వింటున్న రాజు తల పంకించాడు .
ఇంతకీ అయోధ్య ఎక్కడా!
* * *
"పైన దేవుడున్నాడు -- కింద నేనున్నాను . మీరేం భయపడకండి " అంటున్నాడు తులసీరావు.
దిగాలుపడి ఉన్నారు రాజు తండ్రి పరమేశ్వర్ , అతని భార్య సంయుక్తా.
'సినిమాల్లో ట్రిక్ ఫోటో గ్రఫీలాగా ఒక్క క్షణంలో మాయమైపోయారు మా అమ్మాయీ, మా అబ్బాయీ! గురువుగారూ -- ఈ గుండె కోత నేను భరించలేను " అంటోంది సంయుక్త దుఃఖంతో జీరపోతున్న గొంతుతో.
'అమ్మాయిని అడవులు పట్టించిన ఈ నందూగాడికి స్పృహ వచ్చినా విషయాలు తెలిసేవి " అంటున్న్జాడు పరమేశ్వర్.
"పోనీ అంజనం వేసి చూస్తేనో ?" అన్నాడు తులసీరావు.
"ఏదో ఒకటి ! మీరే ఏదో ఒక దారి చూపించాలి" అంది సంయుక్త దీనంగా .
అంజనం వేయడానికి తతంగం మొదలెట్టాడు తులసీరావు.
కళ్ళు మూసుకుని కాసేపు ఏవో మంత్రాలు చదివాడు.
తర్వాత, సంయుక్త కళ్ళకు కాటుక లాంటిది పూశాడు.
'అమ్మా! కళ్ళు మూసుకుని చూడు , అమ్మాయి కనబడుతుంది " అన్నాడు.
సంయుక్త కళ్ళు మూసుకోగానే , అప్పటికే కళ్ళలో నిండివున్న కన్నీటి చుక్కలు చెంపల మీదికి జారాయి.
"అదిగో ! నా చిట్టి తల్లి కనబడుతోంది." అంది సంయుక్త రుద్దమైన గొంతుతో.
"ఎక్కడా?" అన్నాడు పరమేశ్వర్ ఆదుర్దాగా.
"అదిగో ! అక్కడే! అశోకవనంలో సీతమ్మవారిలా కూర్చుని వుంది -- సందేహం లేదు. ఎవరో రాక్షసుడు చేరబట్టాడు తనని" అంది రోదిస్తూ.
సైన్యంలో పనిచేసి రిటయిర్ అయిన మేజర్ పరమేశ్వర్ కొత్తని కాదనలేని పాతని వదులుకోలేని ,మనిషి, గురువుగారి మీద గొప్ప గౌరవ భావం ఉన్నా కూడా విదిచిపోనంటున్న విచక్షణా జ్ఞానం!
తన భార్య సంయుక్త అసలు సిసలైన భారతనారి. సంప్రదాయలంటే ప్రాణాలు పెడుతుంది. పురాణాలన్నీ పుక్కిట పట్టేసింది.
ఆమె చదివిన రామాయణంలోని అశోకవనం సీనుని అమ్మాయి పరంగా అన్వయించుకొంటుందా? లేక హల్యూసినేషన్స్ కలుగుతున్నాయా! అదీ కాకపోతే - ఈ అంజనం అన్నది నిజంగానే మహిమని చూపిస్తోందా/ ఏమో !
* * *
అడవిలో నడిచి వెళ్తున్నారు రాజు సృష్టి , ఇంతలో పెద్దగా ఏనుగు ఘీంకారం వినబడింది.
దాన్ని సవాలు చేస్తున్నట్లుగా మరో ఏనుగు ఘీంకరించింది.
రాజూ, సృష్టి అటువేపు చూశారు.
"ఓహ్! మైగాడ్" అంది సృష్టి భయంకంపితురాలయిపోతూ.
నిజంగా భయం కలిగించేటట్టె ఉంది ఆ దృశ్యం.
కొన్ని ఏనుగులు కొన్ని కారణాల వల్ల రోగ్ ఎలిఫెంట్ గా మారతాయి. మామూలుగా అయితే ఏనుగులు , మంచి సంఘజీవులు. ప్రతి మందకూ ఒక నాయకుడు, నాయకురాలో వుండడం, మందలోని సభ్యుల బాగోగులు చూసుకుంటూ వుండడం , మందలోని అన్ని ఏనుగులూ ఆ లీడర్ నే అనుసరిస్తూ వుండడం జరుగుతుంది.
ఒక ఏనుగుల మందలో ఒక పిల్లపుడితే , దాన్ని తల్లే కాక అన్ని ఏనుగులూ కూడా తగని ముద్దు చేస్తాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటాయి.
కానీ --
ఒక ఏనుగు రోగ ఎలిఫెంట్ గ మారాగా, ఈ అనుబంధాలు ఇంక వుండవు. అది ఏకాకిగా బతుకుతూ, ఎదురైనా వాటన్నటితో కొట్లాటకు దిగుతుంది.
ఇప్పుడు రెండు రోగ్ ఎలిఫెంట్స్ ఒక దానితో ఒకటి తలపడ్డాయి. తలపడిన రోగ్ ఎలిపెంట్స్ తలలు పగిలే దాకా వెనకడుగు వెయ్యవు.
రోగ్ ఎలిఫెంట్స్ పోట్లాటకి దిగాయంటే అక్కడ కొన్ని వందల గజాల మేర స్థలం యుద్దరంగంగా మారిపోతుంది. చెట్లూ చేమలూ ధ్వంసమైపోతాయి.
అచ్చం అట్లాగే జరుగుతోంది ఇప్పుడు.
వాటిలో ఏ ఏనుగు ఏ క్షణంలో ఎటు నుంచి వచ్చి తమ మీద పడుతుందో అనిపించేటట్లుగా వుంది.
ఏనుగులు కుమ్ముకుంటున్నాయి. ఒకదాన్ని ఒకటి తోసుకుంటున్నాయి. వాటి పోట్లాటలో చెల్టు విరిగిపడుతున్నాయి.
ఉన్నట్లుండి-
ఒక కొండ విరిగిపడ్డట్లుగా కిందికి ఒరిగింది ఒక ఏనుగు. కిందపడినా ఓటమిని అంగీకరించనట్లుగా ఘీంకరిస్తూనే వుంది.
కిందపడిన ఏనుగు వైపు కొద్ది క్షణాలు చూస్తూ ఉండిపోయింది గెలిచిన ఏనుగు.
ఆ తర్వాత దాని దృష్టి రాజు మీద పడింది.
రాజుని చూడగానే చాలెంజ్ చేస్తున్నట్లుగా తొండం ఎత్తి ఘీకటించి, పర్వతానికి కాళ్ళు వచ్చినట్లుగా పరిగెత్తి రావడం మొదలెట్టింది.
"దూరంగా వెళ్ళు ' సృష్టి! దూరంగా వెళ్ళు !' అని హెచ్చరించాడు రాజు -- ఏనుగుని ఎదుర్కోడానికి సిద్దం అవుతూ.
"నిన్ను వదిలివెళ్ళను -- నువ్వురా"
"వెళ్ళు సృష్టి!" అని గద్దించాడు రాజు శాసిస్తున్నట్లుగా.
తప్పనిసరి అయి, చెట్ల చాటుకు పరుగెత్తి వెళ్ళింది సృష్టి, కానీ అక్కణ్ణించి కూడా ఆమెకు అంతా కనబడుతూనే వుంది.
రాజు ఒక ఏనుగునే కాదు -- రెండు ఏనుగులనూ కూడా ఎదుర్కోగలడు అన్నంత భరోసా వుంది సృష్టి కి. కానీ ఇష్టమైన వాళ్ళు కష్టంలో వుంటే కలిగే బాధ కూడా వుంది.
కళ్ళప్పగించి చూస్తోంది సృష్టి.
రాజుని సమీపించింది మదగజం.
బాగా దగ్గరికి రానిచ్చి ఒడుపుగా దాని ముందర రెండు కాళ్ళు పట్టేసుకున్నాడు రాజు.
కుస్తీ పోటీలో చిత్తయినట్లయింది. అది ప్రయత్నిస్తోంది అయినా కూడా అంగుళం కదలలేకపోతోంది.
తొండంతో రాజుని చుట్టేయబోయింది.
కానీ పట్టు దొరకడం లేదు.
ఐదునిమిషాలు గడిచాయి.
