
ఏమీ ఉబుసుపోని పాఠకుడు పుల్లయ్య ఏమీ ఉబుసుపోనీ వాడిలాగా ఉండకుండా , ఏమీ ఉబుసుపోని రచనలుండే వీక్లీ ఒకటి కొన్నాడు. అందులో కధ చదివాడు. వెంటనే ఒక కార్డు ముక్క రాసి పడేశాడు. అది ఇలా ఉంది.
ఎడిటర్ మహాశయునికి. అయ్యా! మీ (మా) పత్రికలో 'బస్సు ప్రయాణం' అనే కధ చదివాను. చాలా బాగుంది. అయితే చిన్న కరేక్షను. అందులో హీరో బస్సు దిగి ఎస్. రామాపురంలోకి వెళ్ళాడని ఉంది. నాకు తెలిసి ఎస్. రామాపురంకు ఆర్టీసి బస్సు లేదు. కనుక రచయిత తన అవగాహన లేమితో పాఠకులను తప్పుదోవ పట్టించే విధంగా ఈ కధ రాశాడని గమనించగలరు.
-ఇట్లు పాఠకుడు పుల్లయ్య.
ఈ ఉత్తరం అచ్చయింది . తిరుగుటపాలో మరో ఉత్తరం కూడా అచ్చయ్యింది.
ఎడిటర్ గారు - 'బస్సు ప్రయాణం ' కధ మీద పాఠకుడు పుల్లయ్య రాసిన లేఖ చూశాను. పుల్లయ్య గారి అభిప్రాయం తప్పు అని నా అభిప్రాయం . ఎందుకంటే ఎస్. రామాపురానికి ఆర్టీసీ బస్సు లేని మాట వాస్తవమే. కాని ఆ ఊరికి ఒక ప్రయివేటు బస్సు ఉన్నట్టుగా నాకు గుర్తు. కనుక హీరో బస్సు దిగి ఎస్. రామాపురంలోకి వెళ్ళడం కరెక్టే. గమనించగలరు.
- ఇట్లు పాఠకుడు పుల్లారావు
ఈ ఉత్తరం కూడా అచ్చయ్యింది.
వెంటనే మరో ఉత్తరం వచ్చింది.
ఎడిటర్ జీ - 'బస్సు ప్రయాణం' కధ మీద నాకు తెలిసింది నేను చెప్పకపోతే క్షంతవ్యుడిని కాదని ఈ లేఖ రాస్తున్నాను. ఎస్. రామాపురంకు ఆర్టీసీ బస్సు గానీ, ప్రయివేటు బస్సు గానీ లేవు. ఉన్నదల్లా ఒక సెవెన్ సీటర్ అటో. అది ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు లోపల మూడు ట్రిప్పులు , మధ్యాహ్నం రెండు నుంచి ఆరు లోపల మూడు ట్రిప్పులు తిరుగుతుంది. ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆ సెవెన్ సీటర్ అటో నాదే. దాని డ్రైవర్ ని కూడా నేనే . గమనించగలరు.
- ఇట్లు పాఠకుడు పుల్లానంద్.
మూడు ఉత్తరాలు చూసిన తర్వాత ఆవేదనతో మరో ఉత్తరం వచ్చింది.
ఎడిటర్ గారూ నమస్కారం. ఈ లేఖను 'బస్సు ప్రయాణం' పాఠకుడు పుల్లానంద్ కోసం రాస్తున్నాను. నాకు తెలుసు, అయన మైక్రో ఫైనాన్స్ ద్వారా లోను తీసుకుని సెవెన్ సీటర్ అటో కొని ఉంటారు. ఆ లోను కట్టలేక, అటో నడపలేక, ఆత్మహత్య చేసుకోలేక అయన ఎన్ని బాధలు పడుతున్నారో ఊహించగలను. ఒక్క పుల్లానంద్ గారనే కాదు. రాష్ట్రం మొత్తమే మైక్రో ఫైనాన్స్ చేతుల్లో ఉంది. ఇందుకు ప్రభుత్వానిదే భాద్యత. ముఖ్యమంత్రి రాజీనామా చేయడం కనీస భాద్యత.
-ఇట్లు పాఠకుడు పుల్లనిరాశన్
ఇదచ్చయ్యాక చాలా ఉత్తరాలు వచ్చాయి. వాటిలో ఒకటి -
ఎడిటర్ గారూ 'బస్సు ప్రయాణం ' చదివి పుల్లనిరశన్ గారు వ్యక్తం చేసిన భావాలు పరిమితస్థాయికి మించలేదని నాకు అనిపించింది. అసలు మన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో మెతక వైఖరి అవలంబించడం వల్లే మనం, మన దేశం ఈ దుర్గతిలో ఉన్నాం. ఆ మాట కొస్తే మన విదేశీ వ్యవహారాలు అంత సజావుగా ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. మనం శ్రీలంకతో స్నేహంగా, చైనాతో వ్యూహాత్మకంగా, రష్యాతో ఆలోచనా పూరితంగా, నేపాల్ తో సాలోచనాభరితంగా, కొరియాతో అంటీముట్టనట్టుగా , రువాండాతో చూసీ చూడనట్టుగా, నైజీరియాతో లెక్కలేనట్టుగా, క్యూబాతో తీసికట్టుగా , సౌదీ అరేబియాతో జతకట్టుగా, జపాన్ తో కనికట్టుగా, అమెరికాతో తాకట్టుగా వ్యవహరించినంతకాలం మనకు ఈ బాధలు తప్పవు. దీనికి బాధ్యులైనవారందరూ రాజీనామా చేయడమే కాదు అసలు దేశమే విడిచిపెట్టి పోవాల్సిందిగా నా మాటగా నేను చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను.
-ఇట్లు పుల్లనరసింహ
అయితే ఆ వెంటనే ఒక స్త్రీ పక్షపాత రచయిత్రి నుంచి కొరియర్ వచ్చింది.
మిస్టర్ ఎడిటర్ - హయ్ 'బస్సు ప్రయాణం' మీద జరుగుతున్నా గొడవ చూస్తున్నాను. 'కలకంట కంట కన్నీరోలికిన వేళ' అన్నారు. ఎక్కడ స్త్రీ కన్నీరు కారుస్తుందో అక్కడ ఇలాంటి సమస్యలే తాండవిస్తాయి. అసలు 'బస్సు ప్రయాణం' కధలోనే ఎంతో పురుషాహంకారం ఉంది. హీరో బస్సు దిగి ఎస్. రామాపురంలోకి వెళ్ళినట్లు రచయిత రాశారు ఏం? హీరోయిన్ బస్సు దిగి పి. సీతాపురంలోకి వెళ్ళినట్లు రాస్తే అయన సొమ్మేం పోయేది?
జె. లావణ్యపురం. కె. పద్మాపురం, ఎస్. మల్లేశ్వరీపురం.... ఎన్ని లేవు? ఇటువంటి సంకుచిత దృష్టి, దుర్బుద్ది మగవారిలో నశించాలని కోరుకుంటున్నాను. ఇందుకు వీలైతే శాంతా బయోటెక్స్ వారు గాని, రెడ్డి ల్యాబ్స్ వారు గాని అల్లోపతిలో వీలుగాక పొతే చరక్, డాబర్ , చింతలూరు అయిర్వేద నిలయంవారు గాని సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు కనిపెట్టి మగవారి అహంకారాన్ని అణిచివెయవలసిందిగా కోరుతున్నాను.
-ఇట్లు పాఠకురాలు , రచయిత్రి డా|| పుల్ల కుసుమిత
ఈ ఉత్తరం కూడా అచ్చేసి , ఆఖరున బస్సు ప్రయాణం కధ రాసిన రచయిత స్పందన వేశారు.
పాఠకులకు - నమస్తే . అయ్యా! ఏదో ఒక కధ రాస్తే దానిని మీరంతా చదివి హాయిగా కాలక్షేపం చేస్తారనుకున్నాను. కానీ, నా యొక్క ఈ కధ వల్ల పైనాన్స్ సమస్యలు చెలరేగి, జెండర్ రాజకీయాలు పెట్రేగి , విదేశీ సమస్యలు పెచ్చరిల్లే పరిస్థితి వస్తుందనుకోలేదు. ఇక మీదట నేను కధలు రాయను. రాసినా పత్రికలకు పంపను . సెలవు.
-ఇట్లు రచయిత పుల్ల భద్రం.
కధ ముగుస్తుంది. నవ్వీ నవ్వీ వచ్చే కన్నీళ్ళను తుడుచుకోవడం మన వంతవుతుంది.
ఉత్తరాలను చాలామంది కధకులు చాలా సీరియస్ కధా వస్తువుల కోసం వినియోగించుకున్నారు. కానీ రచయిత ప్రసన్న కుమార్ సర్రాజు వాటిని హాస్యానికి ఉపయోగించుకొని మన గడపల మీద బోలెడన్ని నవ్వులని పోస్ట్ చేసి పోతారు.
పాఠకులు తలుచుకోవాలే గానీ ఏ విషయమైనా ఈకకు ఈకా పీకకు పీకా చేయగలరు. శార్దూలం నుంచి హోందోళానికి వెళ్ళగలరు. క్యా హువా తేరా వాదాను చిత్తురూ నాగయ్య చేత పాడించగలరు. కనుక వాళ్ళ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అని రచయితను, ఎడిటర్లను హెచ్చరించే నవ్వుల కధ ఉత్తర క్షేత్రం.
దీనిని చదివి ఊరుకోండి. అంతే తప్ప మీరూ కార్డు ముక్క రాసి పడేయకండి అండర్ స్టాండ్?
-(సాక్షి ఫ్యామిలీ)
(నూరేళ్ళ కధకు 'సాక్షి' సలాం' శీర్షికలో నా కధ 'ఉత్తరక్షేత్రం' గురించి చాలా గొప్పగా కధ అల్లి మరింత సెటైర్ పేల్చి రచయితగా నా ఇమేజిని ఇంకో బెత్తెడు పెంచి చక్కగా నవ్వించిన ఖదీర్ బాబుగారికి
కృతజ్ఞతలు - ప్రసన్న కుమార్ సర్రాజు )
* * *
