Previous Page Next Page 
ప్రతీకారం పేజి 30


    ఒక్కసారిగా నిండు కుండ బద్దలైనట్లు రెండు చేతులతో ముఖం కప్పుకుని భోరున ఏడ్చింది. జగన్నాథం అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. రవి చివ్వున లేచి ఇందిర దగ్గరకు వచ్చి ఓ క్షణం నిల్చున్నాడు.
    "ఛ ఏమిటి ఇందూ! నువ్వింత పిరికిదానివనుకోలేదు. నువ్వూ అందరు ఆడపిల్లల్లాంటి దానివే అన్నమాట! పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం నీకు ఉందనుకున్నాను" అంటూ ఆమె రెండు చేతులూ ముఖంమీద నుంచి తొలగించాడు.
    ఇందిర రవి చేతులు చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "ఊరుకో ఇందూ! ఇంకా పదిహేను రోజుల టైం వుందిగా ఈ లోపల సాక్ష్యులు దొరక్కపోరు. నాన్నగారు చూడు ఎలా అయిపోతున్నారో? ఆయనకు ఎలా ధైర్యం చెప్పాలో తెలియక కుమిలిపోతున్నాను! నువ్వు కూడా ఇలా అయితే నేనేం కావాలి ఇందిరా?" రవి కంఠం వణికింది.
    ఇందిర కళ్ళు తుడుచుకుంది. రవి ముఖంలోకి చూసి నవ్వటానికి ప్రయత్నించింది. మళ్ళీ కళ్ళను నీటి పొరలు కప్పివేశాయి. ఏడుస్తూ నవ్వడం...ఎంత దారుణంగా గుండెలని పిండేస్తుందో చూసిన వారికే తెలుస్తుంది.

                                             24

    రాత్రి పదిన్నర అయింది. ఇందిర రేడియో ముందు కూర్చుని శ్రద్ధగా ఎనౌన్స్ మెంటు వింటూ వుంది. ఎనౌన్స్ మెంటు వస్తూ వస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇందిరకు ఎవరో పీక నొక్కేసినట్టయింది. తలెత్తి చూసింది. రేడియో దగ్గర నిల్చుని వుంది. ఇందిరకు పిచ్చికోపం వచ్చింది. ఒక్కసారిగా లేచి నిల్చుంది.
    "రేడియో ఎందుకు ఆపేశావు?" దాదాపు అరిచింది.
    "పది దాటిపోయింది. ఇంకా రేడియో వింటూ కూర్చున్నావు! ఆరోగ్యం పాడయిపోతుంది. ఇంక పడుకో?"
    ఇందిరకు దుఃఖం పొర్లుకొచ్చింది.
    "పొద్దుటినుంచీ ఈ ఎనౌన్స్ మెంటు వినాలనీ, పదిన్నర ఎప్పుడౌతుందా అని నిమిషం ఒక యుగంలా ఎదురుచూశాను. చివరకు వినకుండా చేశావు?" ఇందిర కంఠం గరగరలాడింది.
    "ఏమిటే నీ పిచ్చి! పదివేలు కోసమేనా ఈ ఆరాటమంతా! నీకు ఇప్పుడు తక్కువేమయ్యిందే? ఈ ఆస్తంతా నీది కాదూ? వున్నది చాలదూ? నువ్వు సంపాదించాలా?"
    "అమ్మా! డబ్బు కోసం కాదమ్మా!" ఏడుపు గొంతుతో అన్నది ఇందిర.
    "మరెందుకే! కేసు గెలిచి పేరు సంపాదించాలనా? వెధవ కేసు పోతేపోయింది. అనవసరంగా ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. ఈ కేసు వద్దూ, పాడూ వద్దు. రేపే వెళ్ళి డ్యూటీలో చేరు?" అంది రాధాదేవి అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు.
    ఇందిర రెచ్చిపోయింది. "నువ్వు అనవసరంగా ఈ విషయంలో కలిగించుకోకు. నేను ఈ కేసు చేస్తున్నది పదివేల కోసమూ కాదు... పేరు కోసమూ కాదు?"
    "మరెందుకోసం? ఎవరికోసం యింత శ్రమపడుతున్నావు?" రాధాదేవి కోపంగా అడిగింది.
    "ఎవరికోసమో కాదు. నా కోసమే! నా సుఖంకోసం నా భవిష్యత్తుకోసం! నా జీవిత సర్వస్వం కోసం నా నూరేళ్ళ జీవితం అమ్మా?" అన్నది ఇందిర ఆవేశంగా.
    రాధాదేవికి గుండెలని ఎవరో పిండేస్తున్నట్టుంది. బాధను అణచుకుంటూ "ఏమిటే వాగుడూ నువ్వూ! ఈ బోడి కేసు చెయ్యకపోతే నీ జీవితానికి వచ్చే నష్టం ఏమీలేదులే" అన్నది రాధాదేవి, ఆమె కంఠంలో దుఃఖం, ఆవేశం ఒకదాన్ని ఒకటి ఒరుచుకున్నాయ్.
    "నన్ను అర్థం చేసుకో అమ్మా! ఈ కేసుతో నా నూరేళ్ళ జీవితం ముడిపడివుంది" ఇందిర చిన్నగా తనకుతానే చెప్పుకుంటున్నట్టు అన్నది.
    రాధాదేవి గుండెలు చిక్కబట్టాయి. ముఖం బాధతో మెలికలు తిరుగుతోంది.
    తను ఊహించింది అక్షరాల నిజం! ఇందిర రవిని ప్రేమిస్తోంది. భగవాన్! ఏమిటి తనకీ దారుణ పరీక్ష!
    "అమ్మా నేను ఈ కేసు గెల్చి తీరాలమ్మా! నన్ను దీవించమ్మా!" అన్నది ఇందిర దుఃఖంతో పూడుకుపోయిన కంఠాన్ని అతి కష్టం మీద పెగల్చుకుంటూ.
    రాధాదేవి ఇందిర తలమీద చెయ్యి వుంచింది. కాని దీవించలేకపోయింది. "తప్పక గెలుస్తావు తల్లీ!" అనాలనుకుంది. కాని ఆ మాటల్ని ఎవరో కంఠంలోనే నొక్కేసినట్టు ఉక్కిరిబిక్కిరి అయింది.
    "పడుకో!" అని మాత్రం అతికష్టంమీద అనగలిగింది.
    "అమ్మా! ఇవాళ నా మనసేం బాగాలేదమ్మా! చిన్నప్పుడు పాట పాడేదానివి. ఆ పాట పాడమ్మా! చాలా అలసిపోయాను. నీ పాట వింటూ అన్నీ మర్చిపోయి నిద్రపోతాను"
    రాధాదేవి గుండె చెరువయింది. కళ్ళలో నీరు తిరిగింది. కూతురి తల దగ్గిర కూర్చుని నిమరసాగింది. పాట వింటూ ఇందిర నిద్రలోకి జారిపోయింది.
    రాధాదేవి ఒక్క ఉదుటున తన గదిలోకి వెళ్ళిపోయింది. భర్త ఫోటో ముందు నిల్చుని బావురుమంది.
    "నా బిడ్డ జీవితం నా చేతిలో వుంది. నా చేతులారా నా బిడ్డ గొంతు నులిమి వేస్తున్నాను. నా బిడ్డ జీవితం నాశనం కాకూడదు. దానికోసమే ఇంతకాలం గుండెల్లో అగ్నిపర్వతాన్ని దాచుకొని జీవించాను. వెళతాను. వెళ్ళి సాక్ష్యం ఇస్తాను. ఈ ఎదకోత నేను భరించలేను. ఈ పరీక్షలో నెగ్గే శక్తి నాకు లేదు. ఇలాంటి రోజు ఏ తల్లికి రాకూడదు" వెక్కిళ్ళ మధ్య పైకే అన్నది రాధాదేవి.
    కళ్ళు తడుచుకుంది. భర్త ఫోటోలో కోపం, తిరస్కారం కన్పించింది. అంతలోనే కళ్ళముందు అదే దృశ్యం చెవుల్లో అదే ఆర్తనాదం...అదే అట్టహాసం-ఆమె మహా అరణ్యం లాగ తగలబడసాగింది. క్రూర జంతువులు అరుస్తూ మంటలతో పోరాడుతున్నాయి. సాధు జంతువులు మలమల మాడిపోతున్నాయి. రాధాదేవి హృదయంలోని సున్నిత భావాలు ప్రతీకార జ్వాలలో దగ్ధం అయిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS