Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 31


                                      అబ్రహాం లింకన్

    అప్పుడే సాయంకాలం అయింది. పది పన్నెండేళ్ళ బాలవిద్యార్థి ఒకడు గురువుగారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆచార్యుడు ఆప్యాయంగా ఆ బాలుడి మాటలు ఆలకిస్తున్నాడు.
    "గురుదేవా! తమ దగ్గర ఉన్న "జార్జి వాషింగ్టన్ జీవిత చరిత్ర" నాకు ఒక్కమాటు ఇవ్వండి. రెండురోజుల పాటు జాగ్రత్తగా చదువుకొని తిరిగి తెచ్చి ఇస్తాను. పుస్తకం మాత్రం పువ్వులలో పెట్టి భద్రంగా ఉంచుతాను" అని గురువుగారైన క్రాఫర్డ్ మహాశయుని ప్రార్థించాడు. బాల విద్యార్థి అబ్రహాం లింకన్.
    అబ్రహాం లింకన్ అమెరికాదేశంలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతడు చిన్నతనంనుంచీ శ్రద్ధా భక్తులతో చదువుకుంటూ ఉండేవాడు. ఎంత కష్టపడి అయినా సరే, ఎవరి దగ్గరినుంచి అయినాసరే మంచి పుస్తకాలు సంపాదించి చదివేవాడు. ఎవరికైనా బహుమానాలు ఇవ్వాలన్నా, పుచ్చుకోవాలన్నా అన్ని వస్తువులకంటే పుస్తకాలే తగినవని అతడు అనుకుంటూ ఉండేవాడు. మంచి పుస్తకాలకంటే ఈ ప్రపంచంలో అమూల్య వస్తువులు లేనే లేవని అతని ఉద్దేశం. అందువల్లనే అతడు తన పుస్తకాలను ప్రాణ సమానంగా చూచుకొనేవాడు. ఏ పుస్తకమైనా సరే చెక్కు చెదరకుండా అట్టలు నలగకుండా ముద్దుగా ముచ్చటగా ఉంచేవాడు. అతని దగ్గర క్రొత్త పుస్తకాలు పాతపడవని అందరూ మెచ్చుకుంటుండేవారు.    
    అటువంటి అబ్రహాం లింకన్ పుస్తకం ఇమ్మని అడగడం వల్ల క్రాఫర్డ్ మహాశయుడు చాలా చిక్కుల్లో పడ్డాడు. పరుల చేతులలో పడిన పుస్తకాలు తప్పకుండా చెడిపోతాయని ఆయనకు తెలుసు. అందులో అమూల్య గ్రంథాలు అడిగిన వాళ్లందరికీ ఇస్తూవుంటే చివరికి అట్టలు మాత్రమే తిరిగి వస్తాయని అతని విశ్వాసం. ఇతరులెవరైనా అడిగితే క్రాఫర్డ్ మహాశయుడు "పుస్తకం ఇవ్వను" అని ఖండితంగా చెప్పి వుండేవాడే! కాని ఇప్పుడు అడుగుతున్నవాడు తన శిష్యుడు అబ్రహాం లింకన్. పాపం! లింకన్ తండ్రి చాలా బీదవాడు. అందువల్ల అతడు పుస్తకాలు సొంతంగా కొని చదువుకోలేడు. కాని చదవాలనే శ్రద్ధాసక్తులు కలవాడు లింకన్. గురువుమీద భక్తీ, చదువుమీద ఆసక్తీ ఉన్న ఉత్తమ బాలుడు అతడు. అటువంటి అబ్రహాం లింకన్ నోరు తెరచి పుస్తకం కావాలని అడిగాడు. మరి తాను కాదనటం ఎలాగా? ఆలోచనలో పడ్డాడు క్రాఫర్డ్ మహాశయుడు.
    కొంతసేపటికి ఆయన "చూడు లింకన్! నేను పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వనని నీకు తెలుసు. అయినా నువ్వు అడుగుతున్నావు కనుక తప్పనిసరిగా ఇస్తున్నాను. ఇది చాలా అమూల్యమైన గ్రంథం! ఇప్పుడు ఎక్కడా దొరికేది కాదు. కనుక నీవు దీనిని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నలగకుండా చక్కగా శుభ్రంగా ఉంచాలి. నేను ఇచ్చిన పుస్తకం ఇచ్చినట్లు ముచ్చటగా తెచ్చియివ్వాలి. సరేనా!" అంటూ అతనికి బీరువాలోని పుస్తకం అందించాడు.
    లింకన్ వినయంగా పుస్తకం అందుకుంటూ "అలాగేనండీ! చాలా జాగ్రత్తగా చదువుకుంటాను. పుస్తకాన్ని ప్రాణప్రదంగా చూచుకుంటాను. మళ్లీ రెండు మూడు రోజులలో తెచ్చి ఇస్తాను. ఈ పుస్తకం ఏమాత్రం చెడిపోయినా మీరు వేసిన శిక్ష అనుభవిస్తాను" అని పలికాడు. 'అలాగే వెళ్లిరా" అన్నాడు క్రాఫర్డ్ మహాశయుడు. లింకన్ "వాషింగ్టన్ జీవితచరిత్ర"ను చేతపట్టుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాడు.
    సంధ్యా సమయం అయింది. అబ్రహాం లింకన్ గబగబా భోజనం చేశాడు. దీపం ముందు కూర్చుండి పుస్తకం చదవటం మొదలుపెట్టాడు. రాత్రి ఎనిమిది గంటలయింది. లింకన్ శ్రద్ధగా పుస్తకం చదువుతున్నాడు. తొమ్మిది గంటలయింది. లింకన్ అలాగే చదువుకుంటున్నాడు. పది గంటలయింది, లింకన్ పుస్తకం ముందునుంచి లేవలేదు. పదకొండు గంటలయింది. లింకన్ పుస్తకం చదువుతూనే ఉన్నాడు. "అమెరికా అధ్యక్షుడైన జార్జివాషింగ్టన్ జీవిత చరిత్ర! అబ్బ! ఎంత విలువైన గ్రంథం! జార్జి వాషింగ్టన్ ఎంత దయామయుడు! ఎంత సత్యవాది! ఆయన జీవితం అద్భుతమైనది. ఆయన ప్రవర్తన ప్రపంచానికి ఆదర్శమైనది. ఆయన పరోపకార పరాయణుడు! ఉదార గుణ సంపన్నుడు! అంత గొప్పవాడు కనుకనే ఆయనను "అమెరికా పిత" అని ప్రజలంతా ప్రశంసిస్తూ ఉంటారు" అనుకున్నాడు అబ్రహాం లింకన్.
    అంతలో అర్థరాత్రి కావటంవల్ల లింకన్ కు నిద్ర ముంచుకు వచ్చింది. "అర్థరాత్రి ఇంకా చదువులేమిటిరా?" అన్నాడు తండ్రి. "ఆరోగ్యం చెడిపోతుంది నాయనా!" అన్నది తల్లి. కళ్లు మూతలు పడుతున్నాయి. లింకన్ పుస్తకం మూసి ప్రక్కన ఉన్న కిటికీలో భద్రంగా పెట్టాడు. చదివిన సంగతులే ఆలోచిస్తూ లింకన్ దుప్పటి కప్పుకున్నాడు. కొంచెంసేపటికి అతనికి బాగా నిద్రపట్టింది. అప్పుడే తెలతెలవారుతూ ఉన్నది. అబ్రహాంలింకన్ ఉలిక్కిపడి లేచాడు. పుస్తకం కోసం గబగబా కిటికీ దగ్గరకు వెళ్లాడు. పాపం! పుస్తకం చూచేసరికి అతని కళ్లు తిరిగిపోయాయి. ఆ రాత్రి అంతా బ్రహ్మాండమైన వర్షం కురిసింది. ఆవాన జల్లుకు తలుపులు తెరచి ఉన్నందువల్ల కిటికీలో ఉన్న పుస్తకం ముద్దముద్దగా తడిసిపోయింది. అందంగా వేసివున్న అట్టలన్నీ నీళ్లలో నానిపోయాయి. పుస్తకం అంతా మట్టికొట్టుకొని పాడైపోయి ఉన్నది.
    ఈ దృశ్యం చూడగానే లింకన్ గుండెలు దడదడలాడాయి. అతని చెవులలో గురువుగారి మాటలు గింగురుమంటున్నాయి. గురువుతో పుస్తకం చెక్కుచెదరకుండా తెచ్చి యిస్తానని తాను వాగ్దానం చేసి వచ్చాడు. ఇప్పుడు మరి ఆయనకు ఏమని సమాధానం చెపుతాడు? అంత మంచి పుస్తకం ఈవిధంగా పాడుచేసి గురువుగారికి ముఖం ఎలా చూపిస్తాడు? లింకన్ కు పట్టరాని దుఃఖం వచ్చింది. అతడు గ్రుడ్లనీరు గ్రుడ్లకుక్కుకుంటూ చాలాసేపు పుస్తకం పట్టుకొని నిర్విణ్ణుడై నిలబడ్డాడు.
    "జరుగరాని పని జరిగిపోయింది. ఇక ఈ విధంగా గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏమున్నది!" అనుకున్నాడు అబ్రహాం లింకన్. అతడు పుస్తకం అంతా పరిశుభ్రంగా తుడిచాడు. తడిసిపోవటం వల్ల పడ్డ ముడతలన్నీ సవరించాడు. పుస్తకం చేతబట్టుకొని మెల్లగా క్రాఫర్డ్ మహాశయుడి ఇంటి దగ్గరకు బయలుదేరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS