రాజు భీమబలుడే కావచ్చును. కానీ మానవమాతృడే కదా మరి. అదేమో మదగజం!
తక్షణ ప్రమాదం తప్పించుకున్నాడు గానీ చాలాసేపు ఏనుగుని అట్లా పట్టుకుని ఆపి ఉంచడం అసంభవం అని రాజుకి తెలుసు.
ఆ తర్వాత ఏమవుతుంది ?
తనకేమయినా ఫర్వాలేదు.
సృష్టికి ఏమవుతుంది?
తను వెదకడానిక బయల్దేరిన తన చెల్లెలు యువ ఏమవుతుంది?
అతనికి రొప్పు వస్తోంది. చేతుల పట్టు తప్పుతోంది.
అంతిమ విజయం తనదేనని తెలుసు రోగ ఎలిఫెంట్ కి.
మెల్లిమెల్లిగా పట్టు జారిపోతోంది రాజుకి. ఏనుగు ఉత్సాహం ఎక్కువయింది.
పట్టు వదిలించుకుంది ఏనుగు.
మరుక్షణంలోనే
దాన్ని వెనుక నుంచి ఎవరో కుమ్మినట్లయింది.
తగలరాని చోట తగిలింది దెబ్బ. గింగరాలు తిరిగి కిందపడింది ఏనుగు.
ఇందాక తన చేత దెబ్బ తిని కిందపడిన ఏనుగు మళ్ళీ లేచి అక్కడ నిలబడి వుండడం కనబడింది దానికి.
పిచ్చి కోపంతో చెవులు చిల్లులు పడేలా అరిచింది.
ఆ తర్వాత
ఇప్పుడింక ఈ రెండు ఏనుగులూ తన మీద పడతాయేమో అనుకున్నాడు రాజు.
కానీ ---
చిత్రంగా --
రెండు ఏనుగులూ ఒక దానివైపూ ఒకటి అంచనా వేస్తున్నట్లుగా చూశాయి.
తర్వాత --
ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా గాయపడిన శరీరాలతో భారమైన అడుగులు వేస్తూ -- రెండూ కలిసి నిదానంగా చెట్ల వెనక్కి వెళ్ళి కనుమరుగయ్యాయి!
సృష్టి చెట్ల చాటునుంచి బయటికి వచ్చింది. ఏనుగులు వెళ్ళిన వైపే కళ్ళార్పకుండా చూస్తోంది ఆమె.
"అయితే అది నిజమే కావచ్చును " అంది కలలో మాట్లాడుతున్నట్లుగా.
ఏమిటన్నట్లుగా చూశాడు రాజు.
చాలాసేపు మౌనంగా ఉండిపోయింది సృష్టి.
ఆ తర్వాత అంది.
"ఏనుగుల శ్మశానం!"
"ఏనుగుల శ్మశానమా? అంటే?"
"పూర్తిగా నిర్ధారణ కాని విషయం ఉంది రాజూ! ఎనుగులన్నిటికీ ఒక కామన్ గ్రేవ్ యార్డ్ ఉంటుందనీ , చనిపోయే ముందు ఏనుగులు ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ తుది శ్వాస వదుల్తాయనీ అంటారు. అదే గనుక కనిపెట్టగలిగితే, అసంఖ్యాకమైన ఏనుగుల కళేబరాలు , లేదా ఆస్థిపంజరాల తాలుకూ దంతాలని సంపాదించి కోటీశ్వరులయిపోవచ్చునని చాలా మందికి కోరిక!"
"ఇప్పుడు తీవ్రంగా గాయపడిన ఈ రెండు ఏనుగులు వాటి సోకాల్డ్ శ్మశానానికే వెళ్ళి ఉంటాయంటావా?"
"మేబీ! అయి వుండవచ్చును " అంది సృష్టి.
విస్మయంగా చాలా సేపు ఆటే చూస్తూ ఉండిపోయాడు రాజు.
* * *
మళ్ళీ నడక మొదలెట్టారు.
ఓ అరగంట తర్వాత, చటుక్కున ఆగి, మాట్లాడ వద్దన్నట్లుగా సైగ చేసింది సృష్టి.
ఆమె చూపులని అనుసరించి తనూ అటువైపు చూశాడు రాజు.
అక్కడికి కొంత దూరంలో.
చిన్న మడుగు ఉంది.
మడుగు ఒడ్డున ఒక ఆకారం కూర్చుని దోసేళ్ళతో నీళ్ళు తీసుకుని తాగుతోంది.
జడలు కట్టిన జుట్టు.
మట్టికొట్టుకుపోయిన ఒళ్ళు.
బాగా పెరిగిన గోళ్ళు.
ఒళ్ళంతా బాగా హేయిరీగా ఉంది.
అలాగని చింపాంజీలకూ, గొరిల్లాలకూ ఉన్నట్లు దట్టమైన బొచ్చు కాదు.
ఎగ్జయిటేడ్ గా చూస్తోంది సృష్టి.
ఇంతలో ఆ ఆకారం లేచి నిలబడింది. అయితే, నిటారుగా నిలబడలేదు. నడుము పైభాగం ముందుకు ఒంగి వుంది. అట్లా సగం నిలబడి , సగం ఒంగి వున్న ఆ ఆకారం కొద్ది అడుగులు వేసింది.
తర్వాత ఆగి నేలమీదికి పరీక్షగా చూసి, ఒక రాయిని అందుకుంది.
ఇంకొక అడుగు వేసి, ఇంకో రాతిని అందుకుంది. ఒంగి కూర్చుని ఎండుటాకులు కొన్ని పోగు చేసింది.
రెండు రాళ్ళని చకచక ఒకదానికి ఒకటి రాయడం మొదలెట్టింది.
ఆ రాపిడికి ఒక నిప్పు రవ్వ వచ్చింది.
తర్వాత ఇంకో నిప్పురవ్వ . ఆ తర్వాత చాలా నిప్పు రవ్వలు.
నిప్పురవ్వలు ఎండుటాకుల మీద పడి అవి అంటుకుంటున్నాయి.
చూపుడు వేలు నోటి మీద పెట్టుకుని , నిశ్శబ్దం! అన్నట్లు హెచ్చరించింది సృష్టి.
తను రాజుకి జాగ్రత్త చెప్పింది గానీ, చెబుతూనే పాదం ఒక ఎండు పుల్ల మీద వేసింది. చిన్నగా చప్పుడు.
చప్పుడు వినగానే ఆ ఆకారం చటుక్కున వెనక్కి తిరిగింది. సృష్టి, రాజూ వున్న వైపు చూసింది. అచ్చంగా మనిషి చూసినట్లే ఉంది ఆ చూపు.
"ఎవరు మీరు ?" అన్న ప్రశ్న ఆ చూపులలో కనబడుతోంది.
ముందుకు అడుగు వేయబోయాడు రాజు.
అతన్ని భయపెట్టడానికా అన్నట్లుగా వికృతంగా అరుస్తూ , రెండు చేతులతో గబగబా తన రొమ్ము మీద కొట్టుకోవడం మొదలెట్టింది ఆ ఆకారం.
రాజు ఇంకో అడుగు ముందుకు వేశాడు.
తక్షణం ఆ ఆకారం లేచి వంకరటింకరగా నడుస్తూ , పొదల వెనక అదృశ్యం అయింది.
"అది మనిషా? కొతా?" అన్నాడు రాజు సందేహంగా.
"అది మనిషి కాదు. కోతి కాదు" అంది సృష్టి .
"అంటే?"
