Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 30


    వెనువెంటనే మరో తూటా అతని నోటిని తాకి పళ్ళను శకలాలుగా మార్చింది. పొంగిన పాలలా బయటికి రక్తం ఉబికి వస్తుంటే ఇంకా తను కాదంటూ చెప్పాలని ప్రయత్నిస్తూనే వున్నాడు.


    "పోయేముందు కాదా నిజం మాటాడని నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తున్నా అర్జెంటుగా నీ ప్రాణాలు తీయకపోవడానికి కారణం నేనూ ఓ శాడిస్ట్ లా నీ బాధను చూసి ఆనందించాలనే..." నవ్వాడు ఉక్రోషంగా.


    "చూడు ధనుష్కోటి... ఈ ప్రపంచంనుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకునేముందు సామాన్యంగా దేవుడ్ని గుర్తుచేసుకుంటాడు మనిషి...కదూ"


    లీలలా వినిపిస్తున్నాయి శశాంక మాటలు.


    "కాని నీకా అదృష్టం కూడా ఇవ్వదలచుకోలేదు. నీకు వెంటనే చావాలని వుంటే ఓ పని చెయ్... నీకు అమిత శతృవెవడన్నా వుంటే వాడ్ని తలచుకో... ఆ పేరు నేలపై రాయి. కనీసం చచ్చి వార్ని సాధించానన్న ఆత్మ సంతృప్తయినా నీకు దక్కుతుంది."


    చాలా కష్టంగా బోర్లా దొర్లాడు ధనుష్కోటి. ఎందరి మరణ యాతనకో కారణమౌతూ కొన్ని క్షణాల క్రితందాకా బ్రతికిన ఓ మాఫియా కింగ్...


    "జయచంద్ర" రాసేడు నేలపై.


    సంతృప్తిగా చూసిన శశాంక కళ్ళనుంచి పగతీరిన ఉద్వేగం మిగిల్చిన ఓ నీటి బొట్టు "గుడ్"... పసికందులా నిర్మలంగా మరో ప్రపంచంలో బ్రతుకుతున్న నన్ను నీ లోకంలోకి బలవంతంగా లాక్కున్న ఓ మిత్రుడా... గుడ్ బై"


    ప్రకృతి దద్దరిల్లే ఓ చప్పుడు...


    ఓ తూటా ధనుష్కోటి తలను చీల్చుకుంటూ ఎన్నో ఆలోచనలతో పండిపోయిన మెదడులోని సెరిబ్రల్ కార్టిక్స్ ని చీల్చి ఛిన్నాభిన్నం చేసింది.


    ధనుష్కోటిలో చలనం ఆగిపోయింది.


    ముందుకు కదలబోతూ చూశాడు శశాంక. ఓ ఫోలీస్ వాన్ అటువేపే దూసుకొస్తూంది.


    అంతే... వేగంగా మరలి ఓ పొదమాటున నక్కిపోయాడు...


                                 *    *    *    *


    నిద్రలేచిన తన రాక్షసత్వానికి పరాకాష్టగా ధనుష్కోటి కథ ముగించిన శశాంక చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు.


    నలభై ఎనిమిది గంటల సుదీర్ఘమైన విశ్రాంతి తర్వాత బెడ్ రూం దాటి ఉదయం ఆరుగంటలకి బయటికి రాగానే ముందు సాంబయ్యని పిలిచి డబ్బిచ్చాడు.


    అర్థం కాలేదు సాంబయ్యకి శశాంక చెబుతున్నదేమిటో...


    "వెళ్ళిపో సాంబయ్య. ఈ డబ్బుతో ఏదన్నా వ్యాపారం చేసుకుని బ్రతుకు."


    ఆ ఇంట పోయేదాకా నీడ కోరుకున్నాడు కాని ఇంత డబ్బు వస్తుందని కలగనని సాంబయ్య ఇష్టం లేదన్నట్టు చేతులు జోడించాడు. కాని నచ్చచెప్పాడు....


    తనదో ప్రపంచం... ఆ ప్రపంచంలో తన బ్రతుకు, తన కష్టాలు, కన్నీళ్ళు తనకే పరిమితం కావాలి తప్ప మరొకరితో తను పంచుకోలేడు...


    ఒక హత్య శశాంకని ఎంత దారుణంగా మార్చిందీ అంటే అతడిలో ఇప్పుడు పూర్వపు ఛాయల్లేవు...


    మొన్నటి లాలిత్యం, నిన్నటిదాకా మిగిలిన అణువంత విచక్షణ అంతర్ధానమై మరో మనిషిగా మారిపోయాడు.


    వినీలను సైతం తప్పించుకోవాలని సాంబయ్యని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి బెడ్ రూంలోనే గడిపేశాడు.


    రిలాక్స్ డ్ గా సోఫాలో కూర్చోబోతుంటే మోగింది కాలింగ్ బజర్...


    వినీలేమో అన్న అనుమానంతో ద్వారం తెరిచాడు కాని నిలబడిందామె కాదు.


    అవినాశ్.


    అతడి భుజానికి ఇంకా బేండేజ్ వుంది.


    శశాంకలో రవ్వంత తొట్రుపాటు.


    శశాంకని దాటి లోపలికి వచ్చిన అవినాశ్, "మీరిలా తొందరపడతారనుకోలేదు మిష్టర్ శశాంక" అన్నాడు స్థిరంగా అతడ్నే చూస్తూ.


    శశాంక గొంతు తడారిపోయింది.


    అప్పటికే అవినాశ్ గురించి వినీలద్వారా కొద్దిగా విని వుండడంతో తొట్రుపాటుతో తన మొహంలో భావాలు కనిపించకుండా వెనక్కి తిరిగాడు.


    అవినాశ్ అంటున్నదేమిటి... ఆ రాత్రి తను ధనుష్కోటిని కాల్చి చంపడం కాని చూశాడా...


    "కమాన్... లెట్స్ హేవ్ ఏ వన్ డిస్కషన్" ఓ సోఫాలో కూర్చున్న అవినాశ్ "ఇది చూశారా" అన్నాడు ఓ దిన పత్రికను ముందు పడేస్తూ.


    స్పోర్ట్స్ కాలంలో తన ఫోటోతోబాటు తన స్టేట్ మెంట్ ను చూసి అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాడు శశాంక.


    "ఈ దేశంపై నాకు మమకారం లేదు... అందుకే పోటీలకు వెళ్ళనంటున్నది" బోల్డ్ లెటర్స్ లో కాంపిటీషన్ కే వెళ్ళనన్న తన స్టేట్ మెంట్ ప్రచురించబడి వుంది.


    నిజానికి శశాంక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయలేదు. మొన్నరాత్రి ధనుష్కోటి ఆచూకీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో వుండగా ఓ పత్రికా విలేకరి తారసపడి అడిగాడు. అసలే అక్కసుతో వున్న శశాంక సరిగ్గా అదే మాట అన్నాడు. అది ఇలా పబ్లిషై పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS