Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 30


    "అవును వుండాలి" మౌనిక కూడా వాళ్ళతో గొంతు కలిపింది.

 

    అతను ఆలోచనలో పడ్డట్లు ఏమీ మాట్లాడలేదు.

 

    ఆ నిశ్శబ్దాన్ని భరించలేకే మౌనిక అంది -

 

    "మీరు వుంటున్నారు."

 

    అతడు నెమ్మదిగా ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నట్లు అన్నాడు "ఉంటాను" అని ఆగి, మళ్ళీ అన్నాడు "అయితే ఒక్క షరతు"

 

    అమ్మాయిలంతా వూపిరి బిగపట్టారు.

 

    "మీరు ఈ క్షణం నుంచి ఆత్మప్రక్షాళనా కార్యక్రమాన్ని వదిలేయాలి"

 

    వెంటనే అమ్మాయిలెవరూ మాట్లాడలేదు.

 

    సంవత్సరంగా జరుగుతున్న కార్యక్రమం. తమ శిక్షణలో ముఖ్యమైనది, అలాంటి దాన్ని వదిలేయాలి.

 

    ఎవరూ మాట్లడలేకపోయేసరికి అతనన్నాడు "మీకు ఇష్టం లేనట్లుంది. మిమ్మల్ని మహిళా సదన్ లో వదిలిపెట్టాక నేను వెళ్ళిపోతాను."

 

    ఆ మాటలు ఏమీ రుచించలేదు అమ్మాయిలకి. మనసులో వేదన ప్రవేశించినట్టు భారంగా వుంది. ఏదో తట్టుకోలేని, భరించలేని ఫీలింగ్.

 

    దాన్నిక సాగదీయ లేకపోయింది శృతి.

 

    "మీరేమీ వెళ్ళనక్కర్లేదులెండి. మీషరతుకు మేం ఒప్పుకుంటున్నాము" అంది.

 

    "మిగిలినవారూ చెప్పాలి కదా!"

 

    "మేమూ ఒప్పుకుంటున్నాం" మరికొంతమంది అన్నారు ఒకేసారి.

 

    "మరి అసలు కథానాయిక అంగీకరించాలి కదా" అని మౌనిక వైపు చూశాడు.

 

    "నేనూ ఒప్పుకుంటున్నాను" అని తలదించుకుంది ఆమె.

 

    అలా మాట్లాడుకుంటూ అందరూ మహిళా సదన్ కాంపౌండ్ లోకి ప్రవేశించారు.

 

    "మీరెళ్ళి భోజనం చేసి నా భోజనం పట్రండి" అంది మౌనిక భోజనశాల వద్దకు రాగానే.

 

    అలా వెళితే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది కైవల్య. "ఇప్పుడొద్దు. అందరూ గుంపుగా వెళితేనే గణపతిరాజు తరుణ్ గారిని గుర్తుపట్టలేడు" అంది చిన్నగా.

 

    అది నిజమేననిపించి మరిక మాట్లాడలేదు మౌనిక.

 

    అందరూ మహిళా సదన్ గేటు తీసుకుని లోపలికెళ్ళారు. మౌనికని, తరుణ్ ని రూమ్ దగ్గర దిగాబెట్టాక అక్కడ్నుంచి అందరూ భోజనశాలకు నడిచారు.

 

    తరుణ్ ని ఎవరూ చూడలేదని, ప్రమాదం ఏమీ లేదని భావించిన అమ్మాయిలంతా ఆనందంతో అటుకేసి నడుస్తున్నారు.

 

    అయితే తరుణ్ తన క్లినిక్ కి వచ్చాడని చెప్పడానికి గణపతిరాజు రాక కోసం డాక్టర్ ఈగల్ గా వెయిట్ చేస్తున్నాడు.

 

                            *    *    *    *    *

 

    అందరితోపాటు కైవల్య భోజనశాలకు వెళ్ళిందిగానీ భోజనం చేయలేదు. తన భోజనాన్ని ప్లేటులోకి తీసుకుని తరుణ్ దగ్గరికి వచ్చింది. "ఇదిగోండి భోజనం" అంది ప్లేటందిస్తూ.  

 

    "మరి మీకో?" అన్నాడతను. యూనివర్సిటీ హాస్టల్ లో అయితే స్టూడెంట్స్ తాము దర్జాగా తిని, రూంలోని గెస్ట్ లకు కూడా భోజనం పట్టుకొస్తారు. సర్వర్లను బతిమలాడో, బెదరగొట్టో భోజనాలు, టిఫిన్ లు పట్టుకొస్తారు. ఇక్కడ వీళ్ళు అలా చేసే అవకాశం లేదని తెలుస్తూనే వుంది అతనికి. అందుకే భోజనం తీసుకోవడానికి అతడు సందేహించాడు.

 

    "రాత్రుల్లో నేను ఉపవాసం" అంది.

 

    "ఇక నుంచీ మీరు - మీరేకాదు, ఏ అమ్మాయి అయినా ఉపవాసం వుండటానికి వీల్లేదు. ఏదో ఒకరోజు అయితే ఫర్వాలేదుగానీ రోజూ ఇలా తిండి మానేయకూడదు - ఆరోగ్యం చెడిపోతుంది"

 

    ఆమె నవ్వుతూ వుండిపోయింది.

 

    మౌనిక నిస్తేజంగా మంచంమీద పడుకుని వుంది. దగ్గరికి వెళ్ళి నుదుటిమీద చేయి వేసి చూసింది. జ్వరంలాంటిది ఏదీ లేదు.

 

    "మరి నే వెళతానండీ" అని ఆమె వెళ్ళిపోయింది.

 

    ఆ రోజు మౌనికకు ఏమీ పెట్టద్దన్నాడు డాక్టర్. దాంతో అతనే భోజనం ముగించాడు.

 

    మౌనిక దగ్గరగా కిటికీలో కూర్చున్నాడు. ఈ చప్పుడికి మౌనిక నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. పలకరింపుగా చిన్నగా నవ్వింది. అంతలోనే బాధ రక్తంలో కలుక్కుమన్నట్లు తన కుడిచేతిని కొద్దిగా పైకెత్తి చూసుకుంది. బాగా కాలిపోయిన అరచేయి తెల్లగా వుబ్బి పూరీలా తయారైంది.

 

    తాను చేసుకున్న పనికి తానే సిగ్గుపడుతున్నట్లు కుడిచేతిని తిరిగి దుప్పట్లో దాచేసుకుంది.

 

    పాముకరిచిన దానికన్నా కాల్చుకోవడమే ఆమెను బాధపెడుతున్నట్లు అతనికి అర్థమైంది.

 

    దానికి ఏదో ఒకటి చేయాలి. వెన్న రాస్తే రాత్రి వరకు కొంత రిలీఫ్ గా వుంటుందనిపించింది. ఉదయం కాగానే బర్నాల్ తీసుకురావాలనుకున్నాడు.

 

    ఇప్పుడు వెన్న ఎక్కడ దొరుకుతుంది?

 

    "వెన్న రాస్తే చల్లగా వుంటుంది. మీ కిచెన్ లో వెన్న దొరుకుతుందా?" అనడిగాడు.

 

    ఆమె కళ్ళు విప్పి, "దొరకచ్చు. కానీ వద్దు మీరు చాలా ఎక్కువగా ఫీలైపోతున్నారు. మీరనుకుంటున్నట్లు అంతగా బాధపెట్టడం లేదు లెండి" అంది.

 

    "పసిపిల్లల బాధ కన్నతల్లికి తెలిసినట్లు నాకు తెలుస్తోందిలెండి. ఉండడండి - ఇప్పుడే వస్తాను" అని పైకి లేచాడు తరుణ్.

 

    "ఎక్కడికి?" కంగారుగా అడిగింది.

 

    "మీ కిచెన్ కి."

 

    "ప్రమాదం."

 

    "మిమ్మల్ని రక్షించుకోవడానికి ఎలాంటి ప్రమాదంలో దూకమన్నా దూకుతాను" అని అక్కణ్ణుంచి లేచాడు తరుణ్.

 

    ఆమెకి ఏదో అయిపోతూ వుంది. అతని అభిమానానికి మనసంతా చిన్నపిల్లలా గంతులేస్తోంది.

 

    అతను రోడ్డులో కొచ్చి మెయిన్ గేటు తీసుకుని బయటికి వచ్చాడు. రెండు మూడు ఆవులు తిరుగుతున్నాయి తప్ప జన సంచారం లేదు.

 

    భోజనశాల ఎక్కడుందో చూచాయిగా తెలుసు. అటువైపుకి వడివడిగా నడిచాడు.

 

    అతను వెళ్ళేటప్పటికి కొంతమంది వృద్ధులు భోజనాలు చేస్తున్నారు. అది లాస్ట్ బంతి. కిచెన్ లో పనిచేసేవాళ్ళు చివరగా తింటున్నారు.

 

    అక్కడ వడ్డిస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, "వెన్న కావాలి" అని అడిగాడు.

 

    ఆ వ్యక్తి ఎవరన్నట్లు చూశాడు.

 

    "విమలాబాయి గెస్ట్ ని. స్వయంగా ఆమే పంపారు"

 

    ఇక ఆ వ్యక్తి మరి ప్రశ్నించలేదు.

 

    లోపలికెళ్ళి విస్తర్లలోని ఆకు చించి, అందులో వెన్న వేసుకుని తెచ్చి యిచ్చాడు.

 

    "థాంక్స్" అని తిరిగి మహిళా సదన్ కి వచ్చాడు.            


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS