Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 30

బస్సు డ్రైవరు, బస్సుని రయ్యిన ముందుకు పోనిచ్చాడు.
బస్సు డ్రైవరుగాని, బస్సులో వున్నవాళ్ళుగానీ కనిపెట్టలేదు. కానీ, కోసుగా వున్న ఒక రాతిప్రక్క ఎర్ర చారల గుడ్డ ఎగరవేయబడుతూ వుంది.
బస్సులో ముందుగా ఎక్కిన పల్లెటూరి బైతుల్లాంటి ఇరువురూ, ఆ తరువాత బస్సు ఎక్కినా కోయవాళ్ళు ఇరువురూ, ఎగురుతున్న ఆ గుడ్డను చూడగానే, రెడీ అవుతున్నట్లుగా లేచి నిలబడ్డారు.
స్పీడ్ గా టర్నింగ్ తిరిగి ముందుకి పరుగుతీస్తున్న బస్సు అల్లంత దూరాన ఎదురుగా, అడ్డంగా తిరిగివున్న ఒక బస్సుని, నేలమీద పడివున్న కొందరినీ, చేతులూపుతూ రోడ్డుకడ్డంగా నిలబడి వున్న నలుగురినీ చూసి, బస్సుని సడన్ బ్రేక్ తో ఆపటం జరిగింది.
స్పీడ్ గా వెళుతున్న బస్సు, సడన్ గా ఆగేసరికి బస్సులోవాళ్ళు ఒక్కసారిగా ముందుకీ వెనుకకీ కొట్టుకున్నంత పని అయింది.
బస్సు ఆగుతూనే, "ఎక్కడివాళ్ళు అక్కడే కదలకుండా కూర్చోండి!" అన్న భీకర ఘర్జన వినిపించింది.
ప్రయాణీకులు తెల్లబోయి ఆ తరువాత తెప్పరిల్లి చూసేసరికి, కోయవాళ్ళిద్దరూ రివాల్వర్స్ పుచ్చుకుని బస్సు డోరుకి అడ్డంగా నుంచుని వున్నారు. పల్లెటూరి బైతుల్లాగా వున్న ఆ ఇద్దరిలో ఒకడు రివాల్వర్ ని డ్రైవర్ కి గురిపెట్టి నుంచున్నాడు. మరొకడు రివాల్వర్ తో ప్రయాణీకులని బెదిరిస్తూ "ఎవరూ అరవద్దు! సీట్లలోంచి పైకి లేచే ప్రయత్నం చెయ్యొద్దు! పిచ్చి పిచ్చి వేషాల వైపే పుచ్చలు ఎగిరిపోతాయి." అంటూ గట్టిగా వార్నింగ్ లు ఇస్తున్నాడు.
బస్సులోవున్న ప్రయాణీకులు ఎవరికి వారే, భయంతో బిగుసుకుపోయి కూర్చుని వున్నారు.
దారికడ్డంగా నుంచునివున్న నలుగురూ బస్సుకి దగ్గరగా వచ్చారు. బస్సులో నుంచుని బెదిరిస్తున్న నలుగురూ, క్రింద వున్న నలుగురూ, కాస్త గట్టిగానే మాట్లాడుకోవటం వల్ల. వాళ్ళ మాటలు చాలామంది వినగలిగారు.
వాళ్ళ మాటలు ఇలా సాగాయి.
"పని సవ్యంగా జరిగిందా?"
"మనమో పధకం వేస్తే, అది ఫెయిల్ కావటం అంటూ ఎప్పుడైనా జరిగిందా!"
"చిన్న అవరోధం కూడా కలుగలేదా?"
"ఊహూ...."
"మరి మీ విషయం?"
"అంతా సవ్యంగానే వుంది."
"మనము వెంటనే రంగంలోకి దిగుదాం."
"అలాగే!"
వాళ్ళు ఆ కొద్ది మాటలు పూర్తిచెయ్యంగానే, బస్సులో డ్రైవింగ్ సీట్ లోవున్న డ్రైవర్ ని, ఒక్క లాగున క్రిందకి లాగారు.
వున్నట్టుండి బస్సు డ్రైవర్ పెట్టిన వెర్రికేక ఒకటి, బస్సులో వున్నవాళ్లకి వినిపించింది. జరుగుతున్నదేమిటో బస్సులో వున్నవాళ్లకి కనిపించక పోవటంవల్ల, వారికి అర్థంకాకపోయినా, అందరి మనస్సులూ ప్రమాదాన్ని శంకించాయి. మగవాడు చేతులు ముడుచుకు కూర్చుంటే, ఆడవాళ్ళు కొందరు ఏడుపులు ప్రారంభించారు. మరికొందరు "మమ్మల్ని ఏమీ చెయ్యవద్దు మా వంటిమీద వున్న నగలన్నీ ఇస్తాము" అన్నారు.
"మీ నగలు అక్కరలేదు ఏమీ అక్కరలేదు. నోరు మూసుకుని మేము చెప్పినట్టు చెయ్యండి! కాదంటే మీ మెడకాయ మీంచి తలకాయలు ఎగిరిపోవటం ఖాయం."
ఒక్కసారిగా అందరూ నోరు మూసుకున్నారు.
"ఇప్పుడు మేము ఏమి చెబుతామో, సరిగ్గా అలానే చెయ్యాలి మీరు. ఏ కాస్త మార్పు వచ్చినా, మీ ప్రాణం మీకు దక్కదు. అది గుర్తుంచుకోండి."
ఒక్కసారిగా,
బస్సులోని సగం మంది,
"అలాగే! అలాగే!" అంటూ అరిచారు.
"మీ మీ సామానులతో ఒక్కొక్కళ్లూ క్రిందకి దిగండి!" అన్నాడు గుమ్మంలో రివాల్వర్ పుచ్చుకున్న అతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS