Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 30


    "రాత్రంతా మా కోడలకి నిద్రలేదు . ఒకటే కడుపు నొప్పి ." అని చాటుతోంది ప్రయాణీకులకి ఒకామె, తన హృదయంలో కొడుక్కి ఇచ్చిన భాగానికి తగిలిన గాయం చుట్టూ.
    లండన్ లో యుద్ధం.
    డిల్లీలో భయం.
    ఏలూరులో కోమటి కడుపు నొప్పి.
    రైల్లో దొంగతనం.
    నా కడుపులో దాహం.
    "ఎన్ని బీర్లు బుడ్లు? నిన్నరాత్రి ఖర్చెంత?' అని ఆడుగుతోంది స్పెన్సరు తాత్కాలిక యజమానురాలు.
    ఏం ఖర్చు? బీరుబుడ్లు ఖర్చా? రూపాయల ఖర్చా! ఆరోగ్యం ఖర్చా! తాగిపోతున్నారో , అని యేడ్చే మర్యాదస్తుల కడుపు మంట ఖర్చా!
    గడచిన నెలలో బద్దలైన సామాన్లకి మూడు రూపాయలు.
    రూపాయి నిర్భంధపు - చందా.
    జాలి తలచి కొనుక్కొని పెంచుకొంటున్న పిల్ల పాలకి నాలుగున్నర.
    నడుంలో నెప్పి,
    నిలువలేక తెచ్చుకున్న రోగం పిచికారీలకి తక్కింది.
    నడుం నెప్పి. 17 గంటల పని. లెక్క పెట్టె యజమాని.
    Boy omlette!
    Boy here! damn bloody boy? come here
    Boy, Boy,Boy!
    రెండణాలు జేబులో వుంటే సరి Boy!Bloody Boy! సువ్వర్.....కొడకా!
    "Boy వేడిగా, light గా, బాగా కడిగిన కప్పులో, టీ , టీ, టీ."
    మొదటి గుక్కతో శాం......తి'.
    దొంగలు పడితేనేం?
    బాంబులు పడితే నేం?
    కడుపు నెప్పి పడనీ? నాకేం?
    పొట్టకీ, మెదడుకీ, ఎంత తొందర సంబంధం?
    ఆలోచన, సుఖంగా ఫేము కుర్చీలో ఆలోచన.
    ఎవరో దొంగతనం చేసింది? ఆమెకి అన్నా! భర్తా!
    ఏం చేస్తుంది ఇంక? దుమ్ములో కూచుంటుంది.
    సుఖదుఖ్కాలకి బండబారిన ముఖం!
    ఏది surprise లేదు.
    జీవితం తన కిచ్చింది ఏమీ లేదు.
    మనుషులు తననించి తీసుకునేది ఏమీ లేదు. పాకీ అతని ప్రశ్న తనకేం లెక్క! కాయితం మీద అధికారుల ప్రశ్నలు నాకు లెక్క.
    డబ్బు, ఆస్తి, గౌరవం, జీతం.
    యివన్నీ కాపీనపడేవాళ్ళకి లెక్క.
    తలన్నా ఎత్తదు.
    ముఖమంటే తెలిస్తేగా,
    పోతుందని భయానికి!
    పాకీ అతనూ, కోపమొచ్చి తంతావా? నెప్పి లేదు.
    లేచిపొమ్మంటావా?
    ఇక్కడైతేనేం , అక్కడైతేనేం , ఆ గోతులో ఐతే నేం?
    నా గుడ్డకి మాపులేదు.
    "400 మంది చచ్చారు. తెలుసునా? అణా డబ్బులకి ఆ వివరాలు చెపుతా?" అని అరుస్తోంది పోస్టరు.
    "వాళ్ళు చస్తే నాకేం? నా కోడలకి కడుపునెప్పి, దాని సంగతి ఏం చెప్పారు?" అని అత్తగారు.
    దొంగతనం, బాంబులు, ఖైదు , కడుపునెప్పి, చావు, "టీ" లో ఈగ. పాకీ అతనికి కొమ్ములు మొలిచినా, surprise లేదు.
    దేనికి చేశారో దొంగతనం? అని, అర్ధణా ఖరీదైన సిగరెట్టు వెలిగిస్తో నేను.
    సోషలిజం వొస్తే దొంగతనం పోతుందా?
    "మాలపిల్ల వ్రాసింది మీరేనా? ఏం బావుందండీ!" అంటో నా సిగరెట్ పెట్టె దొంగిలించిన Socialist Gontleman.
    అతన్ని చూసి, మహాత్యాగి అని గర్వపడే భార్య, తలుపులు వేసుకోకూడదా ఇంటికి నేను? సైకిల్ పంపు పోయినా బుద్ది లేదు.
    సిగరెట్ పెట్టెలు ఇప్పుడన్నా జేబుల్లో దాచుకోకూడదా?
    చిరుగు గడ్డం భాగ్యవోణికీ రోమ్ముని కప్పడానికో, తడుముకునే పిల్ల పెదవుల్ని తడపడానీకో,
    మూటలు దొంగిలించినవాళ్ళు స్టేషనులో లాకప్పు, అణాకానికి ఆరు అబద్దాలు చెప్పే , సిబ్బందికి లోకువ. నవ్వడానికి, తిట్టడానికి, కొట్టడానికి - కైదులో మగ్గేయ్యడానికి- ఆ రోడ్డుమీది భార్య అంత మురికిగా లేకపోతే .....అ ఆశే టోపీల వాళ్లకి.
    భార్యకి నిస్ప్రుహ......
    మర్యాదపు దొంగల భార్యలకి గర్వం.
    "మావారు మొన్న లాటరీలో....."
    "చాలా భయం లెండి. వారు ఎదురైతే చాలు. అడక్కండానే కురుస్తుంది రూపాయల వర్షం"
    "అన్నీ సప్లైలు . మేము నెయ్యి కొనంగా ..........మావారు ......."
    "ఆ బస్తా పుచ్చు శనగలూ....... నాలుగు బస్తాలలో........"
    "మావారి తెలివి ఎవరికి వుందండీ....."
    "కలెక్టరు కండి .....మా అమ్మాయిని చూస్తె ......మా అమ్మాయి ఎప్పుడూ అయన బంగళాలోనే ...."
    ".....సైన్యంలో చేర్పించి ఎంతమంది బీదలకి అన్నం పెట్టారు?......."
    "ఏడు వేలు గుమ్మరించే వాడే వొస్తాడు పిల్లనిస్తానని! అందాకా వుంచుతాను మా అబ్బాయిని....."
    మర్యాదస్తులు.
    "నేను మా అబ్బాయికి చూసిన పిల్ల లెవ్వరూ అనాధలూ కారు."
    "పార్కు చెప్పకుండా ఇస్తే, తప్పకుండా పుచ్చుకుంటా. చెపితే మాత్రం ...... ఎంతైనా బ్రాహ్మణపుటక...."
    "నాలుగు వేల రూపాయల పది అణాలు పెట్టి కారు కొని పెట్టా. అది (భార్య) యెక్కి తిరగడానికి, పది వేల రూపాయల కారు ........ కాని చూడండి నా దవడ మీద కొట్టి ........నా ముందే వెంకయ్య చౌదరితో ....."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS