Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 30

    "ఆయన మెటడార్ వేన్ వాడతారు."

    "తనే డ్రయివర్ చేస్తారా?"

    "అవును"

    "మీ ఇంటికి ఈ దారికాక వేరేదారి ఏదయినా ఉందా?"

    "ఉంది."

    "కాస్త చూపిస్తారా?"

    ఆ మాట వినగానే మహాలక్ష్మి లేచింది.

    ఇంటి వెనక చిన్న గార్డెన్ ఆ గార్డెన్ చుట్టూ ప్రహరీ గోడ. దానికో తలుపు. ఆ గోడ అవతల చిన్న వీధి. తలుపు గొళ్ళేనికి తాళంవేసి ఉంది. ఎన్నో ఏళ్ళక్రితం వేసిన ఆ తాళం ఎండా వానలకి ఎండీ తడిసీ తుప్పుపట్టిపోయింది. ఇటీవల ఎవరూ దానిని వాడిన దాఖలాలు లేవు ప్రహరీగోడ కూడా తొమ్మిది అడుగుల ఎత్తు ఉండవచ్చు. మరో మనిషి సహాయం లేనిదే ఎవరూ ఆ గోడ దాటి అవతలికి వెళ్ళడం కష్టం....ఈ విషయాలన్నీ మనసులోనే నోట్ చేసుకున్నాడు ఇన్ స్పెక్టర్ దుర్గారావు. నేలమీద కాలిజాడలకోసం నిశితంగా పరీక్షిస్తున్నాడు మహావీర్.

    "పెరటిలోంచి ఎవరైనా వచ్చి రమణిని తీసుకువెళ్ళాలనుకోవడానికి ఆస్కారం లేదు." తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు దుర్గారావు.

    "ముందు గేట్లోంచి కూడా ఎవరూ రాలేదు. వాచ్ మెన్ ని అడిగాం. అప్పుడే కాలిజోడు గేటుకి కొంచెం దూరంలో పడివుందని చెప్పాడు..." అంది రాజేశ్వరి.

    "అన్నట్టు ఆ కాలిజోడు ఎక్కడా ఉంది రాజేశ్వరీ?" అనడిగాడు రాజారామ్.

    "డ్రాయింగ్ రూంలో టీపాయ్ మీద ఉంది."

    అంతా కలిసి మళ్ళీ డ్రాయింగ్ రూంలోకి వచ్చి సోఫాల్లో కూర్చున్నారు.

    టీపాయ్ మీద ఉన్న జోడుని చూశాడు రాజారామ్. సందేహంలేదు. అది రమణిదే!

    "దుర్గారావుగారూ, రమణి జోడు గేటు అవతల పడి ఉందంటే....రమణి ఇంట్లోంచి గేటు బయటికి వెళ్ళి ఉండాలి. లేదా...ఎవరేనా...రమణిని భుజంమీద ఎత్తుకొని వెళ్ళినప్పుడు జోడు పడిపోయి ఉండాలి. ఏది జరిగినా ఇది వాచ్ మెన్ దృష్టిలో తప్పక పడివుండాలి. వాచ్ మెన్ ని పిలిచి అడగండి" అన్నాడు రాజారామ్.

    "అవును" అంటూ మహాలక్ష్మి వేపు చూశాడు దుర్గారావు.

    మహాలక్ష్మి లేచి వరండాలోనికి వెళ్ళింది.

    "వాచ్ మెన్" అని గట్టిగా కేక వేసింది.

    మరికొద్ది నిమిషాలకి వాచ్ మెన్ వచ్చాడు. ఇన్ స్పెక్టర్ దుర్గారావు, ఎస్ ఐ. మహావీర్ అతన్ని చాలాసేపు ప్రశ్నించారు.

    ఉదయం ఎనిమిది గంటలకి డ్యూటీకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ అతను రెండుసార్లు గేటు వదలి బయటికి వెళ్ళాడు.

    ఒకసారి కాలకృత్యం తీర్చుకోవడానికి...

    రెండోసారి విరించిగారు సిగరెట్లు తెమ్మంటే తేవడానికి...

    అంతే!

    ఆ తర్వాత మరెక్కడికీ కదల్లేదు. గేటుదగ్గరే ఉన్నాడు. ఒక్క విరించిగారు తప్ప ఎవరూ ఈ ఇంటిలోనికి రాలేదు. బయటికి వెళ్ళలేదు.

    "మేడమ్...మీ ఇల్లంతా ఒకసారి చూస్తాం..." అన్నాడు దుర్గారావు హఠాత్తుగా నిలబడి.

    "రండి" అంటూ మహాలక్ష్మి లేచి నిలబడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లూ ఆమెని అనుసరించారు. డ్రాయింగ్ రూంలో రాజారాం, రాజేశ్వరీ ఉన్నారు.

    రాజారాం ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి.

    మాటి మాటికి రమణి అమాయక వదనమే అతని కళ్ళ ముందు కదులాడుతోంది. "డాడీ నాకది కావాలి ఇది కావాలి" అంటూ అడిగే రమణి రూపమే అతని మనస్సంతా నిండిపోయింది.

    ఇప్పుడెక్కడ ఉందో?

    ఏం చేస్తుందో?



                                 0    0    0


    డాబా మీదున్న ఓవర్ హెడ్ టాంక్ దగ్గర నిలబడ్డాడు ఇన్ స్పెక్టర్ దుర్గారావు.

    డాబా మీదికి ఆడుకుందామని వెళ్ళి ఓవర్ హెడ్ టాంకులో ప్రమాదవశాత్తూ పడి చనిపోయిన పిల్లలెందరో ఉన్నారు - రమణి కూడా అలాగే...?

    టాంక్ మూత తీస్తుంటే దుర్గారావు మనసు అదోలా అయింది. టాంక్ లో నీళ్ళు తప్ప మరేమీలేదు. పిట్టగోడ దగ్గర నిలబడి చుట్టూ చూశాడు. అంతలో ఏదో ఆలోచన వచ్చినట్టు గబ గబ కిందకి దిగాడు.

    అప్పటికి రెండు గంటలయింది.

    బెడ్ రూం నిండా పోలీసులు నిండిపోయారు. ఒక పోలీస్ డాగ్ ని తెప్పించారు. కాని దానివల్ల ఫలితం లేకపోయింది. అది బెడ్ రూంనుంచి డ్రాయింగ్ రూంలోకి వచ్చింది. అక్కడి నుంచి పోర్టికోలోకి వెళ్ళింది. అంతే అక్కడ ఆగిపోయింది. వేలిముద్రల నిపుణులు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని బెడ్ రూం అంతా గాలిస్తున్నారు.

    "నేనొకసారి చైర్మన్ గారిని కలిసి వస్తాను." అంటూ లేచాడు రాజారామ్.

    ఎవరూ మాట్లాడలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చైర్మన్ గది వేపు నడిచాడు.

    గదిలోపల రాజభూషణరావు మేలుకొనే ఉన్నాడు. పోలీసులకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు.

    "రా....రాజా....కూర్చో"

    రాజారామ్ కూర్చున్నాడు.

    "అంతా విన్నాను. లక్ష్మి చెప్పింది. అయాం సారీ రాజా!"

    రాజారామ్ ఏం మాట్లాడలేదు.

    "నేనిప్పుడే హోం మినిస్టర్ కి ఫోన్ చేశాను. పాపని అప్ప చెప్పే పూచీ తనదని అన్నాడు. పాపం, వాళ్ళూ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఆ పైన మన అదృష్టం."

    "నేను ఇంటికి వెళ్తాను సర్. అయ్ నీడ్ సమ్ టైమ్ టు థింక్" అంటూ లేచాడు.

    "ఓకే రాజా"

    రాజారామ్ బయటికి నడిచి, డ్రాయింగ్ రూం వేపు దారి తీశాడు. అక్కడున్న రాజేశ్వరితో ఏదో అనబోతూ చటుక్కున ఆగిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS