Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 31


    "నేను ఆదిత్య స్నేహితుడిని" సుధీర్ గొంతు మార్చి ఆకతాయిగా నవ్వాడు. "మా వాడు అక్కడున్నాడేమో అని..."
    
    "ఉంటానని చెప్పారా?"
    
    ఒకవేళ నిజాయితీగా పేరు చెప్పినా, లేక సుధీర్ గొంతులో వ్యంగ్యం ధ్వనించకపోయినా ఆదిత్యని ఫోన్ దగ్గరకి పిలిచేదేమో.
    
    "మిమ్మల్నే మాస్టారూ?" రెట్టించినట్టుగా అంది.
    
    "ఒకవేళ వున్నాడేమో తెలుసుకుందామని."
    
    "ఉన్నారు! పిలవనా?"
    
    "ఫరవాలేదు" నచ్చచెప్పాడు సుధీర్ "మీరు బిజీగా వుంటే కంటిన్యూ చేయండి."
    
    "ఏమిటీ?" ప్రణయ గొంతు తీవ్రంగా వినిపించింది.
    
    "ఈ మధ్యకాలంలో తరచూ సాయంకాలాలు కలుసుకోవటం, అపరాత్రిదాకా గడపటం మాకు తెలుస్తూనే వుంది మిస్ ప్రణయా! మాకు అభ్యంతరం లేదు. కాని తెలివైన ఆదిత్య మీ ట్రాప్ లో పడి, ఎడ్యుకేషన్ మీద ఏకాగ్రత కోల్పోతే ఇప్పుడు హాస్పిటల్లో వున్న వాళ్ళ బామ్మ పాపం గుండె ఆగి చస్తుందని మీకు నచ్చచెప్పాలనుకుంటున్నాం నేను ఒక్కడినేకాదు, యూనివర్శిటీలోని వాడి స్నేహితులమంతా."
    
    ఫోను క్లిక్ మన్న చప్పుడు.
    
    "పెట్టేసింది ఫోన్" రిసీవర్ క్రెడిల్ చేస్తూ అన్నాడు సుధీర్.
    
    ఓ అరగంట క్రితం పుచ్చుకున్న మందు నిషా కన్నా ప్రణయ, ఆదిత్య తరచూ కలుసుకుంటున్నారన్న గాలి వార్త శౌరిని చాలా కలవరపరుస్తోంది. అసలు ఆదిత్యలాంటి ఓ సామాన్యుడు ప్రణయకి దగ్గర కావడం సహించలేక పోతున్నారు.
    
    డబ్బులోగాని, అంతస్తులోగాని తనలాంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వాల్సిన ప్రణయ, ఓ మామూలు స్థాయి వ్యక్తికి చేరువైపోతోంది.
    
    "అంటే.... ప్రస్తుతం ఆదిత్య ప్రణయ ఇంట్లోనే వున్నాడన్న మాట."
    
    "పిలుస్తానందిగా?"
    
    "దీనికంతటికీ కారణం ఆ సూరిగాడు" అసహనంగా అరిచాడు శౌరి. "ఆ రోజు తాగి మా చెల్లితో ఛాలెంజ్ చేసి వుండకపోతే ఆదిత్య అనే అనామకుడు రంగంలోకి వచ్చేవాడు కాదు.
    
    ఆదిత్య రంగంలోకి రానప్పుడు ప్రణయ వాడికి పరిచయమయ్యేది కాదు. ప్రణయ, ఆదిత్యలు కలిసి వుండకపోతే..."
    
    'నాకీ మనస్తాపం వుండేది కాదు' అనాలనుకున్నాడేమో కాని, శౌరికి ఆ అవకాశం ఇవ్వకుండా అర్ధోక్తిలోనే అన్నాడు సుధీర్- "మా టీంని గెలిపించటానికి ఆ ప్రొఫెసర్ రాధాకృష్ణని నువ్వు ఇన్ ఫ్లూయెన్స్ చేయాల్సిన అవసరం వుండేదీ కాదు...అలా చేయడం వల్లనే ప్రణయ వాళ్ళ బాబాయితో పేచీపడి బయటికొచ్చింది. ఇప్పుడు ఆదిత్యతో ఇంచుమించు కాపురం పెట్టినట్లు అర్ధరాత్రిదాకా..."
    
    ఓ యూనివర్సిటీ విద్యార్ధి అలా బజారు బాపతులా తోటి విద్యార్ధిని గురించి కామెంట్ చేయడం దారుణమే అయినా అదంత అసహజమయిన విషయం కాదు.
    
    సంస్కారానికి చదువుతో సంబంధంలేదని చాలాసార్లు నిరూపించిన శౌరి ముఖ్యమంత్రి కొడుకయితే, సుధీర్ ఓ సారాదుకాణంతో పైకెదిగిన ఎమ్మెల్యే కొడుకు.
    
    రోజూ, ఏడు చేపల కథలా కారణాల్ని సోదాహరణంగా ఆలోచిస్తూ ఆ ఉద్వేగంలో ఆదిత్య, ప్రణయలని ఇంకా అల్లరి చేయాలనుకోవడము ఒక్కటే కాదు- అక్కడ చర్చలో అసలు సిల్వర్ స్పాట్ కంపెనీ నిరవధికంగా క్విజ్ వాయిదా వేయడానికి ప్రణయ పరపతి కూడా కారణమై వుంటుందని బలంగా తేల్చేశారు.
    
    అయితే వారికి తెలియని విషయం మరొకటి వుంది.
    
    లోపల గదిలో నిద్రపోయిందనుకున్న ప్రబంధ వారి చర్చను వింది.
    
    ఆదిత్య, ప్రణయ దగ్గరకావడం మాత్రమేకాదు, క్విజ్ మాస్టర్ గా వున్న రాధాకృష్ణ మూలంగా తను క్విజ్ లో నెగ్గిన విషయమూ బోధపడిపోయింది ఆమెకు.
    
    రెండు విషయాల్లో ఆమెను ఏది ఎక్కువ బాధపెట్టిందో ఆమెకు తెలియదు కాని, రెండింటి గురించీ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ వుండిపోయింది.
    
    అహంకారిగా పెరిగినా, ప్రబంధ చాలా ఆత్మాభిమానంగల ఆడపిల్ల కూడా.
    
                                                                * * *
    
    ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని తిరిగి వచ్చిన ప్రణయ మొహంలో ఏ భావం కనిపించిందో- "ఏమైందీ?" అన్నాడు ఆదిత్య.
    
    "మామూలు ఫోనే."
    
    మొహంపై చిరునవ్వు పులుముకుమ్తూ సోఫాలో కూర్చుంది. "అవునూ... మీకు మధ్యలో కాస్త గడువు చిక్కిందిగా ఇంకా కాంప్లికేటెడ్ ప్రశ్నలేమన్నా ఆలోచించారా?"
    
    అప్పటికి టైం రాత్రి పదిన్నరకావడంతో అన్నాడు- "టైమ్ చాలా అయింది ఇక వెళ్ళనా?"
    
    అసలే ఫోన్ లో కామెంట్స్ కి చాలా అసహనంగా వుందేమో, ఇంకా మొండిగా ఆదిత్యతో కలసి తిరగాలన్న ఆలోచన కలిగిన ప్రణయ చిరుకోపంతో అంది- "ఓడించలేనన్న భయమా?"
    
    "అదికాదు."
    
    "అయితే మూడో ప్రశ్ననుంచి కంటిన్యూ చేయండి."
    
    "ఫుల్ అప్ ఇఫ్ ఐ ఫుల్ అప్" అన్నాడు సూటిగా చూస్తూ, "కంగారు పడకండి. ఈ వాక్యంలో ప్రత్యేకత ఏమిటి?"
    
    "ఓహ్! ఇందాక మీరు చెప్పలేకపోయిన నా వాక్యంలాంటి వాక్యాన్ని ఉపయోగించారన్న మాట. కాని నేను చెప్పేయగలను. వెనుక నుంచి ముందుకు చదివినా ఒకే వాక్యం కనిపించే 'పేలండ్రోం' మీరు ఉపయోగించిన వాక్యం."
    
    నివ్వెరపోయాడు. "అయితే అలాంటి పేలండ్రోం మీరొకటి వాక్యములా చెప్పండి."
    
    "మంచి అబ్బాయిలా కనిపించేమీరు ఓ కొటేషన్ ఎప్పుడూ గుర్తు వుంచుకోవాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS