Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 30


    అవంతి మాట్లాడలేదు.


    "బార్ కౌన్సిల్లో మెంబర్ గా ఎన్ రోల్ అవ్వాలి. కోటు, గౌను, లైబ్రరీ, ఆఫీసు, పర్నిచర్, ఇవిపోనూ నువ్వు గౌరవంగా కోర్టుకి వెళ్ళి రావడానికి తగినంత మెయిన్ టెనెన్స్....."


    అవంతి అతనికేసి పిచ్చిగా చూసింది.


    అతను చెప్పేదంతా నిజమే.


    "కోపం వచ్చిందా? నిన్ను ఇన్ సల్ట్ చెయ్యడానికి నేననలేదు. కావాల్సిన నెససరీస్ గురించి చెప్పాను"


    "నిజమే!" అంది.


    ఆమె నున్నని మెత్తని చెంపలని అరచేతితో సవరతీశాడు.


    "నేను చెడ్డవాడిని. చాలా చెడ్డవాడిని. కారెక్టర్ లేని రోగ్ ని. అవునా?"


    "అనెవరన్నారు? వ్యక్తిగతమైన బలహీనతలని చూసి నవ్వేవాళ్ళని మనం లక్ష్యపెట్టనవసరంలేదు."


    "అవంతీ, మనిషిలో మంచీ చెడూ రెండూ వుంటాయి. చెడుని చూసినంత త్వరగా మంచిని ఎవరూ గ్రహించరు. అఫ్ కోర్స్. దాని గురించే ఆలోచించవలసిన అవసరం నాకులేదు. నా దగ్గరున్న కరెన్సీతో మొత్తం సొసైటీ నోరు మూయించగలను. అసలు సంగతి చెబుతాను విను. నువ్వు నాకేమీ అవుతావన్నది పాయింట్ కాదు. నీతో నాక్కావల్సిన సుఖాలని పొందిన మనిషిని నేను. డబ్బుకాదు నాకు ముఖ్యం. నా మనిషిగా కొంత సమయాన్ని నా కోసం ఖర్చుచేసిన దానివి. నేనేమిటో తెలిసిన దానివి. అయినా కూడా నన్నుగానీ, నా డబ్బునిగానీ లెక్కచెయ్యకుండా నాలోని అవలక్షణాలని వేలెత్తి చూపి నాలో మార్పుని తేవాలని ప్రయత్నించిన మంచి స్నేహితురాలివి.


    నువ్వన్నట్టు ఇంతకాలం నా డబ్బుని చూసి నాకు దగ్గరకొచ్చిన వాళ్ళున్నారే కానీ నన్ను గురించి ఆలోచించిన వాళ్ళు నాక్కనపడలేదు. అందుకే అవంతీ, ఐ లైక్ యు!"


    అతను గబగబా చెబుతున్నాడు.


    ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతోంది. అప్రయత్నంగా అతని చేతిని తన చేతిలోకి తీసుకొని పెదవులతో తాకింది అవంతి.


    "అందుకే నిన్ను మనిషిగా నిలబెట్టడానికి నేను నిశ్చయించుకొన్నాను" అన్నాడు.


    "థాంక్యూ, థాంక్యూ సోమచ్ మనోహర్" వెర్రిగా అంది అవంతి.


    "మరో మాట చెప్పనా?"


    "ఏమిటి?" అడిగింది.


    "అంటున్నానని బాధపడకూడదు. మీ నాన్న బతికినంతకాలం బతకడు. ఆయన అటోఇటో అయితే నువ్వు ట్రబుల్ అవుతావు. అందుకని ఇక్కడే వుండిపోతే మంచిదనిపిస్తోంది."


    అవంతి బాధగా చూసింది.


    "నువ్వు చెప్పినదానిలో నిజం లేకపోలేదు మనోహర్. కానీ ఆయన ఆ వూర్లో ప్లీడరు గుమాస్తాగా ఎన్నో ఏళ్ళుగా వున్నాడు. ఆయన కెందరో పెద్ద ప్లీడర్లు తెలుసు. క్లయింట్స్ తెలుసు. అదీకాక ఆయన సంచరించిన కోర్టులో నన్నో న్యాయవాదిగా కళ్ళారా చూసుకోవాలని ఆ ముసలి మనిషి కోరిక" అంది.


    "నీ ఆలోచన సమంజసమైందే. కాదనను. కానీ......"


    "ఒకవేళ నువ్వన్నట్టే జరిగితే అప్పుడే ఇక్కడికొచ్చేస్తాను" అంది.


    "దట్స్ గుడ్!" అన్నాడు మనోహర్.


    అది పబ్లిక్ ప్లేస్ అయిపోయింది. లేకపోతే అతని గుండెలపైన ఒదిగిపోవాలనిపించింది అవంతికి ఆ క్షణంలో.


    మంచివాళ్ళలా నటించే ఎన్నో వందలాది మందికంటే మనోహర్ లాంటి వాడు కోటిరెట్లు నయం అనిపించింది.


    అటుగా వచ్చిన పూలు అమ్మే కుర్రాడి దగ్గర సన్నజాజులు కొన్నాడు మనోహర్.


    "తల్లో పూలున్నాయి!" అంది.


    మనోహర్ మాట్లాడలేదు. సన్నజాజుల మాలని ఆమె జడలో అతనే పెట్టాడు.


    "థాంక్యూ!" అంది.


    అవంతి మనసుకెంతో రిలీఫ్ గా వుందిప్పుడు.


    ఆ మాత్రం అతను సాయపడితే చాలు. మిగిలిన జీవితానికి తనే పూలబాటని వేసుకోగలదు.


    "పద వెళదాం" అన్నాడు.


    అవంతి అతని చేతిని పట్టుకొని నడిచింది.


    కారు హాస్టల్ ని సమీపిస్తుండగా -


    "భారతి కనిపిస్తోందా?"


    "ఈ మధ్య కలుసుకోలేదు" అంది.


    "ఐసీ!"


    "నీకు కనబడలేదా?"


    కారాగింది. అవంతి కారు దిగి అతని దగ్గరకొచ్చి నించుందివిండోలోంచి చూస్తూ.


    "భారతి నన్ను ఏవగించుకుంటోంది. నేనంటే ఆమెకి అసహ్యం" అన్నాడు.


    అవంతి ఏదో చెప్పబోయింది.


    కానీ ఆమె ఊహించని విధంగా అతను కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.


    వెళ్ళిపోతున్న ఆ కారు కేసి చూస్తూ నిలబడిపోయింది అవంతి.


    మనోహర్ అంటే జాలి కలిగింది అవంతికి.


    నిజమే!


    మనిషిలోని చెడుని బూతద్దంలో చూస్తారే కానీ మిగిలిన మంచిని అసలు పట్టించుకోరు. అది మనిషిలోని బలహీనత అనడం కంటే మూర్ఖత్వం అనడం కరెక్ట్.


    అవంతి భారంగా నిట్టూర్చి హాస్టల్లోకి దారి తీసింది.


    అవంతి గదిలో అడుగుపెడుతూనే రమణిని అమాంతం కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.


    "ఏమిటీ హడావుడి?-" అంది రమణి స్నేహితురాలి ముఖంలో వెలుగుతోన్న కాంతి రేఖలని చూసి.


    అవంతి తియ్యగా మత్తుగా నవ్వేస్తూ రమణి రెండు చేతుల్ని పట్టుకొని గిరగిర తిరుగుతూ.


    "హాపీడేస్ ఆర్ హియర్ ఎగేన్" అంటూ హమ్మింగ్ చేయడం మొదలు పెట్టింది.


    అవంతి ఆనందం చూస్తే ఏదో పెద్ద విశేషమే ఉందని రమణి గ్రహించింది.


    "అబ్బ ఏమిటే సస్పెన్స్. అసలు సంగతి చెప్పు" అంది ఆయాసపడుతూ, తిరగలేక ఆగడానికి ప్రయత్నిస్తోంది రమణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS