Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 31

   
    "పోనీలే బాబాయ్" అంది సతీదేవి.    
    "ఇలా అయితే నేను యిక్కడ వుండను. నీతో పాటు నీ తోకలా యాత్రలకి వస్తాను తాతయ్యా" కీర్తి గుణుస్తూ అంది.    
    వీళ్ళలా మాట్లాడుకుంటుంటే మాధవగురుదేవ్ అక్కడికి వచ్చాడు.    
    గుబురు మీసాలు గిరజాల జుట్టు మెడదాకాను పెద్ద పెద్ద సైడ్ లాక్స్, మెడలో పులిగోరు పథకం గల బంగారు గొలుసు, వేళ్ళకి రవ్వల వుంగరాలు పెద్ద సైజు వాచి, సిల్కు ధోవతి జుబ్బా ఆయనతోపాటు వచ్చే సంపెంగవాసన సెంటు, రంగేళి పురుషుడిలా వున్నాడు. పులికళ్ళు లాంటి కళ్ళు, దిట్టం గపెరిగిన కను బొమలు కలసి వున్నాయి. పెద్దముక్కు విశాలమైన నుదురు అంతా కలసి కాస్త కఠిన స్వభావం కలసిన వాడిలా అనిపిస్తాడు. ఎర్రజీరలతో తీక్షణమైన చూపులు ఎదుటి వాళ్ళు భయపడేలా వుంటాయి.    
    మాధవ్ గురుదేవ్ అక్కడికి రాంగానే సతీదేవి సోఫాలోంచి లేచి నిలబడింది. వెంటనే యశ్వంత్ భట్టాచార్య సోఫాలోంచి లేచి నిలబడుతూ "రాణమ్మా! లే" అన్నాడు చిన్నగ.    
    "ఎందుకు?" అంటూనే లేచింది కీర్తి.    
    "మా తాతయ్య వెంకటాద్రి. మనుమరాలు రాణి" సతీదేవి చెప్పింది.    
    "తాతయ్య అంటే?" మాధవ్ గురుదేవ్ అడిగాడు.        
    సతీదేవి చుట్టరికం చెప్పింది.    
    మాధవ్ గురుదేవ్ సోఫాలో కూర్చుంటూ "కూర్చోండి" అన్నాడు.    
    యశ్వంత్ భట్టాచార్య కీర్తి యిద్దరూ సోఫాలోకూర్చున్నారు.    
    "మిమ్మల్ని మీ పెళ్ళికి చూశాను. దరిమిలా వకేవకసారి వచ్చినప్పుడు చూశాను. మళ్ళా ఈ వూరు రావటం పడలేదు. ఆస్తీతో పాటు కొడుకు కోడలు కూడా పడవప్రమాదానికి గురయి వాళ్ళ దోవన వాళ్ళు పోయారు రాణమ్మ యిదొక్కటీ మిగిలింది." యశ్వంత్ భట్టాచార్య చెప్పాడు.
    "మీరుండేది ఎక్కడ?" మాధవ్ గురుదేవ్ యశ్వంత్ భట్టాచార్యని గుచ్చి చూస్తున్నట్లు చూస్తూ అడిగాడు.    
    "అదేంటి అలా అడుగుతున్నారు?" యశ్వంత్ భట్టాచార్య నుదురు చిట్టించి అడిగాడు.    
    "ఇప్పుడు మీరు మీకు ఈ మనుమరాలు తప్ప యింకెవరూ లేరుకదా ఊరేమైనా మార్చారేమోనని...!"    
    "ఉన్న కొంపని అమ్ముకుని వీధి నెలా పడను, పొలం మాత్రం అమ్మేశాను. అమ్మిన డబ్బు కొంత బ్యాంక్ లో వేశాను. కొంత చేత బుచ్చుకున్నాను. మనస్సాంతి కోసం రెండు నెలల పాటు తీర్ధ యాత్రలకి వెళుతున్నాను. రాణమ్మని తీసుకెళదామంటే పెళ్ళికావాల్సిన పిల్ల, ఈ వయసులో దాన్ని తిప్పటం యిష్టం లేదు. నేను తీర్ధయాత్రలకి తిరిగి వచ్చే రెండు నెలలు రాణమ్మని అమ్మాయి దగ్గర అట్టేపెట్టి వెళదామని...    
    మాధవ్ గురుదేవ్ పెదవి కదిపేలోపల సతీదేవి అందుకుంది. "అదేంటి బాబాయ్! మీరేమన్నా పరాయి వాళ్ళా! వారు ఎన్నిసార్లో నిను మా యింటికి వచ్చి పదిరోజులు వుండమనేవారు మర్చిపోయావా!"    
    "ఏళ్ళయితే మీద పడ్డాయిగాని యింకా మతిమరుపు రాలేదు. వెంటనే నేను ఆడపిల్ల యింట్లో వుండి తినటం ఏమిటి అనేవాడివి. అలా అనంగానే వీరు "నాకలాంటి చాదస్తాలు లేవు నాకు చాదస్తం లేదని నిరూపించాటానికైనామీరు కొద్ది రోజులైనా మాయింట్లోవుండాల్సిందేఅనేవారు. అవునా?" యశ్వంత్ భట్టా చార్య మాధవ్ గురుదేవ్ తో అన్నాడు.    
    "అవునౌను. కాని మీరు వుండేవారుకాదు" మాధవ్ గురుదేవ్ వెంటనే తల తాటిస్తూ అన్నాడు.    
    మాధవగురుదేవ్ అలా అనంగానే యశ్వంత్ భట్టాచార్య గుబురు మీసాల చాటున గుంభనంగ చిరునవ్వునడయాడింది.  
    "రాణి నా దగ్గర వుంటుంది బాబాయ్" క్షేమంగ యాత్రలకి వెళ్ళిరా అంది సతీదేవి.    
    "నేను యాత్రలకి వస్తానంటే తాతయ్యేమో పెళ్ళికావాల్సిన పిల్లవి యాత్రలకి రాకూడదు అన్నాడు. పెళ్ళికావాల్సిన పిల్లలు యాత్రలకు వెళ్ళరేమిటీ, మరీ చోద్యం! అయినాయిప్పుడెవరు పెళ్ళి చేసుకుంటున్నారుట! నాకేమంతవయసొచ్చిం దేమిటి?" దీర్ఘం తీస్తూ మాట్లాడింది కీర్తి.    
    "ఆడపిల్ల యిష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు" యశ్వంత్ భట్టాచార్యకోప్పడ్డాడు.    
    "నేనేం మాట్లాడానేమిటి, నోరు తెరిస్తే చాలు ఆడపిల్ల ఆడపిల్ల, నేను మగపిల్లనేం కాదు ఆడపిల్లనే" మూతి ముడుచుకుని చేతులు తిప్పుతూ అంది కీర్తి.    
    "ఇదీవరస" నిట్టూర్పు విడుస్తూ అన్నాడు యశ్వంత్ భట్టా చార్య.    
    "పోనీలే బాబాయ్! చిన్నపిల్ల" అంది సతీదేవి.    
    "తాతయ్యకి అలా చెప్పు అక్కా" అంది కీర్తి.    
    యశ్వంత్ భట్టాచార్య దీర్ఘంగ ఓ నిట్టూర్పు విడచి "అన్నింటికి ఆ భగవంతుడే వున్నాడు" అన్నాడు.    
    ఆ తర్వాత రెండు నిమిషాలు కూర్చుని మాధవ్ గురుదేవ్ లేచి వెళ్ళిపోయాడు.    
    కొద్దిసేపు యశ్వంత్ భట్టాచార్య "కీర్తి" సతీదేవి మాట్టాడుతూ కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడు కున్నంతసేపు ఓ దాసీది అక్కడే తచ్చాడుతూ అదీయిది సర్దుతూ వుండిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS