తనను చంకవేసుకు తిప్పిందే అయినా, బాగా పెద్దయ్యాక అంత చనువుతీసుకొని మాట్లాడింది కాదు! కొంచెం బెరుకుగానే వుందతడికి ఆమెతో సంభాషించడం!
డొంక తిరుగుడేమీ లేకుండా వచ్చిన విషయం సూటిగా బయటపెట్టింది. "దేవతను కోడల్ని చేసుకొమ్మని అడిగితే, నాదేముంది, నీ అల్లుడిని అడుగుపొమ్మంది మీ అమ్మ, చెప్పు. అల్లుడూ! నేనేం పరాయిదాన్ని కాదుగా మనసులో ఉన్నదేమిటో నిర్మొహమాటంగా చెప్పేసెయ్".
గతుక్కుమన్నాడు భార్గవరామ్. ఇన్నాళ్ళు తను పీడించిందికాక ఈమెనుకూడా నా మీదికి పంపిందా? నన్ను బ్రతకనిచ్చేట్లులేరు" చిరాకు పడ్డాడు.
"అమ్మకు అన్నీ తెలుసు, అత్తా! అన్నీ తెలిసి నిన్ను నాదాకా ఎలా పంపిందో ఆశ్చర్యంగా ఉంది!" మెల్లని స్వరాన అన్నాడు, చూపులు, మరోవంకకు తిప్పుకొని.
శ్రీలక్ష్మి ముఖం వివర్ణమైంది. "అన్నీ అమ్మకు తెలుసునంటే? కొంపదీసి ఇదివరకే సంబంధం నిశ్చయమైపోలేదుకదా? తను చెప్పలేక కొడుకుతో చెప్పించాలనుకొందేమో?" క్రిందికి దిగివచ్చింది శ్రీలక్ష్మి. "అన్నీ అమ్మకు తెలుసు; నా దగ్గరికెందుకు పంపించింది. నిన్ను అంటున్నాడు నీ కొడుకు ఏమిటి సంగతి, వదినా?"
ముఖం కొంగులో దాచుకొని చివాలున లేచి అక్కడినుండి వెళ్ళిపోయింది కృష్ణవేణి. ఆడబిడ్డ ప్రవర్తన అర్థంకాక నిర్ఘాంతపడిపోయింది శ్రీలక్ష్మి. వెళ్ళేలోపుగా సంగతి సందర్భాలు కనుక్కోగలిగింది. రావుగారివల్ల కొంతా, గోవిందస్వామివల్ల కొంతా.
ఇంతవిన్నా, భార్గవరామ్ ను మనసునుండి తీసివేసి తిరుమలాపురం అబ్బాయిపై ఇష్టత ఏర్పరచుకోలేక పోతున్నది, శ్రీలక్ష్మి!
తల్లితో వెళ్ళిపోవడానికి బట్టలన్నీ సర్దుకొని యాంత్రికంగా తయారవుతున్నదేగాని, దేవదాసి హృదయంలో అస్పష్టమైన ఆరాటం, చెప్పలేని దిగులూ ఆవరించాయి. "బావ నన్ను కోరడంలేదు. అయినా ప్రేమిస్తున్నాడు. నిష్కామమైన అతడి ప్రేమే నాలో వారింపబడని ఒక ఆకర్షణనూ, అనురాగాన్ని జనింపజేస్చున్నది. బావ నన్ను ప్రేమిస్తున్నంత వరకూ నాలో ఈ అనురాగవల్లరి పల్లవిస్తూనే ఉంటుంది!"
వెళ్ళి బావనుండి వీడ్కోలు తీసుకోవాలని ఉంది. అతడి రూపు మరిచిపోకుండా హృదయంలో గాఢంగా ముద్రపడేలాగ అతడిని ఒకచూపు చూడాలని ఉంది. నిన్న తల్లి విఫలయత్నం సంగతి తెలిసింది దేవదాసికి. అతడి ఎదుటికి వెళ్ళడానికి ఇన్నాళ్లులేని లజ్జ ఇప్పుడు అడ్డగిస్తూంది.
"ఏం మాట్లాడినా చేసినా ఈరోజే! మళ్ళీ బావను చూచేది ఎప్పటికో?" ధైర్యం చేయక తప్పింది కాదు.
దేవదాసి వెళ్ళిపోతున్న సమాచారం అతివిచారంగా తెలియజేశాడు సుబ్బయ్య, భార్గవరామ్ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడే.
"దేవతమ్మ ఇవాళ సాయంత్రం వెళ్ళిపోతున్నది. చినబాబూ! ఇల్లు చిన్నబోతుంది. ఇక ఇంట ఎందరు దాస దాసీజనం వున్నా ఆడపిల్ల వున్న కళవేరు! పాపం కృష్ణవేణమ్మ తల్లి ఆడపిల్లలకు నోచుకోలేదు. కోడలిపిల్లనైనా తెచ్చుకొందామంటే ఆ తల్లికి ఆ అదృష్టం కూడా లేకుండా చేస్తున్నారు మీరు! ఏం వేదాంతం అబ్బిందో? అది ఎవరిని సుఖపెట్టేదో?"
"ఒక అమూల్య వస్తువును పోగొట్టుకొన్నానని విచారించే రోజు ఒకటి నా జీవితంలో వస్తుందా?" అప్పటినుండి భార్గవరామ్ లో మధన ప్రారంభమైంది.
దేవదాసి చెప్పిపోవడానికి వచ్చినప్పుడు, చదవాలని తీసుకొన్న పుస్తకం గుండెలమీద ఆన్చుకొని ఈజీ చెయిర్ లో వాలి ఉన్నాడు, ఈ ఆలోచనతోటే సతమతమౌతూ.
"వెళ్ళొస్తా, బావా!"
తలవంచుకొని బొటనవేలితో నేలను రాస్తూ నిల్చున్న దేవదాసివంక చూచి చూచి చివరికి అప్పుడు మెల్లగా "వెడుతున్నావా? మళ్ళీ, నిన్ను, ఎప్పుడు చూస్తాను?"
తలకొద్దిగా పైకెత్తి సన్నగా నవ్వింది. "నీ తలపు నేనైనప్పుడు ఆత్మజగత్తులో అనునిత్యం!"
"ఉఁ."
దీర్ఘంగా తన ముఖంలోకి చూస్తూ బరువుగా వదిలిన అతడి నిట్టూర్పులో అతడి మనస్సంతా స్ఫురించినట్లనిపించింది దేవదాసికి.
