"సకల శాస్త్రాప్రమాణ ధురీణ డిండిమభట్టు"
చర్చలు మూడు రోజులు జరిగాయి. దుగ్గిన పరశురాముడై విజృంభించాడు. పలుమార్లు విద్యావైరిలో కొన్ని అల్లకల్లోలం చేశాడు. అనేక ప్రశ్నలు తలెత్తినప్పుడు తన శిష్యునివేపు సాలోచనగా చూస్తూ, అతనిచేత సమాధానాలు చెప్పించేవాడు శ్రీనాథయ్య. తను మాత్రం నిర్లిప్తుడై 'చింతామణి' జపిస్తూ కూర్చునేవాడు. అవసరమైనప్పుడు మాట్లాడటం ప్రారంభిస్తే ఆ దృశ్యం అమోఘంగా ఉండేది. ప్రౌఢదేవరాయుల ముఖవైఖరిని పరిశీలిస్తూ అతడు మాట్లాడుతున్నప్పుడు దేవేంద్రుణ్ని చూచి ఘీంకరిస్తున్న ఐరావతంలా ఉండేవాడు విభూతి రేఖలతో.
ఈ విధంగా శాస్త్ర చర్చలు రసపాకాన పడ్డాయి. పాకం ముదిరే వేళకు గౌడభట్టూ, రాజానాథుడూ నీరసించిపోయారు. దుగ్గన విజృంభించాడు. అతని నోటనుండి సరస్వతి ప్రవాహ వేగంతో జాలువారింది. ఎట్టకేలకు చంద్రభూష క్రియాశక్తి శ్రీనాథుడు జయాన్ని చేపట్టాడని ప్రకటించాడు.
ముమ్మకవి భట్టుల ముఖాలు మాడిపోయాయి. వారు తలలు వంచుకుని చల్లగా జారుకున్నారు.
శ్రీనాథయ్యను ప్రౌఢదేవరాయ క్షిత్రీందుడు కౌగలించుకుని ఆనందభాష్పాలను రాల్చాడు.
"కవిలోకరవీ! ఇప్పటివరకూ మీ పాండిత్య ప్రకర్షతో సరస్వతీ వర్షంలో మమ్ములను ముంచెత్తారు. ఇక మీ కవిత్వాన్ని పన్నీటిజల్లుగా మాపై కురిపించండి" అంటూ కోరాడాయన. శ్రీనాథుడు సీసం అందుకున్నాడు.
ఆయన సీసాలనడక అంతకుముందే లోకవిదితం. ప్రవాహ వేగంతో ఆయన అశువుగా పద్యాలను చదువుతూ ఉంటే ప్రౌఢదేవరాయలు, చంద్రభూషక్రియాశక్తి. ముమ్మకవి అరుణగిరి నాధ గౌడ మొదలైన సభ్యులంతా చకచ్చకీతులయ్యారు. ఆ ప్రవాహం అశువుగానే అరగంటసేపు సాగి ఆగిపోయింది. అది సరస్వతీ ప్రవాహం. ఆనాడు ఆంధ్ర సరస్వతి తెల్లని చల్లని చిరునవ్వులు విజయనగరమంతా నిండిపోయింది. తెలుగు తల్లి సరస్వతీ పతాక విజయనగర విను వీధుల్లో రెపరెపలాడింది. ప్రౌఢదేవరాయలూ, చందభూషక్రియాశక్తీ వరుసగా శ్రీనాధయ్యను కౌగలించుకుని సన్మానించారు.
ఆ మరునాడే కనకాభిషేకం!
ముత్యాలశాలలో అది కనుల పండుగ ఆంధ్ర గీర్వాణికి లోకం చేత నివాళులెత్తించిన శ్రీనాధయ్య కనక వర్షంలో సుస్నాతుడయ్యాడు.
ఆయనకు విందులు కూడా ఏర్పాటుచేశారు. చంద్రభూషక్రియాశక్తీ ప్రౌఢదేవరాయలూ శ్రీనాథయ్యా సహపంక్తిన కూర్చున్నారు. సానసీండ్లు వడ్డిస్తూ ఉన్నారు.
"శ్రీనాథయ్య కవిత్వంతోనే కడుపునిండిన మేము ఈ భోజనంతో ఉబ్బితబ్బిబ్బులౌతున్నాము" అన్నాడు చందభూషక్రియాశక్తి. ఆయన రవ్వంత పరిహాసశీలి.
సంభాషణ రుచికరమైన వంటకాల మీదకు పోయింది. తలకొక విధంగా వ్యాఖ్యానించారు. శ్రీనాథయ్య వంచిన తల ఎత్తకుండా భోజనం ముగిస్తున్నారు.
"శ్రీనాథయ్యగారు సరస్వతిని స్వరపేటికలో దాచి తలుపు మూశారేమి?" ప్రౌఢదేవరాయులు చమత్కరించారు.
"క్షితిపతీ! వాగ్దేవి ఒకరి పేటికలో ఒదిగి వుండేది కాదు. అయితే ఆమెకు తోడు లేకుండా రాణించదు" అన్నాడు. శ్రీనాథయ్య. ఆయన వినయ సంపత్తి! విస్తుపోయినా ఆ స్వరంలోని అసంతృప్తిని గ్రహించారు చంద్రభూష క్రియా శక్తి ప్రౌఢదేవరాయులు, "మీరు కోరదలచినదేమిటి?" అంటూ ప్రశ్నించారు.
"శ్రీనాథయ్యా! నీవు రూపు కట్టిన తెలుగు తనమే! తెలుగు సరస్వతి విజయపతాకను మా విద్యానగర విను వీధుల్లో ఎగురవేసిన మహామహుడవు. నీవు ఇచట నుండి అసంతృప్తితో వెళ్ళిపోరాదని మా కోరిక! సంశయించక చెప్పండి" అంటూ పొడిగించాడు ప్రౌఢదేవరాయలు.
"రాజా మేము కవులము. మాది కవి సామ్రాజ్యము. అక్కడ మేము ఏలికలమే కావచ్చు. కాని మా శాసనములు రాజ్యాంగ పరిధిలో చెల్లవలెననే నియమం లేదుకదా! వాయి విడిచి ఆపై వెర్రిని కావటం నాకు అంగీకారము కాదు. అందుకనే మిన్నకున్నాను" అన్నాడు శ్రీనాధయ్య.
శ్రీనాధయ్య గొప్ప అభిమాన ధనుడని అర్థమైంది.
"మీరేది కోరినా యివ్వటానికి సంసిద్ధులమే" అంటూ వాగ్దానం చేశాడు ప్రౌఢదేవరాయలు. శ్రీనాధయ్యకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక తన కార్యం సఫలమయ్యే సమయం ఆసన్నమైందని గ్రహించాడు.
ప్రభూ! మోటుపల్లి యుద్ధంలో చౌండవ నాయకుడు మా సోమదేవుని బందీగా పట్టి తెచ్చాడు. అతడభిమన్యునంతటి వీరుడు. అంతేకాదు కోమటి వేములకు కానున్న జామాత. ఈ కార్య భారాన్ని నెత్తిన వేసుకుని నేను విజయనగరం వచ్చాను. మీరు వాగ్దానం చేశారు కనుక ఆ పని నెరవేరినట్లే భావిస్తున్నాను" అన్నారు శ్రీనాధయ్య. ప్రౌఢ దేవరాయలకు కన్నులు చెమ్మగిల్లాయి ఔను! ఖడ్గ ప్రహారంతో పోయిన ప్రాణాలను ఘంటంతో తిరిగి రప్పిస్తున్నాడీయన! ఎంతటివాడు. చరిత్ర యింతటి చమత్కారిని, రాజభక్తుని ఏనాటికైనా మరువగలదా! ఇది రాజకీయంగా ఏ ఏ మలుపుకు దారితీస్తుంది. దీనివల్ల చౌండపనాయకునిలో ఏదైనా అసంతృప్తి బయలుదేరుతుందా మొదలైన విషయాలు ఆలోచిస్తూ "తధాస్తు" అనటానికి రవ్వంత ఆలస్యం చేశాడు ప్రౌఢదేవరాయలు. శ్రీనాధయ్య తినటం ఆపి__ "రాయలు కవిరాట్టును అవమానించ దలచారా?" అన్నాడు.
