Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 30


    "చెప్పండి ఇన్ స్పెక్టర్! అతన్ని అరెస్టు చేయడానికి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?"
    "గౌతమికీ, కళ్యాణికీ సమ్రాట్ తో పరిచయం ఉన్నదనీ, తరచు వాళ్ళు కలిసి తిరిగేవారనీ సాహితి, అనూష సాక్ష్యం చెబితే అతన్ని వెంటనే అరెస్టు చేస్తాను. మీరు వాళ్ళిద్దరిచేతా సాక్ష్యం చెప్పించాలి. ఏమంటారు మేడమ్?" జవాబు కోసం అతను క్షణం ఆగాడు.
    బిందుమాధవి ఆలోచనలో పడింది. వెంటనే ఆమె నుంచి తను ఆశించిన స్పందన లేకపోవడంతో వీరేష్ నిరుత్సాహపడ్డాడు.
    "ప్లీజ్! మీరు ఈ కేసులో నాకు సహకరించాలి."
    "సారీ ఇన్ స్పెక్టర్! వాళ్ళిద్దరూ సమ్రాట్ అభిమానులే. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారంటారా?"
    "అది కష్టమైన పనే, కాదనను. కాని మీరు ప్రయత్నిస్తే తప్పకుండా సాధ్యపడుతుందని నా నమ్మకం. దయచేసి ప్రయత్నించండి మేడమ్!" అభ్యర్ధనగా అన్నాడు.
    "మీరంతగా చెబుతున్నారు కనుక, తప్పక ప్రయత్నిస్తాను."
    "కేవలం ప్రయత్నమే కాదు మేడమ్! ఈ విషయాన్ని మీరొక సవాలుగా తీసుకోవాలి. వాళ్ళ నుంచి మనం ఆశించిన స్పందన ఉంటుందని నమ్మమంటారా?" వీరేష్ ఆత్రుతగా అడిగాడు.
    "సారీ ఇన్ స్పెక్టర్! నేను అంత గట్టిగా ఎలా చెప్పగలను? నేను సాహితికి కేవలం గార్డియన్ ను మాత్రమే అని మీకూ తెలుసు. ఒకసారి నేను హద్దు మీరి ప్రవర్తించినందుకు ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక అనూష అంటారా_ఆమె సమ్రాట్ దగ్గర పనిచేసింది. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుందో, లేదో మీరే ఆలోచించండి. నామీద వాళ్ళకు గౌరవాభిమానాలు ఉంటే వుండొచ్చు. కాని ప్రయత్నించి వాళ్ళకు నామీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉంది. అయినప్పటికీ మీకోసం నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను."
    ఆమె మాటలు వీరేష్ కు సంతృప్తినివ్వలేదు.
    "ఫరవాలేదు మేడమ్! మీ మధ్య కలతలు తీసుకురావడం నా అభిమతం కాదు. మీ ప్రయత్నం మీరు చేయండి" అన్నాడు అసహనంగా లేస్తూ.
    "సారీ, నేను నిర్మొహమాటంగా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు. ఇన్ స్పెక్టర్! నా ప్రయత్నం నేను చేస్తాను."
    "థాంక్యూ మేడమ్! మీ మీద నాకా నమ్మకం వుంది. బైదిబై ఎప్పుడూ నేనే మీకు అతిథి నవుతున్నాను. మీరొక పర్యాయం సాహితితో కలిసి మా యింటికి రావాలి. నా ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా వస్తారనుకోనా?" ఆమె అంగీకారం కోసం చూశాడు.
    "భలేవారే! పోలీసు ఆఫీసర్లలో చాలా అరుదుగా కనిపించే మీబోటి వారు ఆహ్వానిస్తే రాకుండా ఉంటామా? పబ్లిక్ రిలేషన్స్ మీద నాకు సదభిప్రాయమే ఉంది. మరోవైపున నా స్వార్థం నాకూ వుంది. నేను రాయబోయే నవలకు మీ పోలీసుల ఇతివృత్తాన్నే ఎన్నుకున్నాను."
    "చట్టం గురించి, న్యాయ వ్యవస్థ గురించి, మీ పోలీసు వ్యవస్థ సాధక బాధకాల గురించి మీతో క్షుణ్ణంగా చర్చించాలి మరి! నాకు ఆ సహాయం చేస్తానంటే తప్పక వస్తాను."
    "తప్పకుండా! మా బాధలు మేమెలాగూ చెప్పుకోవడం సాధ్యపడదు. కనీసం మీరైనా ప్రజలకూ, ప్రభుత్వానికీ మీ రచన ద్వారా తెలియజేస్తానని ముందుకు వస్తే సహకరించకుండా ఉంటానా? కాకపోతే కొన్ని శాఖాపరమైన రహస్యాలను మాత్రం అడక్కండి. అడిగినా మీరు ఆశించినట్టు నా నుంచి నిజం బయటకు రాదు!" నవ్వుతూ అన్నాడు.
    "ధన్యవాదాలు! ఆమాత్రం అభయమిచ్చారు, అంతేచాలు!"
    "అయితే, రేపు ఆదివారం సాయంత్రం మీకోసం ఎదురుచూస్తూ వుంటాను. సాహితిని కూడా తీసుకురండి మేడమ్!" అంటూనే వీరేష్ వెళ్ళిపోయాడు.


                              *    *    *    *


    క్షణ క్షణం గుర్తుకువచ్చి మనసును కలవరపెట్టే శక్తి ఒక్క ప్రేమకే ఉన్నదేమో!
    అన్నింటికీ అతీతంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా సమ్రాట్ వల్లకావడం లేదు.
    అతని జీవితంలో ఎందఱో ఆడపిల్లలు తారసపడ్డారు. ఎవరి గురించీ అతను మనసు పాడుచేసుకోలేదు. సాహితిని చూసిన క్షణం నుంచి ఏదో తెలియని అవ్యక్తానుభూతికి లోనైపోతున్నాడు.
    ఆరోజు ఉదయం ఫోనులో సాహితితో మాట్టాడిన తరువాతగాని అతని మనసు కుదుటపడలేదు.
    అతను పార్క్ కు వచ్చేటప్పటికి సరిగ్గా పార్కులో గడియారం సాయంత్రం అయిదు గంటలు కొట్టింది. అతని కళ్ళు ఆత్రుతగా సాహితి కోసం వెతుకుతున్నాయి.
    కాలం దొర్లుతున్నకొద్దీ ఆమె వస్తుందో, రాదోనన్న ఆందోళన మొదలయింది అతనిలో.
    విరహంలో బాధను అతను అనేక నవలలలో రాశాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు.
    అయిదున్నర దాటుతున్నది. అతనిలో ఓర్పు నశిస్తున్నది. అతను దగ్గర ఉన్న చెట్టు ఆకులను తెంపి కింద పడవేయడంతో క్రోటన్స్ మొక్క మొండిదయింది.
    అప్పటివరకు చెట్లచాటునుంచి అతని అవస్థను పొంచి చూస్తున్న సాహితికి నవ్వాగలేదు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని చప్పుడు కాకుండా అడుగులో అడుగువేస్తూ, వెనుకగా వచ్చి అతని కళ్ళు మూసింది.
    సమ్రాట్ నిష్టూరంగా ఆమె చేతులను విదిలించికొట్టాడు.
    ఒకప్పుడు తను సమ్రాట్ కోసం పరితపించినా అతను తన ప్రేమను గుర్తించలేదు. ఇప్పుడు అతను తనకోసం తహతహలాడుతున్న వైనాన్ని కళ్ళారా చూసింది. తనచుట్టూ అతన్ని తిప్పుకుంటున్నందుకు కించిత్తు గర్వం కలిగింది సాహితికి.
    "సారీ సమ్రాట్!" అతన్ని బాధపెట్టాననుకుని అంది.
    అతను ఒక్కసారిగా ఆమెను తన కౌగిలిలో బిగించాడు.
    ఈ హఠాత్పరిణామానికి సాహితి ఖిన్నురాలయింది.
    "ఆలస్యానికి శిక్ష వేశాను. ఎలా ఉంది?"
    సాహితి బుగ్గలు కెంపులయ్యాయి. సిగ్గుతో తల వంచుకుంది.
    "విరహంలో కూడా తీపి బాధ ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ నన్ను బాధపెట్టకు. తట్టుకోలేక ఈ గుండె ఆగిపోతుంది" ఉడికిస్తూ అన్నాడు.
    "ఆహా! మహా గొప్ప ప్రేమికుడు బయలుదేరాడు! వలచి వరించి వెంటపడ్డప్పుడు వానపాములా పడివుండి, ఇప్పుడు ప్రేమ పాఠాలు వల్లించడం...." అంది వెక్కిరిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS