ప్రశాంత వాతావరణంతో గ్రామానికి చివరగా వున్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు విజయ్. టింకు సంరక్షణార్థం మంగ అనే పదహారు సంవత్సరాల అమ్మాయిని ఇంటిపని, వంటపనీ చేయటానికి పెట్టాడు. మంగ టింకును జాగ్రత్తగా చూస్తుంది. విజయ్ క్యాంపుకు వెళ్ళి రెండు మూడురోజులు రాకపోయినా టింకు అల్లరిచేయటం లేదు. మంగకు అలవాటైపోయాడు. విజయ్ కి ఇప్పుడు టింకు విషయంలో ఇబ్బందిలేదు. ఆ వూళ్ళో వున్న స్కూలులో టింకుని జాయిన్ చేశాడు.
రాయుడిపాలెంలో ఇదివరకు జరిగిన అమానుషాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నాడు విజయ్. ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయకుండా రచ్చబండ వద్ద పంచాయితీ చేయటం జరుగుతుంది. రాయుడి మాటే వేదవాక్కు. అతను చెప్పే పంచాయితీయే న్యాయం. ఏ నేరానికైనా రచ్చబండ పంచాయితీలో తప్పు వేయటం, కొంత నష్టపరిహారం వసూలు చేయటం జరుగుతుంది. రచ్చబండ పంచాయితీ రాయుడి ఇంటిపేరిటవాళ్లు ఆ వూళ్లో వున్నప్పటినుంచి వుంది. వాళ్ళనుండే ఆ వూరికి పేరు వచ్చిందని కొందరు చెబుతున్నారు.
అక్కడ ఆటవిక న్యాయం చలామణి అవుతున్నది. న్యాయం, ధర్మం, చట్టం అనేవి అసలు పరిగణలోనే లేవు. అంటే మరో ప్యారలల్ గవర్నమెంటుగా వుంది. అక్కడ వున్న ప్రతి డిపార్టుమెంటువాళ్ళు రాయుడితో కలిసిపోతే ఎవరి భాగాలు వాళ్ళకి పంచిపెట్టడం కూడా రాయుడి ఆనవాయితి. ఎదురుతిరిగినవాళ్ళని తనకు నచ్చిన మార్గంలో లొంగదీసుకోవటం రాయుడికి బాగా తెలుసు. రాయుడికి తల వంచలేమనుకున్నవాళ్లు ఆ వూరి నుండి బదిలీ చేయించుకుని వెళ్ళిపోతూంటారు.
రాయుడి వెనక ఆ వూరే కాదు, చుట్టుప్రక్కల వున్న పల్లెపట్టులలోని ప్రజలు కూడా వెన్నంటి వున్నారనటానికి నిదర్శనంగా అప్పుడప్పుడు అయినదానికి కానిదానికి రాయుడు బలబ్రదర్శనగా వూళ్ళలో ప్రజలతో వూరేగుతాడు.
పోలీసుస్టేషన్ లో కూర్చుని ఒక్కొక్క రికార్డు చూస్తూ ఆ వూరి చరిత్రను తెలుసుకుంటున్నాడు విజయ్.
పోలీస్ స్టేషన్ ముందునుండి నినాదాలతో స్త్రీలతో వూరేగింపు వెళుతోంది.
"భార్యను అమానుషంగా చంపిన భర్తను వెంటనే ఉరి తీయాలి. స్త్రీలకు రక్షణ కావాలి" అంటూ ఆ ప్రదేశం అంతా నినాదాలతో మారుమ్రోగుతోంది.
ఆ గుంపుకు ముందు రాయుడు అతని తాలూకు వ్యక్తులు వూరేగుతున్నారు. తన ఆధ్వర్యంలో ఊరేగింపు జరుగుతున్నట్లు అప్పుడప్పుడు గుంపు ముందు వుండి రాయుడు నినాదాలు ఇస్తున్నాడు.
విజయ్ కి విషయం అర్థం అయ్యింది. రాయుడు ఆ వూరికి కంసుడు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా రాయుడు రాజకీయరంగు పులిమి వూరి ప్రజలను రెచ్చగొట్టి వూరేగింపు పెడతాడని తెలుస్తుంది.
ఏ అవాంతరాలు జరక్కుండా గుంపు ముందు వెనుక కానిస్టేబుళ్ళను కొందర్ని పంపాడు విజయ్.
రాయుడి వెనుక అమాయకపు ప్రజలే కాక డబ్బు, పలుకుబడి, హోదా వున్నాయి. ప్రస్తుతకాలంలో రాయుడిని ఎదుర్కోవటం కష్టమే. ముందు ప్రజలలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని, చట్టంపట్ల గౌరవాన్ని పెంపొందించి రాయుడి మార్గం నుంచి వాళ్ళను మళ్ళించాలి. ప్రజలే రాయుడి అమానుషాలను త్రిప్పికొట్టాలి. పోలీసుస్టేషన్ లో రిపోర్టు ఇచ్చే ధైర్యం వాళ్ళల్లో కలగాలి. అలా వాళ్ళని చైతన్య వంతులుగా చేయాలని విజయ్ నిర్ణయించుకుని సిబ్బంది అందరికి తన ఉద్దేశం తెలియజేసి అందరి సహకారాన్ని కోరాడు.
విజయ్ వచ్చిన మూడు నెలలలో చాలావరకు గ్రామస్తులలో పోలీసు అంటే గౌరవభావం పెంపొందింది. వారి వారి హక్కులను కొద్దిగా తెలుసుకున్నారు. ఇప్పుడు గ్రామస్తులు స్వేచ్చ కోసం పరితపిస్తున్నారు. ఇన్నాళ్ళు రాయుడి తీర్మానాల వలన, అక్రమ పంచాయితీల వలన ఏం పోగొట్టుకున్నారో తెలుసుకున్నారు.
ప్రజలలో చైతన్యం వచ్చింది. క్రమంగా రాయుడి పరపతి తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఇన్ స్పెక్టర్ అన్నా అతని మాటన్నా గ్రామ ప్రజలకు వేదంలా వుంది.
ఆ వూరిలో పనిచేస్తున్న లేడీ డాక్టరు లత సహకారంతో ఒకసారి రక్తదాన శిబిరాన్ని, మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరాన్ని, మరోసారి ఉచిత కళ్ల పరీక్ష శిబిరాన్ని పెట్టించి అందరి ప్రశంసలు పొందాడు. గ్రామస్తులతో కలిసికట్టుగా సిబ్బందితో కలిసి ఊరి మురికివాడలను శుభ్రపరచే కార్యక్రమాన్ని, రోడ్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టాడు.
ఆ వూరిలో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా విజయ్ ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. విజయ్ అందరికీ ఆదర్శవంతంగా వున్నాడు. ప్రతివాళ్లు వారివారి పిల్లలని విజయ్ లా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతున్నారు.
