Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 30


                                         నెపోలియన్

    అది ఒక అందాల పూలతోట. ఆ తోటలో ఒక చక్కని బాట. ఆ బాట ప్రక్కన అన్నా చెల్లెలూ ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆ అన్న పేరు నెపోలియన్. చెల్లెలి పేరు ఇలాయిజా. అన్నా చెల్లెలూ ఆడుతూ పాడుతూ తోట బయటికి వచ్చారు. ఇలాయిజా అన్నకు అందకుండా కళ్లు మూసుకొని పరుగెత్తుతున్నది.
    అంతలోనే ఆ త్రోవన పోతున్న 'లిల్లీ' అనే ఒక చిన్నపిల్ల గంపనిండా నేరేడుపండ్లు పెట్టుకొని అటువైపే వచ్చింది. ఇలాయిజా ఆ పిల్లకు ఎదురుగా వచ్చి ఠకీమని 'ఢీ' కొట్టింది. లిల్లీ తలమీద పండ్లబుట్ట క్రింద పడిపోయింది. పండ్లన్నీ నేలమీద పడి చితికి దుమ్ము కొట్టుకొని పాడయిపోయాయి. లిల్లీ ఏడుస్తూ నిలబడ్డది. ఇలాయిజా కళ్లు తెరచి చూచింది. పడిపోయిన పండ్లబుట్ట చూడగానే ఆమెకు భయం కలిగింది.
    ఇలాయిజా రొప్పుతూ రోజుతూ అన్న చేతులు పట్టుకొని "నెపోలియన్! నెపోలియన్! మనం ఇక్కడనుంచి తొందరగా పారిపోదాం - పద. ఎవరైనా చూస్తే ఈ పండ్ల బుట్టను పడద్రోశామని చీవాట్లు పెడతారు - పద పద." అని అన్న చేయిపట్టుకొని లాగటం మొదలుపెట్టింది.
    నెపోలియన్ లిల్లీ వైపు జాలిగా చూస్తూ "తప్పు చెల్లీ! మనం ఆ విధంగా తప్పించుకొని పారిపోకూడదు. ఆ పిల్ల చూడు పాపం ఎలా ఏడుస్తున్నదో! అమ్ముకోటానికి ఆ పిల్ల తెచ్చుకుంటున్న పండ్లన్నీ మనవల్ల నేలపాలైపోయాయి. అందుచేత మనం ఆమెకు వాటి ఖరీదు కట్టిఇవ్వాలి. లేకపోతే వాళ్ళ అమ్మ ఆ పిల్లను పట్టుకొని కొట్టదూ!" అన్నాడు. అన్నా చెల్లెలూ ఇద్దరూ పడిపోయిన పండ్లలో పనికివచ్చేవన్నీ ఆమెకు ఏరి ఇచ్చారు. శుభ్రంగా దుమ్ముదులిపి తుడిచి పెట్టారు. కాని చాలా పండ్లు చితికిపోయి పాడైపోయాయి.
    అందుకోసం లిల్లీ కళ్లునలుపుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది. "నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి అమ్మతో ఏమని చెప్పేది? ఆ పండ్లు తీసుకువెళ్లి అమ్ముకుంటే రోజూ లాగానే ఆరు నాణాలు వచ్చేవి. ఇంతలో ఈ పిల్ల అడ్డంవచ్చి పడద్రోసింది. ఇక ఈ మట్టికొట్టుకున్న పాడుపండ్లు ఎవరు మాత్రం ఎలా కొంటారు? నాకు డబ్బు ఎలా వస్తాయి? డబ్బులు లేకపోతే అమ్మ నాకు అన్నం ఎక్కడ తెచ్చి పెడుతుంది?" అని వెక్కి వెక్కి ఏడవసాగింది లిల్లీ.
    నెపోలియన్ మెల్లగా ఆ పిల్ల దగ్గరకు వెళ్లాడు. "ఏడవకమ్మా! ఏడవకు. నీ నేరేడు పండ్ల డబ్బులు నేను ఇస్తాను. తీసుకొని వెళ్లి మీ అమ్మకు ఇవ్వు. సరేనా!" లిల్లీని గడ్డం పట్టుకొని బ్రతిమాలాడు నెపోలియన్. అతడు తన జేబులోనుంచి మూడు వెండినాణాలు బయటకు తీశాడు. అవి లిల్లీకి అందిస్తూ "ఇందమ్మా! ఈ డబ్బులు తీసుకో. మా అమ్మగారు ఈ నెల ఖర్చుకోసం నా సొంతానికి ఇచ్చిన డబ్బులు ఇవి. ఇప్పటికి ఇవి తీసుకొని మాతోబాటుగా ఇంటికిరా. మిగిలిన డబ్బులు అమ్మనడిగి ఇప్పిస్తాను" అన్నాడు నెపోలియన్. లిల్లీ మూడు నాణాలు తీసుకొని తన గౌను జేబులో దాచుకున్నది.
    అంతలో ఇలాయిజా కళ్లు పెద్దవి చేస్తూ "ఈ విధంగా ఇచ్చిన డబ్బులు అప్పుడే ఖర్చుచేశామని అమ్మకు తెలిస్తే మనకు మూడు రోజులదాకా అన్నం పెట్టదు. పాలు ఇవ్వదు. మనం ఉత్తరొట్టెముక్కలు తిని పడుకోవలసిందే! తెలుసా!" అన్నది. నెపోలియన్ నిస్సందేహంగా "అవును అంతే! మనం అలాగే ఉందాము. మరి ఆ అమ్మాయి పండ్లు పాడైపోతే ఖరీదు కట్టి ఇవ్వనక్కరలేదా! మన వినోదం కోసం మరి వాళ్లకు అన్నం లేకుండా చేస్తామా?" అన్నాడు నెపోలియన్. ఇలాయిజా మారు మాట్లాడకుండా ఊరుకున్నది. అంతలోనే అక్కడికి ఒక దాసి పరిగెత్తుకొని వచ్చింది.
    "సరిసరి. నేను మీకోసం తోటంతా వెదికాను. మీరు ఇక్కడ ఉన్నారా! అన్నా చెల్లెలూ ఇంత చీకటి పడుతున్నా ఇంటికి చేరలేదని అమ్మగారు చాలా కోప్పడుతున్నారు. మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకురమ్మని పంపారు" అన్నది దాసి. అన్నా చెల్లెలూ లిల్లీ దాసీ నలుగురూ ఇంటికి బయలుదేరారు. దాసీ ఆ కొత్తపిల్లను చూచి "ఈ పిల్ల ఎవరూ? మన వెంటబడి వస్తున్నది?" అని అడిగింది. "ఈ పిల్ల పేరు లిల్లీ. మనం ఈమెకు కొంచెం డబ్బులు ఇవ్వాలిలే! ఈ అమ్మాయి నేరేడు పండ్లు మేము పాడుచేశాము. అందువల్ల వాటి వెల ఇప్పిద్దామని అమ్మ దగ్గరకు తీసుకు వస్తున్నాము" అన్నాడు నెపోలియన్.
    ఇంటిముందు "మేడం లిటీసియా" పిల్లల కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నది. అంతదూరంలోనే లిటీసియా వాళ్లను చూచి "ఏమే ఇలాయిజా! అన్నయ్య ఒక్కడూ వెళితే ఎప్పుడూ వేళకు తిరిగి వస్తాడు. నువ్వు వెంబడి ఉన్నావో ఇక ఇంటి ధ్యాస ఉండదు. అసలు నేను మిమ్మల్ని తోటదాటి బయటకు వెళ్లవద్దని చెప్పలేదూ? మరి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు? ఏమి చేస్తున్నారు? ఇలా అయితే రేపటినుంచీ మిమ్మల్ని గడపదాటి బయటకు పోనివ్వను తెలిసిందా?" అని పెద్దగా గద్దించి అడిగింది.
    ఇలాయిజా కిక్కురుమనకుండా అన్న వెనక నక్కి నక్కి ఊరుకున్నది. నెపోలియన్ "అమ్మా! ఇందులో చెల్లాయిదేమీ తప్పులేదే! దానినేమీ అనకు. నేను దానిని అలా తోట వైపుకు తీసుకొని వెళ్లాను. అందువల్ల కొంచెం ఆలస్యమైంది అంతే." అని పలికాడు. అంతలోనే ఇలాయిజా "లేదమ్మా! అలాకాదు. నావల్లనే యింత ఆలస్యం జరిగింది. నేను కళ్లుమూసుకొని పరుగెత్తుతూ ఈ పండ్ల పిల్లతో ఢీకొట్టాను. పండ్లన్నీ క్రిందపడి పాడైపోయాయి. ఆ నష్టం అంతా మనమే ఇచ్చుకోవాలని ఆ అమ్మాయిని యిక్కడకు పిలుచుకొని వచ్చాడు అన్నయ్య" అని ఒక్క గుక్కలో నొక్కి నొక్కి చెప్పింది.
    "అవునమ్మా! అందుకే ఈ పిల్లను యిక్కడకు పిలుచుకొని వచ్చాను" అన్నాడు నెపోలియన్. "అయితే ఇటువంటి దండుగ ఖర్చులన్నీ ఇచ్చుకోవటానికి మీరు దాచిన డబ్బేమీ నాదగ్గరలేదు. ఈ పిల్లకు ఎలా యిద్దామనుకున్నారు?" అన్నది తల్లి.
    అప్పుడు నెపోలియన్ "అది కాదమ్మా! యిప్పుడు నీవు కొంచెం సహాయం చేయాలి. అంతేగాని దండుగ ఖర్చేమీ ఇచ్చుకోనక్కరలేదు! ఈ అమ్మాయికి మేము ఆరు నాణాలు బాకీ పడ్డాము. అందులో మూడు నాణాలు ముందుగానే యిచ్చాను. యికపై నెలలో సొంత ఖర్చుకోసం నాకిచ్చే మూడు నాణాలు ఇప్పుడు ఇవ్వు. ఈ పిల్లకు పాపం పండ్ల ఖరీదు సాంతం యిచ్చి పంపిస్తాను. పై నెల అంతా నేను అన్నీ మానుకుంటాను. ఏమీ కొనుక్కొని తినకుండా ఒట్టి రొట్టెముక్కలతోనే కాలం గడుపుతాను. సరేనా అమ్మా!" అని అడిగాడు.
    తనయుని ధర్మబుద్ధికి తల్లి చాలా ఆనందించింది. అడిగిన ప్రకారం నెపోలియన్ కు మూడు నాణాలు తీసి అందించింది. నెపోలియన్ వాటిని లిల్లీ చేతులలో పెడుతూ "అమ్మాయి యివిగో! ఈ డబ్బులు కూడా తీసుకో. వీటితో నీ పండ్ల ఖరీదు నీకు వచ్చినట్లే! ఇంక మీ అమ్మ నిన్ను ఏమీ అనదు. నీవు నిర్భయంగా ఇంటికి వెళ్ళు" అని ఆమెను ఇంటికి పంపించాడు.
    కొడుకు ఔదార్యానికి లిటీసియా ఆనంద పరవశురాలైంది. ఆమె కన్నబిడ్డను కౌగలించుకొని "నెపోలియన్! నీవు మహా పురుషుడవు అవుతావు నాయనా! నీ ధర్మబుద్ధి నిన్ను మహావీరుణ్ణి చేస్తుంది! నీ దయాగుణం నిన్ను ప్రపంచ ప్రసిద్ధుణ్ణి చేస్తుంది! నీవు వీరాధి వీరుడవై విజయమూర్తివి అవుతావు!" అని ప్రేమ పూర్వకంగా ఆశీర్వదించింది.

                                         *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS