"ఇప్పుడు వాళ్లమధ్య వున్న సంబంధం కడికవాడు, గొర్రెపిల్లమధ్య వుండే సంబంధంలాంటిది! ఇది వుండడంకంటే పోవడమే మేలంటాను. ఆడదాన్ని సుఖశాంతులతో బ్రతకనీయనప్పుడు ఆ కాపురం ఎందుకు? కూలిపోతేనే ప్రమీల బ్రతికిపోతుంది!"
"అవ్వ! చేజేతులా తమ సంసారాన్ని కూల్చివేసుకొంటారా ఎవరైనా? ఏనాటికో ఒకనాటికి చక్కబడుతుందన్న ఆశా, సహనం వుండాలిగాని కూల్చి వేసుకొంటే ఏం మిగులుతుంది! తల్లిదండ్రులా ఇంట అడుగుపెట్టనివ్వరు! అప్పుడు రోడ్డేగా గతి? ఆడది వీధిపాలుకావటం కంటే చావడమే మేలుకదా?"
"ఎందుకు మమ్మీ ఇంత సంకుచితంగా మాట్లాడతావు? ఆడది పెళ్లికి ముందు తలిదండ్రుల నీడన, పెళ్ళయ్యాక భర్త నీడన తప్ప మరో విధంగా బ్రతకడం వీధిన పడడంగా ఎందుకు భావించాలి? తన కష్టం తను పడుతుంది. తన బ్రతుకు తను బ్రతుకుతుంది. తన నీడ తను ఏర్పరచుకొంటుంది."
"ప్రమీల ఏం పెద్ద చదువు చదివిందని ఉద్యోగం వస్తుంది?"
"ఉద్యోగం రాకపోవచ్చు! ఇప్పుడు భర్త అన్న కటికవాడికి, అత్త అన్న రాక్షసికి గొడ్డు చాకిరీ చేయడం లేదూ? అదే చాకిరి ఇంకెవరి దగ్గరైనా చేసి దాన్నే సంపాదనగా మార్చుకొంటుంది."
"బాగుందే నీ ఆలోచన? ఎవరింట్లోనో పాచిపని చేసి బ్రతకటం కంటే భర్త నీడన వుంటే గుట్టుగా, గౌరవంగా వుండదూ?"
"క్షణ క్షణం నరకం కన్పిస్తూ, దాసికంటే కుక్కకంటే హీనంగా చూస్తూ తంతూ, తిడుతూ వుండే భర్త నీడ గౌరవమూ, తన రెక్కల కష్టంమీద తను బ్రతకడం అగౌరవమూనా? నీ ఆలోచనా ధృక్పదంలోనూ, దాదాపుగా నీ మాదిరిగా ఆలోచించే ఈ సమాజ దృక్పధంలోనూ మార్పువస్తే త్పప ప్రమీల లాంటి పీడితులు బ్రతికిపోరమ్మా! స్త్రీ భార్యగా, కూతురిగా బ్రతకడంకంటే వ్యక్తిగా జీవించడం గొప్ప విషయంగా భావిస్తాను అభ్యుదయ వాదులంతా ఇదే భావిస్తారు!"
"సరే! ఎవరింట్లోనో ఎంగిలి కంచాలు కడిగో, వీధులూడ్చో తన బ్రతుకు తను బ్రతుకుతుంది. తరువాత!"
"తరువాతేమంది?"
"నిండా ఇరవయ్యేళ్లు లేని పిల్ల! ప్రపంచ ధర్మాన్ని కాదని, శరరధర్మాన్ని కాదని ఎలా బ్రతుకుతుందో నాకు అర్దంకావడంలేదు!"
"అదా?" అప్పటికి అర్దమైంది తల్లి భావం. తేలిగ్గా అంది "ఒంటరిగా వుండలేననుకొన్నప్పుడు తనకు తగిన వాడిని చూసి తను పెళ్లిచోసుకొంటుంది!"
"నీ అభ్యుదయం ఏడ్చినట్లుంది... ఇదా స్త్రీ అభ్యుదయం? ఈ మగాడు కాకపోతే ఇంకో మగాడని మగాళ్ల వెంట పడడమేనా స్త్రీజనాభ్యుదయం? అభ్యుదయం కాదే ఇది! స్త్రీ పతనావస్థ! పవిత్రమైన మన వివాహ వ్యవస్థను కించపరుస్తూ సాగే నీ ఆలోచనలను ఇక పెరగనివ్వకు! నేను సహించలేను!"
తల్లికి ఎంత కోపం వచ్చినా తన అభిప్రాయాన్ని చెప్పడానికి జంకలేదు హరిత. "ఈ వివాహ వ్యవస్థను చూసి మరీ అంత గర్వంతో పొంగిపోకమ్మా! మీరనుకొనే పరమపవిత్ర మైన ఈ వివాహవ్యవస్థే కట్నం పేరుతో ఎందరినో బలితీసుకొంటూంది, ఎందరినో కాల్చి చంపుతూంది. ఇంకెందరినో కాల్చుకొనేట్టు చేస్తోంది. ఎందరినో గొంతు పిసికి, నూతిలోకి త్రోసి చంపుతూంది. కొందరికి మాత్రమే స్వర్గమైతే చాలా మందికి నరకమౌతూంది! పవిత్రత అన్నది మనిషిలో వుండాలిగాని, వివాహంలో కాదు! మనిషి పవిత్రుడై నప్పుడు వివాహమే కాదు ఏదయినా పవిత్రమే అవుతుంది!"
"హరీ! నిన్ను చూస్తే నాకు భయం వేస్తూందే! నువ్వు..... నువ్వు తలిదండ్రుల గుండెల్లో కుంపటిలా మారవు కదా!" హేమలత కూతురి ముఖంలోకి భీతావహంగా చూసింది.
"నన్ను అర్దంచేసుకొని నాకు సరిపోయిన వ్యక్తితో వివాహం జరిపిస్తే అలా ఎందుకు జరుగుతుంది మమ్మీ!"
"సరిపోయిన వ్యక్తి అని ముందుగా ఎలా తెలుస్తుంది....?"
"అదేకదా వచ్చినచిక్కు! సంప్రదాయ బపధంలో చిక్కుకొన్న ఆడపిల్ల తనకొచ్చే మగడు ఎలాంటివాడవుతాడో తెలుసుకోలేకపోతోంది. ప్రేమ వివాహాలవలన ఆ ప్రమాదం అంత వుండదు. కాని ఎంతమంది తమ పిల్లలకి ఆ స్వేచ్చ ఇస్తున్నారు?"
"ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా నేనుమాత్రం ఆ స్వేచ్చ నీకివ్వను! అది బాగా గుర్తుపెట్టుకో!" హేమలత లేచింది.
