Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 31


    పాపం. నిన్న సాయింత్రం నా యెదురుగా కూచుంది. తెలుస్తోంది, ఆమె అంతా కనుక్కున్నదని - భర్త చౌర్యమంతా.
    కనుక్కుని......
    ఎందరు స్త్రీలో కనుక్కున్నారు..... కష్టపడి , నీచపడి, సిగ్గు పడి కనుక్కున్నారు.
    కనుక్కుని.....
    లోపలే కుక్కుకున్నారు.
    పైకి భర్త గొప్ప మీద డాబులు.
    లోపల భర్త ద్రోహం మీద డోకులు.
    నీ రూపాయల మీద తిరగబడు.
    నీ ఉద్యోగం మీద మండిబడు.
    నీ బానిసత్వం మీద ఎగబడు.
    చీకటి బూజుగదుల్లో నలభై మందిని బంధించి కక్కు విజ్ఞానాన్ని బెత్తాలతో జున్మానాలతో ఎక్కించే గొడ్రాలు భోగానికి తిరగబడు.
    సరేలే.
    సోషలిజాన్ వొస్తే దొంగతనం పోతుందా?
    డబ్బు సంపాయిస్తే మాత్రం వ్యభిచారం పోతుందా?
    అంతకన్న
    పోనీ దొంగలిస్తేనేం? అను    
    పోనీ వ్యభిచరిస్తేనేం? అను
    వెర్రి ఆశల్ని రేకెత్తించకు.
    దాచుకునేతనం, ఎప్పటికేట్లా వుంటుందో అనే భయం - వాడికి లేకుండా వుంటే చాలుననే ద్వేషం, పని లేకుండా పడేసుకునేచేవాడితనం,
    ఇంకా, ఇంకా , ఇంకా నాకే అనే కక్కుర్తి,
    నా అంతవాడికి అనే గర్వం    
    భర్త భార్యల విషయమై సోషలిస్టు ఐనాడని.
    అది ఇష్టంగా లేదు ఆమెకి.
    "ఇది ఎవరి డబ్బు?" :వాడి తాతసొమ్ము!" అన్నంత వరకు.
    "ఎవరి డబ్బు?" అనలేదు.   
    కాని భర్త మైసూరు వెళ్ళిన ఆమె వొంటి మీద వాసనలతో .......ఆ వుక్కలో........కిటికీ లేని ఆ మూల ........మళ్ళీ తన పక్కన.........
    చల్లగాలిలో పచ్చిక మీద పడుకోకూడగా వాళ్ళు! అనుకున్నానా రాత్రి.
    కాని ఆ రెండో ఆమె వొంటి చీర పరిమళాలతో ............ఎట్లా కావలించుకుందో ఆరాత్రి! అని ఏవగింపు నిన్న సాయింత్రం!
    "ఏం చెయ్యమంటారు?" అన్నాయి ఆమె కళ్ళు.
    "వొదిలెయ్యి" అన్నాయి నా పెదిమలు.
    వొదిలేసి?.........
    భోజనం?
    సరే:
    ఆగింది ,
    రాత్రి ........చివరికి ఆ బూజులమూల, గుంట మంచం మీద నన్నా, వంటచీరల పరిమళాలతో నైనా, పోనీ , కరిచే వానరాలకి ఎవరు శాంతినిస్తారు? అంటుంది.
    అన్నం పెడతావు?
    తరవాత.........
    ఏం చెప్పను?
    ఎవర్ని నా పిల్ల 'నాన్నా' అని పిలుస్తుంది?
    "ఈ పిల్ల సరే! నా కోసం అకాశంలోంచి తడుముకునే పిల్ల! ఆ బూజుమూల చీకట్లో, వెతక్కుంటో , నాలోపల రాచూసిన పిల్ల! ఎవరు దిక్కు! నువ్వా?" అన్నాయి కదలని ఆమె పెదవులు.
    "తిరగబడు, లోబడకు."
    మాటలు మంచివే! తిరగబడి? తరవాత?
    చలం, జవాబు చెప్పు.
    నన్నడక్కండి. నాకు తెలీదు.
    మీరే కాదు. దేశాలు ప్రశ్నిస్తున్నాయి.
    తిరగబడి! తరవాత........
    నీకేం మా గతి ఏమైతే నీకేం?
    ఇంకో రెండు కధలు వ్రాస్తావు.
    నాలుగణాల టీ, రెండణాల సిగరెట్లు , నీకు పొద్దున్నే ........ నీనరాలా? మొగాడివి ......నీకేం?
    జేబులో రూపాయలు , స్నేహితులు ........నీకేం?
    వ్రాస్తావు , నీ కలం నడిచినట్టల్లా . నీకేం?
    ఆత్రుతలో ఏదో చెపుతావని చదివే అనాధలం.
    నిన్ను ఎదురుగా ప్రశ్నించే, నిర్భాగ్యులు.
    కుర్చీ దిగు,
    సిగరెట్టు పారెయ్యి,
    గుమ్మం కదులు,
    మాతో రా, మట్టిలోకి,
    పిల్ల, పాలులేని నీరోమ్ము చీకిందా?
    కీళ్ళు కదలక నీ తల్లి పక్క గోతిలోకి దోర్లిందా?
    బిడ్డతో కారిన రక్తం , బొడ్డుకి కుంకం పెట్టిందా?
    చెపుతావు కబుర్లు.
    నీ కళ్ళ నిండా యిగలుమూగాయా?
    నీ పుళ్ళలోపలె పురుగులు ఎదిగాయా?
    రాస్తావు రాతలు! టీ కప్పు ,ముందు పెట్టుకుని, పట్టు లుంగీ కట్టుకుని!
    "నువ్వు చెప్పానని శ్రీరాముణ్ణి వోదిలాను" అని లవకుశుల్ని చెరో చేత్తో పట్టుకుని సీత నీ గుమ్మంలో నుంచుంటే ఏం జవాబు చెపుతావు చలం?
    జాతకం కింద దాక్కుంటావా?
    ఇంకో సిగరెట్టు వెలిగించాను.
    టీ ఖర్చు ........ఒకరోజు సంసారానికి తిండి, లెక్క బాగానే వుంది. ఏ సంసారానికి? ఎందుకా సంసారానికి? అసలు సంసారం ఎందుకుంది?
    నువ్వు సంసారం పెట్టుకోవడమా? నేను టీ మానుకోడమూనా?
    Sense of humour , how dangerous?
    నిన్న రాత్రి రేడియోలో 'ఇలాగోష్' కోసం హోటల్లో wait చేస్తో వుంటే -
    పొద్దస్తమానం అడుక్కున్న గుడ్డి ఆమె డబ్బులు, ఎక్కడినుంచో వొచ్చి లెక్క చూసుకుంటున్నాడు- దట్టమైన మొగమనిషి,
    నా టీ డబ్బులు ఆమె కివ్వనా?
    అతని కోసమా నా టీ ని వొదులుకున్నది? ఆ పాత్ర దానమన్నారు పూర్వులు.
    private charity నిష్ప్రయోజనమన్నారు నవీనులు.  
    కాని నిన్నటి ఆమె భర్త నా సిగరెట్ పెట్టి దొంగతనం మానెస్తాడా, ఎన్ని సిగరెట్ పెట్టెలు దానమిచ్చినా! ఎనార్కిజం రానీ.
    ఈ బిచ్చగాళ్ళు ! social parasites.
    ఈ బ్రాహ్మలు , యీ బైరాగులు , యీ గురువులు, యీ రుషులు!
    Idlers సోమరి పోతులు.
    వీళ్ళందర్నీ , కాడికి కట్టి .......తోలి, పనిలో పెట్టాలి. ఎందుకు పని?
    దేశ సమృద్ధికి.
    ఎందుకు సమృద్ది!
    దేశాల డాణు'లు, దేశాల superiorties vanities, cupideties.
    దానికీ.
    ఎందుకు పని?
    మీరు హాయిగా కూచుంటే,
    గుమస్తాలం, కూలీలం, సోల్జర్లం, కరణాలం, షాహుకార్లం, మేమెందుకు పనిచెయ్యాలి?
    వొద్దు, చెయ్యకండి.
    మీరు పనిచేస్తే మాకేమిచ్చారు? కష్టించారు, ఫలించారు. మాకేం, వొద్దు. Brother and comrade, వొద్దు. పని చెయ్య వొద్దు, రా, రా, నాయనా. రా, రా, పోదాం. రోడ్డు మీదికి. దాచుకున్నది అట్టా పారేసి రా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS