తలుపు చాటుగా నిల్చున్న తార ముఖంలోకి దిగులుగా చూసింది.
చంద్రం కళ్ళు పెద్దవి చేసుకొని బుర్ర మీసాలాయాన్ని చూస్తున్నాడు.
"పొరపాటు జరిగిపోయింది. మేం వచ్చింది ఒంటిమిట్ట మంగపతిగారి ఇంటికమ్మా! క్షమించండి."
కాంతమ్మ కళ్ళకు బుర్రమీసాలాయన సినిమాలోని రాక్షసుడిలా కన్పించాడు.
తార నిట్టూర్పు విడిచింది.
చంద్రం తార ముఖంలోకి దిగులుగా చూశాడు.
"లేవండర్రా... ఇంకా కూర్చున్నారేం? వాళ్ళు మనకోసం ఉదయం నుంచి ఎదురుచూస్తూ వుండి వుంటారు" అంటూ బుర్రమీసాలాయన లేచి నిల్చున్నాడు.
"పదరా!" తారకేసి చూస్తూ నిల్చున్న చంద్రాన్ని హెచ్చరించాడు తండ్రి.
కాంతమ్మ మాటా పలుకూ లేకుండా కూర్చుండిపోయింది.
చంద్రం తండ్రితో ఏదో చెప్పబోయి, మానేసి వెనకే బయలుదేరాడు. వీధి వాకిలి దాటుతూ మరోసారి తార వంక చూసి ముందుకు సాగాడు.
తారకు దుఃఖం పొర్లుకొచ్చింది!
కాంతమ్మ మనసు అవమానంతో దహించుకు పోతూ వుంది.
వాళ్ళు తిని ఖాళీ చేసిన ప్లేట్లు, దొర్లాడిపోయిన వక్కలూ చూస్తుంటే కాంతమ్మ ఒళ్ళు జలదరించింది.
"తాడి చెట్టులా నిలబడ్డావేమే? ఆ ప్లేట్లు తీసెయ్!" కూతుర్ని కసురుకుంది.
తార దుఃఖం పొంగుకు వస్తూ వుంటే లోపలకు పరుగు తీసింది.
దిగాలుపడి కూర్చున్న కాంతమ్మ దృష్టి - అంత దూరంలో వున్న పత్రిక మీద పడింది. కాంతమ్మ కోపం తారాబలం రాసిన వాడి మీదకూ, ఆ పత్రిక మీదకు మళ్ళింది.
పత్రిక చేతిలోకి తీసుకొని "గ్రహబలం" వున్న పేజీ తెరచి చూసింది.
"ఈ ముదనష్టపాడు మరి అట్టా రాశాడేం?" అనుకుంటూ మరోసారి చదవసాగింది.
"మీరు ఈ వారం చాలా జాగ్రత్తగా వుండాలి. ఆప్తులు వచ్చిన వారివల్ల మనస్తాపం కలుగుతుంది. కష్టానికి కష్టం! ఖర్చుకు ఖర్చు! కుటుంబంలో అశాంతి..."
కాంతమ్మ మళ్ళీ మళ్ళీ చదివింది. ఇదేమిటి ఇలా వుంది? తన కళ్ళను తానే నమ్మలేకుండా వుంది.
అయితే తను మధ్యాహ్నం చదివిన పత్రిక ఇది కాదా!
కుర్చీకి వెనగ్గా పడి వున్న మరో వారపత్రిక తీసి చూసింది. గ్రహబలం వున్న పేజీ పైనే వుంది. చదివింది. తారీఖు చూసింది.
అది పోయిన ఆదివారం పత్రిక.
"ఎంత పని చేశావే? నీ సినిమా పత్రికలూ నువ్వూ మండిపోనూ!" కూతుర్ని తిట్టిపోసింది.
తార మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వుంది.
ఈ వారం పత్రికలో రాసినట్టే జరిగింది. ఎంత అవమానం! ఎంత మోసం! శరీర కష్టానికి కష్టం! ఖర్చుకు ఖర్చూ! పైగా ఆయనకు తెలిస్తే! అమ్మో ఇంకేమయినా వుందా? అసలే అభిమానం మనిషి! తాట ఒలిచెయ్యడూ?
ఆయన వచ్చే సమయం కూడా అవుతోంది. కాంతమ్మ లేచి తార దగ్గిర కెళ్ళింది.
"నువ్వెందుకు ఏడుస్తావ్? నాన్న వస్తారేమో? లే! లేచి ముఖం కడుక్కో!"
తార దుఃఖం తారాస్థాయి అందుకుంది.
"ఏదో బండి వచ్చినట్టుంది. నాన్న వచ్చారేమో! లే! ఊఁ నాన్నకి జరిగిన విషయం చెప్పకు."
"నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను."
కాంతమ్మ విస్తుపోయి కూతురి ముఖంలోకి చూసింది.
"మరెవర్నీ చేసుకోను!"
"ఏమిటే వెధవ వాగుడూ నువ్వూనూ!"
"నేను ఆయన్ను ప్రేమించాను. ఆయన్ను తప్ప చేసుకోను. బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను."
కాంతమ్మ మతిపోయిన దానిలా కూతుర్ని చూసింది.
"రండి! రండి!"
భర్త వియ్యాలవారిని తీసుకొస్తున్నట్టు తెలుసుకుంది కాంతమ్మ. ఆమె కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్టనిపించింది.
** ** **
