Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 32


    "ఏమిటది?"
    
    "లివ్ నాట్ ఆన్ ఈవిల్."
    
    "థాంక్స్! గుర్తుంచుకుంటాను. ముందు నేనడిగిన పేలండ్రోం చెప్పండి."
    
    "నేను చెప్పింది అదే... లివ్ నాట్ ఆన్ ఈవిల్."
    
    నిజమే ఈ వాక్యం చివరినుంచి ముందుకు చెప్పినా వచ్చేది అదే వాక్యం.
    
    "సో మిస్టర్ ఆదిత్యా! నాలుగు ప్రశ్నలు వృధాగా పూర్తయిపోయాయి. కొంచెం జాగ్రత్తపడండి."
    
    అదో సవాల్ లా వుంది ఆదిత్యకి.
    
    "సరిగ్గా వినండి! ఎల్లుండి నిన్నయితే, వచ్చే ఆదివారం ఈ రోజు అవుతుంది. మరి మొన్న ఎల్లుండి అయితే ఈరోజు ఏమౌతుంది?"
    
    ఆమె విభ్రమంగా చూస్తోంది.
    
    మరోసారి రిపీట్ చేశాడు.
    
    ఒకటి రెండు కాదు- ఏనాభాయ్ సెకండ్లపాటు ఆలోచించి అంది- "తెలియదు ఆదిత్యా!"
    
    "పోనీ ఇంగ్లీష్ లో అడగనా?"
    
    "ప్రశ్న అర్ధమైంది! కాని జవాబు తెలీదు" భావరహితంగా అంది.
    
    "గుడ్! అయిదో ప్రశ్న నేను చెప్పలేకపోయాను."
    
    "ఇంతవరకూ ప్రపంచంలో అత్యధికమైన రెమ్యూనరేషన్ తీసుకున్న హాలివుడ్ నటుడు ఎవరు?"
    
    "మేర్లిన్ బ్రాండో సూపర్ మేన్ చిత్రంలో నటించినప్పుడు షూటింగుకి వచ్చింది పన్నెండురోజులు ఒక్కో రోజుకి కోటీ అయిదు లక్షల డాలర్లు తీసుకున్నాడు."
    
    "గుడ్! ఏడో ప్రశ్న- ప్రపంచ చరిత్రలో శరీరాన్ని పాయిజన్ ప్రూఫ్ గా మార్చుకున్న చక్రవర్తి వున్నాడు తెలుసా?"
    
    "ఆసియా మైనర్ లో పోంటస్ కి చెందిన మిత్రిడేట్స్ అనే చక్రవర్తి విషానికి శరీరం తట్టుకుని నిలబడాలని, తననెవరూ హత్య చేయకుండా కొద్ది కొద్దిగా విషాన్ని మింగే అలవాటు చేసుకుని చివరికి శరీరాన్ని పాయిజన్ ప్రూఫ్ గా మార్చుకున్నాడు. కాని క్రీస్తుపూర్వం అరవై మూడో సంవత్సరాన రోమన్స్ తో జరిగిన యుద్దంలో వారి చేతికి చిక్కకుండా ఆత్మహత్య చేసుకోవాలని విషం తాగాడు. పని చేయలేదది. అంతే! తన దగ్గరున్న బానిసని ఆదేశించి తల నరికించుకున్నాడు."
    
    ప్రణయ చెప్పిన జవాబు వింటూ ఎంత ఆశ్చర్యపోయాడంటే, ఆమెతో స్నేహం పొందటం చాలా గర్వపడాల్సిన విషయమనిపించింది. ఒక సిలబస్ అంటూ వుండని జనరల్ నాలెడ్జిపోటీలో ప్రణయలాంటి వ్యక్తిని ఢీకొనడం ఎంత కష్టమో అర్దమైపోయింది.
    
    "ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ముందు ఇరవై అయిదవ వార్షికోత్సవంలో ఆర్కెస్ట్రా నిర్వహించడానికి ఆహ్వానితుడయిన భారతీయుడు..."
    
    "జూబీన్ మెహతా!"
    
    "ఈ మధ్యనే చనిపోయిన ప్రముఖ రచయిత 'ఆర్ డాక్యుమెంట్' నవలలో 'ఆర్' అంటే?"
    
    "రీ కన్ స్ట్రక్షన్."
    
    "ఈ దేశంలో జరుగుతున్న దాని గురించి నెహ్రూ రాష్ట్రపతికి సగమే చెబితే, లాల్ బహదూర్ శాస్త్రి మూడోవంతు చెప్పేవాడు. ఇందిరాగాంధీ నాలుగో వంతు తెలియచేసేది. ఈ కామెంట్ చేసిన రాష్ట్రపతి ఎవరు?"
    
    "సర్వేపల్లి రాధాకృష్ణ."
    
    "టెలిస్కోప్ తో కాక, మేథమెటిక్స్ కాలుక్యులేషన్స్ ద్వారా తెలుసుకున్న మొదటి గ్రహం?"
    
    "నెఫ్ట్యూన్."
    
    "అంతరిక్ష ప్రయాణం చేసిన ఏస్ట్రోనాట్స్ కనీసం రెండంగుళాల పొడవు ఎక్కువౌతూ ఉంటారు కారణం?"
    
    "మన ఆకర్షణ శక్తికి అతీతంగా, ఇంచుమించు వెన్నెముక మీద ఎలాంటి వత్తిడి లేకుండా వుంటారు కాబట్టి వాళ్ళలోనే కాదు ప్రతి సాయం కాలమూ సుమారు ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు తగ్గిన మనిషి తెల్లవారేసరికి మళ్ళీ ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు పెరుగుతూంటాడు. దీనిక్కారణం పగటిపూట నిలబడ్డా, కూర్చున్నా వెన్నెముకలోని కార్డిలేజ్ డిస్క్స్ భూమి ఆకర్షణ శక్తికి కుంచించుకుపోతుంటాయి కాబట్టి."
    
    "వెరీ కరెక్ట్ మిస్ ప్రణయా! పదమూడో ప్రశ్న మనదేశంలో పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఆర్డినెన్స్ చెలామణీ అయ్యేకాలం ఎంత?"
    
    "ఏడున్నర నెలలు."
    
    "గాడ్!" ఇబ్బందిగా కదిలాడు. ఇక మిగిలింది రెండు ప్రశ్నలు. ఆమె ఎన్ సైక్లోపీడియాలా చకచకా చెప్పుకుపోయింది.
    
    "ఇంకా ఓ బుద్ధుడు రావాలి. అతడి పేరు?"
    
    "మైత్రేయ... గౌతముడి తరువాత అయిదువేల సంవత్సరాలకి ఈ నేలపైన అడుగుపెడతాడని బౌద్దమతం నమ్ముతుంది."
    
    అర నిమిషంపాటు సాలోచనగా వుండిపోయాడు.
    
    ఇప్పటికి ఇద్దరూ సమానంగానే వున్నారు. ఒకవేళ ఓడినా అదో సమస్యకానేకాదు. కాని ప్రణయను గెలవాలని అతడు బలంగా కోరుకుంటున్నాడు.
    
    ఆమె దృష్టిలో ఇంకా ఎదగాలన్న తాపత్రయమో, లేక గెలుపుపైన పెంచుకుంటున్న మక్కువో అతడికే తెలియడం లేదు.
    
    అతడి ఆలోచనల్ని గమనిస్తున్నట్లు నిశ్శబ్దంగా నవ్వుతోంది ప్రణయ.
    
    "ఓ! టెల్ హర్ బ్రీఫ్ ఈజ్ లైఫ్ బాట్ లవ్ ఈజ్ లాంగ్ అని చెప్పిన కవి ఎవరు?"
    
    నిర్లిప్తంగా వుండిపోయింది.
    
    అరనిమిషంపాటు గడిచింది.
    
    "సారీ!" అంది ఎటో చూస్తూ.
    
    "అంటే?" చాలా ఉద్విగ్నంగా వుంది ఆదిత్యకి.
    
    "గెలిచింది మీరే!" నెమ్మదిగా అంది. "సో! మన ఒప్పందం ప్రకారం మీరు చెప్పినట్టు నేను చేయాలి. ఏం చేయాలి నేను?" యధాలాపంగా అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS